ఈటల రాజేందర్ బ్యాక్ స్టెప్!
posted on May 5, 2021 @ 2:55PM
తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనంగా మారిన ఈటల రాజేందర్ ఎపిసోడ్ లో రోజుకో ట్విస్ట్ చోటు చేసుకుంటోంది. మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడంతో రగిలిపోతున్న ఈటల... కేసీఆర్ తో అమీతుమీకి సిద్ధమవుతున్నారనే ప్రచారం జరిగింది. ఈటల మద్దతుదారులు కూడా కేసీఆర్ కు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు. ఈటల సీఎం సీఎం అంటూ నినదిస్తున్నారు. రాజేందర్ కూడా హుజురాబాద్ లో వరుస సమావేశాలు నిర్వహిస్తుండటంతో .. ఆయన కార్యాచరణ ఎలా ఉండబోతుందన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. కారు సింబల్ తో గెలిచిన పదవి తనకు అక్కర లేదని ఈటల చెప్పడంతో.. ఎమ్మెల్యే పదవికి ఆయన రాజీనామా చేయడం ఖాయమని అంతా భావించారు.
ఈటల రాజేందర్ హుజూరాబాద్ పర్యటన తర్వాత సీన్ మారిపోయినట్లు కనిపిస్తోంది. ఈటలను కలిసిన మద్దతుదారులు.. రాజీనామాపై భిన్నాభిప్రాయాలు చెప్పారని తెలుస్తోంది. రాజీనామా చేసి కొత్త పార్టీ పెట్టాలని కొందరు కోరితే... ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయవద్దని మరికొందరు సూచించారట. ప్రభుత్వం ఏం చేయబోతోంది, కేసీఆర్ వ్యూహం ఏంటన్నదాని కోసం మరికొన్ని రోజులు ఎదురుచూస్తే బెటరని మరికొందరు నేతలు సూచించారని చెబుతున్నారు. దీంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే అంశంలో ఈటల రాజేందర్ కూడా పునరాలోచన చేస్తున్నారని తెలుస్తోంది. హైదరాబాద్ కు వెళ్లి మరికొందరు నేతలతో మాట్లాడాకే నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటున్నారు. ఎమ్మెల్యే పదవికి రాజేందర్ రాజీనామా చేయబోవడం లేదనే ఎక్కువ మంది ఈటల మద్దతుదారులు చెబుతున్నారు.
తన నియోజకవర్గ నేతలతో చర్చల తర్వాత మీడియాతో మాట్లాడిన ఈటల రాజేందర్ కూడా ఇదే రకమైన సంకేతం ఇచ్చారు. తనకు జరిగిన అన్యాయం భరించరానిదని కార్యకర్తలు అభిప్రాయపడ్డారని ఈటల రాజేందర్ చెప్పారు. తనను ఈ స్థాయికి తీసుకొచ్చిన వారి అభిప్రాయాలు తెలుసుకున్నానని చెప్పారు. రాష్ట్రంలోని అనేక నియోజకవర్గాల ఉద్యమకారులంతా సూచనలు ఇచ్చారన్నారు. 20 ఏళ్ల ఉద్యమ ఘట్టాలను కొందరు గుర్తు చేశారని చెప్పారు. ఏ నిర్ణయం తీసుకున్నా తన వెంటే ఉంటామని కార్యకర్తలు భరోసా ఇచ్చారని ఈటల తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ నుంచే కాకుండా ఖమ్మం సహా 9 జిల్లాల నుంచీ కార్యకర్తలు పరామర్శించేందుకు వచ్చారన్నారు. హైదరాబాద్‌లో ఉన్న ఆత్మీయులతో మాట్లాడుతానని.. వాళ్ళతో మాట్లాడి నిర్ణయం ప్రకటిస్తానన్నారు. ఆత్మ గౌరవం పెద్ద సమస్య అయ్యిందని పేర్కొన్నారు. సరైన సమయంలో సరైన నిర్ణయమని.. అందరూ అర్థం చేసుకోవాలన్నారు. సమస్య వస్తే మీ దగ్గరికే వస్తానని ఈటల వెల్లడించారు.