ఎర్రబెల్లీ కారు దిగేస్తున్నారా? కమలం గూటికా.. హస్తం నీడకా?
posted on Mar 20, 2024 @ 12:27PM
మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు కూడా కారు దిగేందుకు సిద్ధమైపోయారా? ఆయన కాంగ్రెస్ గూటికి చేరేందుకు తన శైలిలో తాను ఏర్పాట్లు చేసుకుంటున్నారా అంటే పరిశీలకులు అవుననే అంటున్నారు. అయితే ఆయన ప్రయత్నాలు రివర్స్ గేర్ లో ఉన్నాయంటున్నారు. కాంగ్రెస్ లోకి తనను ఆహ్వానించండంటూ ఆయన రివర్స్ లో సంకేతాలు పంపుతున్నట్లు విశ్లేషిస్తున్నారు.
ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో టచ్ లోకి వెళ్లారు. పార్టీ మారడం లేదనీ, నియోజకవర్గ సమస్యలు, అభివృద్ధి తదితర అంశాలపై ఆయనతో చర్చించేందుకు మాత్రమే రేవంత్ ను కలిశామని చెబుతున్నారు. బయటకు ఏం చెప్పినా వారంతా కాంగ్రెస్ పంచన చేరేందుకు సంసిద్ధంగా ఉన్నారనే బీఆర్ఎస్ హై కమాండ్ సహా అందరూ భావిస్తున్నారు. అయితే ఎర్రిబెల్లి స్టైల్ మాత్రం వారందిరికీ భిన్నంగా ఉందంటున్నారు. మీడియాలో కానీ, సోషల్ మీడియాలో కానీ ఎక్కడా ఎర్రబెల్లి బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి చేయి అందుకోవడానికి రెడీగా ఉన్నారంటూ వార్తలు రాలేదు. ఎర్రబెల్లి కూడా ఇప్పటి వరకూ కాంగ్రెస్ లీడర్లు ఎవరితోనూ భేటీ అయిన దాఖలాలు లేవు. అయితే ఎర్రిబెల్లి మాత్రం తాను కాంగ్రెస్ గూటికి చేరబోతున్నానంటూ వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమంటూ ఖండనలు చేస్తున్నారు. ఆ ఖండనలను చూసే రాజకీయవర్గాలు, పరిశీలకులు విస్తుపోతున్నారు. ఎవరూ అనకుండానే తాను ముందుగా తన కాంగ్రెస్ చేరిక వార్తలు అవాస్తవమంటూ ఎలుగెత్తడం వెనుక ఆయన ఏం చెప్పదలుచుకున్నారని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే విశ్లేషకులు మాత్రం ఎర్రబెల్లి హస్తం గూటికి చేరతాననీ, తనను ఆహ్వానించాలనీ కాంగ్రెస్ పెద్దలకు, లేదా ముఖ్యులకు సంకేతాలు ఇస్తున్నట్లుగానే ఆయన ఖండనలు ఉన్నాయని అంటున్నారు.
ఇంతకీ ఎర్రబెల్లి తనంతట తానుగా తాను బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతాననీ, తాను పార్టీ మారుతున్నట్లుగా వస్తున్న వార్తలను నమ్మవద్దనీ ప్రజలను కోరుతూ మీడియా సమావేశం ఎందుకు పెట్టడంపై బీఆర్ఎస్ శ్రేణుల్లో కూడా ఆశ్చర్యం వ్యక్తమౌతోంది. ఆయన ఉరుములేని పిడుగులా తన పార్టీ మార్పు విషయంపై ఎందుకు మాట్లాడుతున్నారన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
తాజాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎర్రబెల్లి పేరు కూడా వినిపించింది. మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు విచారణలో భాగంగా ఎర్రబెల్లి ప్రమేయం కూడా ఉందని తేలినట్లు వార్తలు వినవస్తున్నాయి. ఎర్రబెల్లి దయాకరరావు తన సొంత గ్రామంలో ఫోన్ ట్యాపింగ్ ల కోసం ఒక వార్ రూమ్ ను కూడా ఏర్పాటు చేసినట్లు వార్తలు వినవస్తున్నాయి. దీనిపై విస్తృతంగా చర్చ కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఎర్రబెల్లి తాను పార్టీ మారడం లేదంటూ మీడియా సమావేశం పెట్టి మరీ ప్రకటించడాన్ని పరిశీలకులు ఆయన తనను తాను కాంగ్రెస్ కు సరెండర్ చేసుకుని ఫోన్ ట్యాపింగ్ కేసు నుంచి బయటపడాలని భావిస్తున్నారని విశ్లేషిస్తున్నారు. అందులో భాగంగానే మీడియా సమావేశం ఏర్పాటు చేసి తన పార్టీ మార్పుపై వస్తున్న వార్తలను నమ్మవద్దంటూ చెప్పడం ద్వారా కాంగ్రెస్ ను తాను చేయి అందుకోవడానికి సిద్ధంగా ఉన్నానన్న సంకేతాలిచ్చారని అంటున్నారు.
అయితే కొందరు మాత్రం ఎర్రబెల్లి కాంగ్రెస్ గూటికి కాదు, బీజేపీ పంచన చేరుతారని అంటున్నారు. బీజేపీ తీర్థం పుచ్చుకోవడం ద్వారా ఈ కేసు నుంచి బయటపడాలని ఆయన భావిస్తున్నారంటున్నారు. ఎందుకంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో తనకు రాజకీయంగా బద్ధ విరోధులైన కొండా సురేఖ, కొండా మురళి దంపతులు కాంగ్రెస్ లో ఉన్నారు. పైగా కొండా సురేఖ రేవంత్ కేబినెట్ లో మంత్రిగా కూడా ఉన్నారు. దీంతో తాను చేరదామని ప్రయత్నించినా వారు అందుకు అంగీకరించే పరిస్థితి ఉండదు. మరీ ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో తన ప్రమేయం ఆధారాలతో బయటపడితే ముఖ్యమంత్రి రేవంత్ ఏ మాత్రం ఉపేక్షించకుండా చర్యలు తీసుకునే అవకాశం ఉందని ఎర్రబెల్లి భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో తనకు రక్షణ కల్పించగలిగేది బీజేపీయే అని ఆయన నమ్ముతున్నారని పరిశీలకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే తనక పార్టీ మారే ఉద్దేశం లేదని మీడియా సమావేశం పెట్టి మరీ చెప్పడం ద్వారా బీజేపీకి ఆయన తన చేరికపై సూచనప్రాయంగా సమాచారం ఇచ్చారని అంటున్నారు.