కంటోన్మెంట్ బిజెపికి షాక్... కాంగ్రెస్ లో చేరిన శ్రీ గణేష్ నారాయణ్
posted on Mar 20, 2024 @ 12:04PM
ఎమ్మెల్యే లాస్య నందిత మృతితో ఉప ఎన్నిక అనివార్యమైన సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో రాజకీయాలు ఊపందుకున్నాయి. డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సీటు నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన శ్రీగణేశ్ నారాయణన్ అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున ప్రజాయుద్ద నౌక, దివంగత గద్దర్ కూతురు వెన్నెల పోటీ చేసిన సంగతి తెలిసిందే. అయితే అనూహ్యంగా వెన్నెల ఓటమి పాలైంది. ఆమెపై బీఆరెస్ అభ్యర్థి లాస్య నందిత విజయం సాధించారు. ఎన్నికల షెడ్యూల్‌కు కొన్ని రోజుల ముందే గద్దర్ ఆకస్మిక మృతి చెందారు. ఆయన పట్ల ఉన్న అభిమానం, సానుభూతి నేపధ్యంలో వెన్నెల విజయం సాధిస్తారన్న అంచనాలకు భిన్నంగా నందిత విజయం సాధించారు. కంటోన్మెంట్ సిట్టింగ్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే సాయన్న ఆకస్మిక మృతితో ఆయన పెద్ద కూతురు లాస్యకు బిఆర్ఎస్ టికెట్ ఇచ్చింది. కెసీఆర్ ప్రభుత్వ వ్యతిరేకతతో తెలంగాణలో కాంగ్రెస్ విజయం సాధించినప్పటికీ కంటోన్మెంట్ స్థానంలో సెలబ్రిటీ హోదా ఉన్న గద్దర్ కూతురు ఓడిపోవడాన్ని ఎవరూ ఊహించలేకపోయారు. తొలుత అధిష్టానం వెన్నెలకు కాంగ్రెస్ టికెట్ ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేయలేదు. ఈ స్థానాన్ని పెండింగ్ లో పెట్టడంతో వెన్నెల ప్రెస్ మీట్ పెట్టి మరీ అధిష్టానాన్ని కోరారు.గద్దర్ బిఆర్ఎస్ ను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీకి మద్దత్తు ఇచ్చిన సంగతి తెలిసిందే. అపాయింట్ మెంట్ కోసం గత ముఖ్యమంత్రి కెసీఆర్ దర్గరికి వెళితే ప్రగతిభవన్ గేటు వద్ద గద్దర్ ఎండలో పడి గాపులు గాసిన వీడియోను ప్రతి పక్షాలు ప్రచారం చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ కంటోన్మెంట్ దక్కించుకోలేకపోయింది. వెన్నెల ఓటమితో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున అభ్యర్థి కోసం అధిష్టానం అన్వేషిస్తుంది. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి ఆయన శ్రీగణే ష్ నారాయణ్ హస్తం పార్టీ గూటికి చేరారు. టికెట్ హామీ ఇవ్వడంతో పార్టీ మారారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ నివాసంలో ఆ పార్టీ ఇతర నేతలు మైనంపల్లి హనుమంతరావు, మహేందర్‌రెడ్డి సమక్షంలో గణేశ్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సూచనతో కాంగ్రెస్ నేతలు మైనంపల్లి హనుమంతరావు, మాజీ మంత్రి మహేందర్‌రెడ్డి గణేశ్‌తో చర్చలు జరిపారు. కాంగ్రెస్ పార్టీలో చేరికపై శ్రీగణేశ్ మాట్లాడుతూ, సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం అభివృద్ధి కోసమే తాను పార్టీ మారానని అన్నారు. లోక్‌సభ ఎన్నికలతోపాటు కంటోన్మెంట్ నియోజకవర్గ ఉపఎన్నికలోనూ కాంగ్రెస్ సత్తాచాటుతుందని శ్రీగణేశ్ నారాయణన్ ఆశాభావం వ్యక్తం చేశారు. రెండు రోజులుగా పార్టీ అగ్రనేతలు, మాజీ ఎమ్మెల్యేలు పట్నం మహేందర్‌రెడ్డి, మైనంపల్లి హనుమంతరావుతో చర్చలు జరిపానని, సంప్రదింపులు సఫలీకృతమవడంతో కాంగ్రెస్‌లో చేరినట్లు వివరించారు. కాగా మంగళవారం మధ్యాహ్నం వరకు బీజేపీ తరపున ఆయన ప్రచారం చేశారు. మల్కాజిగిరిలో ఈటల రాజేందర్‌తో కలిసి ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అనూహ్యంగా గంటల వ్యవధిలోనే ఆయన పార్టీ మారడంపై బీజేపీ శ్రేణులు షాక్‌కు గురవుతున్నాయి.