టీఆర్ఎస్ పై ఎర్రబెల్లి ఫైర్.. సంతలో పశువుల్ని కొన్నట్టు కొంటున్నారు..
posted on Dec 12, 2015 @ 3:13PM
టీ టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు టీఆర్ఎస్ నేత కేసీఆర్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ ను అడ్డంపెట్టుకొని నేతలను సంతలో పశువులను కొంటున్నట్టు కొంటున్నారని విమర్శించారు. అంతేకాదు మంత్రులే బ్రోకర్ లా మారి నేతలను పార్టీల్లోకి లాక్కుంటున్నారని ఎద్దేవ చేశారు. జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులను సైతం కేసీఆర్ కొన్నారని.. అందుకే వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో ఎమ్మెల్సీ స్థానాలు గెలుచుకుంది.. అని వ్యాఖ్యానించారు. అంతేకాదు త్వరలో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరుగనున్నాయి.. అందుకే ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇళ్లు అంటూ హడావుడి చేస్తున్నారని అన్నారు. కాగా స్థానిక సంస్ధల ఎన్నికల్లో భాగంగా రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌లో టీడీపీ అభ్యర్ధులు బరిలోకి దిగుతున్నారని ఆయన చెప్పారు.
మరోవైపు మాజీ మంత్రి విజయరామారావు నిన్న టీడీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈయన టీఆర్ఎస్ లో చేరుతున్నట్టు వార్తలు కూడా వచ్చాయి. అయితే చంద్రబాబే స్వయంగా విజయరామారావుకి ఫోన్ చేసి పార్టీ మార్పుపై ఇంకోసారి ఆలోచించుకోమని.. తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని చెప్పడంతో విజయరావారావు సందిగ్ధంలో ఉన్నారు. అయితే ఇప్పుడు విజయరామారావు టీడీపీలోనే కొనసాగుతారని చెప్పారు. కానీ అధికారికంగా తెలియాల్సి ఉంది.