మూర్ఛ వ్యాధి లైఫ్ స్టైల్ ను ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసా?
posted on Jul 18, 2022 @ 9:30AM
మనిషిని అనారోగ్య సమస్యలు వేధిస్తూ ఉంటాయి. వాటిలో కొన్ని తాత్కాలిక ఉపశమనం తప్పితే శాశ్వత పరిష్కారం లేకుండా ఉంటాయి. దీర్ఘకాలిక మందుల వాడకం వల్ల తగ్గే అవకాశాలు ఉంటాయేమో కానీ అది కొద్దిశాతం మాత్రమే. వయసుతోను, జెండర్ తోనూ సంబంధం లేకుండా సమయం అంటూ లేకుండా అందరినీ ఇబ్బంది పెట్టె సమస్య మూర్ఛ రోగం. ఇది నరాల సంబంధ సమస్య వల్ల వస్తుంది. ప్రపంచంలో అందరినీ ఇబ్బంది పెడుతున్న నరాలకు సంబంధించిన నాలుగవ సమస్యగా మూర్చరోగం నమోదయింది.
మూర్చరోగానికి సంబంధించిన ఒక అధ్యయనంలో మెదడు పనితీరు గురించి ఒక విషయాన్ని తెలుసుకున్నారు. మూర్ఛ రోగులు నిద్రపోతున్న సమయంలో బయటి శబ్దాలకు స్పందించే లక్షణం సాధారణ వ్యక్తులకంటే ఎక్కువగా ఉంటుందట. అల్ఫా-బీటా తరంగాల స్థాయి వల్ల ఇందులో హెచ్చుతగ్గులు ఉండే అవకాశం కూడా ఉంటుంది.
అసలు సమస్య ఎక్కడ?? ఏంటి?
◆అల్ఫా-బీటా తరంగాలు క్షీణించిపోయి తక్కువ స్థాయిలో ఉంటే శబ్దాలకు స్పందించే గుణం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ గుణం వల్ల తరువాత ఏమి జరుగుతుందో అనే ఆలోచనా వలయం మెదడులో క్రమంగా పెరిగిపోతుందట. ఈ కారణం వల్ల మూర్ఛ రోగులు రాత్రి సమయాల్లో మెలకువ వచ్చి లేస్తే తరువాత నిద్రపోవడానికి చాలా ఇబ్బంది పడతారు.
◆మూర్ఛ రోగులలో మెదడులోని న్యూరాన్ లు వీణ మీద తీగల్లాగా ప్రవర్తిస్తాయి. అవి ఒక్కసారి కంపనానికి లోనైతే ఇక వాటి తాలూకూ శబ్దాన్ని రీసౌండ్ చేస్తున్నట్టు ఉంటాయి. మనిషి మానసిక పరిస్థితిని బట్టి వాటి శబ్ద తీవ్రత అనుభూతి చెందడంలో చాలా ఘోరమైన పరిస్థితులు ఎదుర్కుంటారు.
◆ ఈ పరిస్థితులు ఎలా ఏర్పడుతున్నాయి అనే విషయాలను పరిశోధకులు దగ్గరగా పరిశోధించినప్పుడు ఒక ఆసక్తికరమైన విషయం తెలిసింది. పరిశోధనలో మెదడులో కొన్ని ఎలాక్ట్రోడ్ లు అమర్చి లోపలి పనితీరు వ్యవస్థను గమనించినప్పుడు ఆశ్చర్యంగా మూర్ఛ సమస్య ఉన్న వాళ్లలో మెదడు కణాలు అన్నీ ఒకే విధంగా స్పందించాయి.
◆ 7 సంవత్సరాలలో సుమారు 700 మంది నుండి న్యూరాన్ ల డేటా ను సేకరించి పరిశీలించిన ఫలితాలలో మెదడు కణాలు నిద్రలో చాలా తీవ్ర స్థాయిలో స్పందించాయని తెలుసుకున్నారు.
◆ అంతర్జాతీయ స్థాయిలో జరిగిన ఈ పరిశోధనలు, వాటి ఫలితాలు, బాధితుల అనుభవాలను గమనిస్తే ఈ మూర్ఛ వ్యాధి అనేది మనుషులను ఎంతగా ఇబ్బంది పెడుతోందో అర్థం చేసుకోవచ్చు.
పరిష్కారం ఎలా?
ఇది పూర్తిగా నరాల సంబంధిత సమస్య. కొన్ని జన్యు పరంగానూ ఉండచ్చు, మరికొన్ని అకస్మాత్తుగా సంభవించేవి కావచ్చు. కొంతమందిలో ప్రమాదాలు జరిగినప్పుడు ఈ మార్చ వ్యాధి అటాక్ అవ్వచ్చు, మహిళల్లో ప్రసవ సమయంలో ఈ సమస్య ఎదురవ్వచ్చు. దీనికి స్వీయ పరిష్కారం ఏదైనా ఉందంటే అది ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం. నరాలను ఒత్తిడిలోకి నెట్టే ఆలోచనలు, శారీరక శ్రమ ఎక్కువ చేయకుండా ఉండటం మంచిది. జీవన విధానాన్ని ఆహ్లాదంగా ఉంచుకోవడం.
◆ నరాలకు శక్తిని ఇచ్చే ఆహారపదార్థాలు తీసుకోవాలి. నువ్వులు, నువ్వుల నూనె ఎంతో మంచివి.
◆ సహజసిద్ధమైన జీవన విధానానికి దగ్గరగా ఉండాలి. తిండి, నీరు, గాలి, నివసించే వాతావరణం విషయంలో జాగ్రత్తలు అవసరం.
◆ కుటుంబ సభ్యుల నుండి సహకారం అవసరం అవుతుంది. అనవసరపు గొడవలకు, రాద్ధాంతాలకు దూరం ఉండాలి. ముఖ్యంగా ఎమోషన్స్ ను బ్యాలెన్స్డ్ గా ఉండేలా చూసుకోవడం కుటుంబ సభ్యుల కర్తవ్యం.
ఇవన్నీ కేవలం జాగ్రత్తలు మాత్రమే. వైద్యులను సంప్రదించి మందులు వాడటం మంచి మార్గం. ఇలా చేస్తుంటే జీవన విధానంలో మూర్ఛ అనే సమస్య ప్రభావం కాసింత తక్కువే ఉంటుంది.
◆వెంకటేష్ పువ్వాడ.