కదిలితే జైలు.. మెదిలితే నిర్బంధం.. ఏపీలో అప్రకటిత ఎమెర్జెన్సీ!
posted on Oct 20, 2023 @ 10:33AM
ఏపీలో ఎమెర్జన్సీ అమలవుతున్నదా అన్న అనుమానం జనంలో కలుగుతోంది. ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన హక్కు స్వేచ్ఛ. కానీ, ఇప్పుడు ఏపీలో ఆ స్వేచ్ఛ లేనే లేదు. అడుగడుగునా ఆంక్షలు, ఎక్కడా లేని సవాలక్ష నిబంధనలు, ఏం చేయాలన్నా అనుమతి లేదని నిరాకరించే పోలీసులు. నిరసన మా హక్కు అని నిలదీస్తే కేసులు, జైలు అన్నట్లుగా ఉంది ఏపీలో పరిస్థితి. రాష్ట్రంలో ఒక విధమైన అరాచకం రాజ్యమేలుతోంది. రాష్ట్రంలో కదిలితే జైలు, మెదిలితే నిర్బంధం అన్నట్లుగా పాలన సాగుతోంది. దేశానికి స్వాతంత్య్రం రాకముందు ప్రజల పరిస్థితి ఎలా ఉండేదో అందరికీ తెలిసిందే. బహుశా ఆనాడు బ్రిటీష్ వారి పాలనను చూసిన వారు ఇప్పుడు ఉండరేమో కానీ.. దాదాపుగా అందరం ఆనాటి పాలన, పరిస్థితుల గురించి చదువుకొనే ఉంటాం. ప్రతి దానికి పన్నులు, అడుగు తీసి అడుగు పెట్టాలంటే ఆంక్షలు, ఉల్లంఘిస్తే కఠిన శిక్షలు వేసేవారు. కానీ, ఇప్పుడు ప్రతి మనిషి గౌరవప్రదంగా బ్రతికేలా రాజ్యాంగం హక్కులు కల్పించింది. అయితే ఏపీలో ఆ హక్కులని ప్రభుత్వమే కాలరాస్తున్నది.
తమ హక్కులను రక్షించుకోవడం కోసం ప్రజలు నిరసనలు తెలపడం కూడా ఒక హక్కే. ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు, ప్రతిపక్షాలు, వివిధ రంగాల కార్మికులు ఇలా ఎవరైనా తమ నిరసన వ్యక్తం చేయవచ్చు. కానీ, అలా నిరసన వ్యక్తం చేయడానికి ముందుకు వచ్చే వారిని అనుమతి లేదన్న పేరుతో పోలీసులు అడ్డుకుంటున్నారు. హౌస్ అరెస్టులు, అరెస్టులు, నిర్బంధాలు, కేసులతో వేధింపులకు గురి చేస్తున్నారు. ధిక్కరించి నిరసన మా హక్కు అంటూ నినదించే అవకాశం లేకుండా నిత్యం రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ అమలులో ఉంది. అటు పోలీస్ యాక్ట్ 30 సైతం అమలు చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించిన వారిపైనా, జీతాలు అడిగిన ఉద్యోగులపైనా పోలీసులు ఉక్కు పాదం మోపుతున్నారు. ఎప్పుడూ వినని, ఎక్కడా చూడని కఠినమైన సెక్షన్లను తెరపైకి తెచ్చి అమలు చేస్తున్నారు. ఎప్పుడో బ్రిటిష్ కాలం నాటి పోలీస్ సెక్షన్లను మళ్ళీ ఇప్పుడు తెరపైకి తెచ్చి కేసులు బుక్ చేస్తున్నారు.
సీఎం ఆ రూట్ లో వస్తున్నారంటే కనుచూపు మేరలో మనిషి కనిపించకూడదు. ఏ మాత్రం అనుమానం వచ్చినా వారిని గృహ నిర్బంధం చేయడం లేదా జైలుకు తరలించడం. తమకు అన్యాయం జరిగిందని నిరసన తెలిపేందుకు రోడ్డుపైకి వస్తే కనీసం మనిషిలా కూడా చూడకుండా ఈడ్చుకెళ్లి స్టేషన్ లో పడేయడం.. అక్రమ సెక్షన్లను బుక్ చేసి జైలు పాలు చేయడం. ఇక విపక్ష నాయకులదైతే మరీ దారుణ పరిస్థితి. అదుపులోకి తీసుకోమని పై అధికారుల ఆదేశాలంటూ పోలీసులు తీసుకెళ్లడం.. అసలు ఎక్కడకి తీసుకెళ్లారో కూడా తెలియక కుటుంబ సభ్యులు ఆందోళన చెందడం ఇప్పుడు ఏపీలో సర్వసాధారణంగా మారిపోయింది. అసలు ఎందుకు అరెస్ట్ చేసారో చెప్పమంటే పోలీసులు చెప్పే ఒకే ఒక్క సమాధానం ఉన్నతాధికారుల ఆదేశం. తాజాగా తెలుగుదేశం నాయకుడు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర తన తల్లిదండ్రుల పితృ కార్యాలను చేసుకోవడానికి వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. మీకు అనుమతి లేదంటూ వెనక్కు పంపించారంటే ఏపీలో ఎంతటి దౌర్భాగ్య స్థితి ఉందో అర్ధం చేసుకోవచ్చు.
వైసీపీ ప్రభుత్వం చేతిలో కీలు బొమ్మగా మారిపోయిన పోలీసు వ్యవస్థ ప్రజలను తీవ్రంగా వేధిస్తుంది. రక్షించాల్సిన భటులే భక్షక భటుల్లా మారిపోయారు. గతంలో ఏ ప్రభుత్వం ఇంతలా పోలీసులను ప్రయోగించిన దాఖలాలు లేవు. వైసీపీ సర్కార్ మాత్రం పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని బ్రిటీష్ పాలనను ప్రజలకు గుర్తు చేస్తున్నది. రాష్ట్రంలో అడుగడుగునా ఆంక్షలు అమలు చేస్తూ వైసీపీ పాలకులు రాక్షసానందం పొందుతున్నారు. ఇంతలా రాజ్యాంగ విరుద్ధమైన పాలన సాగుతున్నా.. ప్రజలను కాపాడేందుకు ఏ వ్యవస్థ కూడా ముందుకు రాలేని పరిస్థితి. జగన్ ఆడుతున్న రాజకీయ రాక్షస క్రీడలో పోలీస్ శాఖ పావుగా మారడం ఆందోళన కలిగిస్తున్నది. పగ, ప్రతీకారాల కోసమే ప్రభుత్వం పనిచేస్తున్నది. ఆ కార్యం తీర్చడానికి పోలీసులనే పావులుగా వాడుతున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.