ఫిబ్రవరి 2న ఎలక్షన్ షెడ్యూల్.. మార్చి 6న ఏపీలో ఎన్నికలు!
posted on Jan 3, 2024 @ 11:54AM
ఎన్నికల షెడ్యూల్ డేట్ ఫిక్స్ అయిపోయిందా? వచ్చే నెల 2నే సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల అవుతుందా? మార్చి మొదటి వారంలోనే ఏపీలో ఎన్నికలు జరుగుతాయా? అంటే విశ్వసనీయ వర్గాల నుంచి ఔననే సమాధానమే వస్తున్నది. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలుస్తున్నది.
2024 ఫిబ్రవరి 2న ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. మార్చి 6న ఎన్నికలు జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచార వేగాన్ని పెంచాయి. ఏపీలో ఓటర్ల జాబితా పై తీవ్ర ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. అధికార వైసీపీ ఓటర్ల జాబితాను ఇష్టారీతిగా ట్యాంపర్ చేసిందని తెలుగుదేశం తీవ్ర ఆరోపణలు చేసింది. ఓటర్ల జాబితాలో అవకతవకలను సరి చేయాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఆధారాలతో సహా అందిన ఫిర్యాదుల మేరకు తనిఖీలు చేపట్టిన కేంద్ర ఎన్నికల సంఘం ఆ ఆరోపణలు వాస్తవమేనని తేల్చింది. బాధ్యులైన అధికారులపై వేటు కూడా వేసింది. అన్ని అంశాలనూ పరిగణనలోనికి తీసుకుని ఓటర్ల జాబితాను తయారుచేసింది.
తాజాగా ఏపీలో వున్న ఓటర్ల సంఖ్యని ఎన్నికల సంఘం రిలీజ్ చేసింది. ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం ఏపీలో సుమారు 3 కోట్ల 69 లక్షల 33 వేల 91 మంది ఓటర్లు వున్నారు. ఇందులో పురుషుల ఓటర్లు 1,83,24,588 మంది వుండగా, మహిళలు 1,86,04,742 మంది వున్నారు. థర్డ్ జెండర్ ఓటర్లు 3,761 మంది వున్నారని ఎన్నికల సంఘం పేర్కొంది. రాష్ట్రంలో చంద్రగిరి నియోజకవర్గంలో అత్యధిక ఓటర్లు వుండగా, అత్యల్పంగా నర్సాపురం నియోజకవర్గంలో వున్నారని ఎన్నికల సంఘం నిర్ధారించింది.