గుంటూరు ఈస్ట్ అక్కుంబక్కుం.. కమేడియన్ ఆలీ ఎంద చేట..
posted on Jan 3, 2024 @ 10:49AM
జగమెరిగిన కమెడియన్ అలీకి జగన్ గత తొమ్మిదేళ్లుగా అరచేతిలో వైకుంఠం చూపించి మరీ త్రిశంకు స్వర్గంలో ఉంచుతున్నారు. బాలా నటుడిగా చిత్రపరిశ్రమలో అడుగుపెట్టిన అలీ ఇంతింతై వటుడింతై అన్నట్లు ఎదుగుతూ.. వందల్లో కాదు వేల సినిమాల్లో నటించారు. కమెడియన్ గానే కాకుండా కొన్ని సినిమాల్లో హీరోగా కూడా నటించి మెప్పించారు. అంతే కాకుండా అలీ తో సరదాగా అనే కార్యక్రమంతో టీవీ యాంకర్ గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మొత్తంగా తెలుగు సినిమా చరిత్రలో అలీ తనకంటూ ఒక స్థానాన్ని గౌరవాన్ని సంపాదించుకున్నారు. అందులో సందేహం లేదు.
అయితే ఎప్పుడైతే ఆలీ బుర్రలోకి రాజకీయం అనే పురుగు దూరిందో.. అప్పటి నుంచీ అలీ తన కీర్తిని, ప్రతిష్టను వైసీపీకి, ఆ పార్టీ అధినేత జగన్ కు తాకట్టు పెట్టేసి మరీ ఆశగా చట్ట సభలో ప్రవేశం కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఆయన కళ్లు కాయలు కాస్తున్నాయే తప్ప జగన్ మాత్రం అలీకి ఆ అవకాశం ఇవ్వడం లేదు. కానీ ప్రతి సారీ జగన్ మాత్రం ఎంతో నమ్మకంగా అలీకి మంచి అవకాశం ఇస్తానని చెబుతూ వస్తున్నారు. గతంలో ఒక సారి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆలీని లంచ్ కి ఇన్వైట్ చేసి మరీ త్వరలోనే గుడ్ న్యూస్ చేపుతానంటే, రాజ్యసభ గ్యారంటీ అని గాలిలో మేడలు కట్టేశారు. అయితే ఎంపీ, ఎమ్మెల్యే కాదంటే చివరకు ఏదో ఒక నామినేటెడ్ పదవి అంటూ కలలు కనేశారు. అలా జగన్ ఆలీని ఊరించి ఊరించి ఎట్టకేలకు ఒక నామినేటెడ్ కట్టబెట్టి చేతులు దులిపేసుకున్నారు. ఈ సారి కుదరలేదు.. నెక్స్ట్ టైం గ్యారంటీ అంటూ 2019 ఎన్నికలలో రిక్త హస్తం చూపించిన జగన్.. 2024 ఎన్నికల వరకూ ఆలీని కలల ప్రపంచంలో ఊరేగించారు.
ఇక్కడ ఒక్క సారి గతంలోకి వెడితే అలీ రాజకీయ ప్రవేశం ట్రయల్స్ తెలుగు దేశం టికెట్ కోసం ప్రయత్నించడంతో మొదలయ్యాయి. అప్పట్లో తెలుగుదేశం తరఫున రాజమండ్రి నుంచి టికెట్ ఖరారైపోయిందన్న స్థాయిలో ప్రచారం జరిగింది. అయితే ఆ ప్రచారం అంతా ఉత్తుత్తిదే అని తరువాత తేలిందనుకోండి అది వేరే సంగతి. ఆ తరువాత అలీ సినిమా పరిశ్రమలో తనకు అత్యంత ఆప్తుడు, మిత్రుడు అని చెప్పుకునే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేనలో చేరి రాజమండ్రి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఉవ్విళ్లూరారు. అయితే అప్పట్లో టీడీపీ, జనసేన పార్టీలకు బాగా దగ్గరగా మెసిలిన అలీ.. ఆ రెండు పార్టీలలో టికెట్ రాదన్న కన్ఫర్మ్ చేసుకున్న తరువాత జగన్ పంచన చేరి వైసీపీ కండువా కప్పుకున్నారు.
2019 ఎన్నికలలో వైసీపీ తరఫున పలు నియోజకవర్గాల్లో ప్రచారం కూడా నిర్వహించారు. అయితే ఆయనకు ఆశించిన విధంగా ఎమ్మెల్యే టికెట్ మాత్రం రాలేదు. పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత తీరిగ్గా మూడేళ్లు గడిచిపోయిన తరువాత పార్టీకి అలీ చేసిన సేవలను గుర్తించిన జగన్ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు పదవితో సరి పెట్టారు. అప్పటికే అన్ని ఆశలూ వదిలేసుకున్న అలీ సలహాదారు పదవితో సంబరపడిపోయి.. తన స్థాయికి మించిన ప్రకటనలు చేశారు. సినీ పరిశ్రమలో అలీ తనకు అత్యంత ఆప్తుడిగా చెప్పుకునే పవన్ కల్యాణ్ పైనే పోటీకి సై అంటూ కామెడీ డైలాగులతో సవాళ్ళూ చేసేశారు.
ఇప్పుడు ప్రస్తుతానికి వస్తే.. సలహాదారు పదవితో సముదాయించిన సందర్భంలోనే జగన్ వచ్చే ఎన్నికలలో అసెంబ్లీకి పోటీ చేసే చాన్స్ ఇస్తానని హామీ ఇచ్చారని అలీ అప్పట్లో చెప్పుకున్నారు. అంతే కాకుండా 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ గ్యారంటీ అన్న ధీమాతో, అదీ గుంటూరు ఈస్ట్ అయితే తనకు అన్ని విధాలుగా విజయావకాశాలు ఉంటాయనీ భావించి అక్కడ పని చేసుకోవడం ప్రారంభించారు. అయితే జగన్ ప్రకటించిన నియోజకవర్గాల ఇన్ చార్జిల జాబితాలో గుంటూరు ఈస్ట్ నుంచి ఆలీ పేరు లేదు. అక్కడ నుంచి షేక్ నూరి ఫాతిమాను ఎమ్మెల్యే అభ్యర్థిగా ఖరారు చేశారు. దీంతో ఆలీకి జగన్ మరోసారి రిక్తహస్తమే చూపారని తేటతెల్లమైపోయింది. మొత్తం మీద అన్నం పెట్టిన సినీ పరిశ్రమలో అయిన వాళ్లని కాదనుకుని మరీ జగన్ పంచన చేరిన అలీ తన ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆశలు మరోసారి ఆవిరైపోయాయనే అంటున్నారు.