Read more!

ఏపీలో ప్రాణం తీసిన పెన్షన్!

భయపడినట్టే జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో అధికారులు ఇంటింటికి వెళ్ళి ఇవ్వాల్సిన పెన్షన్‌ జగన్ పుణ్యమా అని బ్యాంకులకు వెళ్ళి తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.  మామూలు రోజుల్లో అయితే ఏలాగోలా సర్దుబాటు చేసుకునేవారే, ఎండలు మండిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో కూడా వృద్ధులను బ్యాంకుల చుట్టూ తిప్పేలా చేయడం నిజంగా పాపం. ఆ పాపం శాపంలా మారి జగన్ ప్రభుత్వానికే తగలడం ఖాయం. రాయచోటిలో పెన్షన్ కోసం కెనరా బ్యాంకుకు వెళ్ళిన ముద్రగడ సుబ్బన్న అనే 80 సంవత్సరాల వృద్ధుడు బ్యాంక్ ఎదుట నిలబడి వుండగానే కిందపడిపోయి చనిపోయాడు. ప్రభుత్వ నిర్లక్ష్యం ఒక ప్రాణాన్ని బలి తీసుకుంది. 

వృద్ధుల ఇళ్ళకు వెళ్ళి పెన్షన్లు ఇవ్వడానికి సరిపోయేంత ప్రభుత్వ సిబ్బంది వున్నప్పటికీ అలా చేయకుండా అందరూ బ్యాంకులకు వెళ్ళాల్సిందే అనే రూల్ పెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా బ్యాంకుల ముందు అనేకమంది వృద్ధులు మండుటెండలో పడిగాపులు కాస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి బ్యాంకులకు వచ్చిన వృద్ధులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. బ్యాంకులకు వచ్చిన వృద్ధులు అందరికీ పెన్షన్ అందుతోందా అంటే అదీ లేదు. చాలామంది వృద్ధుల అకౌంట్లో పెన్షన్ డబ్బు జమ కాలేదు.. వాళ్ళని తర్వాత రమ్మని  చెప్పి పంపేస్తున్నారు. దాంతో వృద్ధులు ఉసూరుమంటూ వెనుదిరుగుతున్నారు. కొందరిని అయితే, మీ బ్యాంక్ అకౌంట్ ఆధార్‌కి అనుసంధానం కాలేదంటూ పంపేస్తున్నారు. పెన్షన్ తీసుకున్నవారితోపాటు తీసుకోనివారు కూడా తమను ఇంత ఇబ్బంది పెట్టిన జగన్ ప్రభుత్వాన్ని తిట్టుకుంటూ శాపనార్థాలు పెడుతున్నారు.