పాస్టర్ల పాపాలకు శిక్షలు ఉండవా?
posted on Jul 13, 2021 @ 2:37PM
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచింది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో, దొమ్మీలు, దోపిడీలు,ఆర్థిక నేరాలు మాత్రమే కాదు, అమానవీయ నేరాలు, ఘోరాలు యధేచ్చగా జరుగుతున్నాయన్న ఆరోపణలు తరచూ వినవస్తూనే ఉన్నాయి.
ఇటీవల సీతానగరం పుష్కర ఘాట్ వద్ద జరిగిన అత్యాచారం ఘటన రాష్ట్రంలో పరిస్థితికి అడ్డం పడుతోంది. సీతానగరం పుష్కర ఘాట్ కూత వేటు దూరంలోనే ముఖ్యమంత్రి అధికార నివాసం ... మూడే మూడు కిలో మీటర్ల దూరంలో పోలీసు బాస్ హెడ్ క్వార్టర్స్...ఉన్నాయి. అయినా ... కొద్ది కాలం క్రితం సీతానగరం పుష్కర ఘాట్ వద్ద కామాంధులు ఒక యువతిపై ‘నిర్భయం’ గా సాముహిక అత్యాచారం జరిపి .. ఇంచక్కా పడవెక్కి వెళ్లి పోయారు. ఈ దుర్ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రాష్ట్రంలో మహిళల భద్రత ఎంత సుందర ముదనష్టంగా వుందో చెప్పేందుకు ఈ ఒక్క సంఘటన చాలు. అయితే, ఇదొక్కటే కాదు, ఎక్కడో అక్కడ మహిళలు, చివరకు ముక్కు పచ్చలారని చిన్నారులు కూడా ప్రతి రోజు మృగాళ్ళ కామానికి బలై పోతూనే ఉన్నారు. రాష్ట్రంలో మహిళలు, బాలికలపై అత్యాచారాలు వంటి అఘాయిత్యాలకు పాల్పడితే, 21 రోజుల్లోనే తీర్పు ఇచ్చేలా చేసిన ‘దిశ’ చట్టం వుంది. ఈ మధ్యనే దానికో యాప్’ ను కూడా యాడ్ చేశారు. ఏమి చేసినా నేరాలు, ఘోరాలు తగ్గడం లేదు. దిశ చట్టం వచ్చి రెండు సంవత్సరాలు అయినా ఇంతవరకు ఒక్కరికీ, చట్టం పరిధిలో శిక్ష పడిన దాఖలాలు లేవు.
అలాగని, రాష్ట్రంలో మృగాళ్ళు అంతా ఒక్కసారిగా ముఖ్యమంత్రి పవిత్ర బోధనలతో మారి పోయారా... మంచి వాళ్ళు అయి పోయారా .. లేదు .., ప్రతి రోజు మహిళలు మానభంగాలకు గురవుతూనే ఉన్నారు .. చిన్నారులు చితికి పోతూనే ఉన్నారు. వావి వరసలు, వయో బేధాలు లేకుండా అత్యాచారాలు జరిగిపోతూనే ఉన్నాయి. పసి కందు, ఒందు ముసలి ఎవరినీ వదలడం లేదు. చివరకు, దైవ దూతలుగా గుర్తించి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, దయార్ద హృదయంతో నెలకు ఐదు వేల రూపాయల వంతున ఇచ్చి పోషిస్తున్న పాస్టర్లు కూడా ... చిన్నారులపై అత్యాచారాలు, లైంగిక హింసకు పాల్పడుతున్నారు. దేవుని దయతో ... ప్రభువుల చల్లని చూపులతో, ‘దిశ’ దృష్టి తమ మీద పడకుండా రక్షణ కూడా పొందుతున్నారు.
ఇందుకో తాజా ఉదాహరణ...
అతని పేరు అలవల సుధాకర్, పేరు చూసి మోస పోకండి, అతనొక పాస్టర్. ఎస్ .. పాస్టర్ , క్రైస్తవ మత బోధకుడు. వయసు 46 సమ్వత్సరాలు. అతగాడు, తూర్పు గోదావరి జిల్లా కాకినాడ గ్రామీణ మండలంలో ఓ పదేళ్ళ పసికందు పై కన్నేశాడు. జూన్ 22 న ఆ చిన్నారికి మాయ మాటలు చెప్పి, ఉరుకు దూరంగా పొలాలలోకి తీసుకెళ్ళాడు. చిన్నారి జీవితాన్ని చిదిమేసే ప్రయత్నం చేశాడు. లైగింకంగా హింసించాడు. ఆ పాప బాధను తట్టుకోలేక గగ్గోలు పెట్టి గోల చేస్తే,చివరకు ఆ పిల్ల చేతిలో ఓ యాభై నోటు పెట్టి, ఏమి జరిగిందో ఎవరికీ చెప్పవద్దని ఓ హెచ్చరిక చేసి వెళ్లి పోయాడు. విషయం తెలిసి, ఆ బాలిక తల్లి సర్పవరం పోలీసు స్టేషన్’లో ఫిర్యాదు చేశారు. పోలీసులు పాస్టర్’ను అరెస్ట్ చేశారు. ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేశారు. పోస్కో (లైంగిక వేధింపుల నుంచి బాలికల సంరక్షణ చట్టం), ఇతర ఐపీసీ సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు.
కానీ, ఆ బాలిక దళిత మైనారిటీ వర్గానికి చెందిన బాలిక అయినా పోలీసులు, ఉద్దేశపూర్వకంగానే ఏసీఎస్టీ (అత్యాచార నిరోధక) చట్టం పరిధిలో కేసు నమోదు చేయలేదు. పోలీసులు పాపులను రక్షించే పాస్టర్’ ను రక్షించడం తమ బాధ్యత అనుకున్నారో, పెద్దాయన కోపానికి గురై శిలువ ఎక్కడం ఎందుకు అనుకున్నారో, గానీ, పాస్టర్ పేరు, కలవల గంగాధర్ అలియాస్ సుధాకర్ అని చెప్పి వదిలేశారు. పాస్టర్ వాస్తవ నామధేయం (అసలు పేరు), వారి తండ్రి పేరు, కులం, గోత్రం, వయసు, వృత్తి వంటి వివరాలను ఎఫ్ఐఆర్’లో మెన్షన్ చేయలేదు. ఇలా ఎందుకు చేశారు అని బాధితులు ప్రశ్నిస్తున్నారు. పాపులను రక్షించే పవిత్ర కార్యంలో ఉన్న పాస్టర్లు చేసే పాపాలు పాపాలు కావా? జగన్ రెడ్డి ప్రభుత్వం అలాంటి చట్టం ఏమైనా చేసిందా? అని, ఎస్సీఎస్టీ హక్కుల వేదిక నాయకులు ప్రశ్నిస్తున్నారు. అంతే కాదు, ఈకేసును విచారిస్తున్న పోలీసు అధికారులు, నిందితుని రక్షించేందుకే నిజాలను దాచి పెడుతున్నారని ఆరోపిస్తున్నారు. పాస్టర్లు అయితే ఏ పాడుపని అయినా చేయవచ్చునా? అందుకేనా ప్రభుత్వం వారికి నెలనెలా ఐదు వేల రూపాయలు ఇస్తోంది? అని ప్రశ్నిస్తున్నారు.
రాష్ట్రంలో జగన్ రెడ్డి పాలనలో, దళితులకు న్యాయం జరగదని నిర్ణయానికి వచ్చిన హక్కుల సంస్థ జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్’ను ఆశ్రయించాలని నిర్ణయించారు ... అక్కడిన చిన్నారికి న్యాయం జరుగుతుందా ... పాపులకు శిక్ష పడుతుందా..