ప్రియురాలి పెళ్లి.. ప్రియుడు యూట్యూబ్ మంత్రం.. చివరికి..
posted on Jul 13, 2021 @ 2:03PM
ప్రేమ అదొక అందమైన ప్రపంచం.. ఆ ప్రపంచం ఆశపడిన అందరికి దొరకదు.. అలా అని ప్రేమ లేకుండా జీవితం ఉండదు.. ఈ ప్రాసెస్ లో కొంతమంది ప్రేమ చిరస్థాయిగా ఉండిపోతుంది.. మరి కొందరి ప్రేమ మధ్యలోనే వర్షానికి కిందపడిన వృక్షంలా కూలిపోతుంది.. అంతమాత్రానా తమకు ప్రియురాలి ప్రేమ దక్కలేదని కోపంతో అబ్బాయిలు ప్రేమోన్మాదులుగా మారుతున్నారు.. వారు ప్రేమించిన అమ్మాయిలపై యాసిడ్, కత్తులతో దాడి చేయడానికి సిద్దపడుతున్నారు. ఇంకొంత మంది తాను ప్రేమించిన అమ్మాయికి.. అబ్బాయికి పెళ్లి అయిపోతే వాళ్ళు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి అనుకునే వాళ్ళు కూడా లేకపోలేదు.. ఇలాంటి సంఘటనలు చాలా చూశాం.. కానీ అమ్మాయి తన ప్రేమను తిరస్కరించిందని ఓ ప్రబుద్దుడు చేసిన పని అందరిని విస్మయానికి గురి చేసింది. ఆమె పెళ్లి చేసుకుని వెళ్లిపోయినా వదలకుండా మంత్రాలతో లొంగదీసుకోవాలని యత్నించి అడ్డంగా బుక్కయ్యాడు ఓ ప్రబుద్ధుడు. ఆమె మెట్టినింటి ముందు చేతబడి చేయడంతో కుటుంబ సభ్యులు బెంబేలెత్తిపోయారు. ప్రేమోన్మాది చేష్టలతో కుటుంబసభ్యులు, స్థానికులు ఇబ్బందిపడ్డారు. ఈ షాకింగ్ ఘటన నల్గొండలో కలకలం రేపింది.
అది తెలంగాణ. నల్గొండ జిల్లాకు చెందిన వ్యక్తి. అతని పేరు మురళి. అతనికి కొన్నిరోజుల క్రితం రాంగ్ కాల్‌లో యువతి పరిచయమైంది. అలా రాంగ్ కాల్ లో తగిలిన అమ్మాయికి మురళికి మధ్య స్నేహం కుదిరింది.. ఆ సాకుతో ఇద్దరు అప్పుడప్పుడూ కాల్స్ చేసుకునేవారు. చివరికి ఆ రాంగ్ కాల్ పరిచయం ప్రేమిస్తున్నాననంటూ మురళి చెప్పడంతో ఆమె సున్నితంగా తిరస్కరించింది. తనకు అలాంటి ఉద్దేశం లేదని, తానూ ఇన్ని రోజులు మాట్లాడించి స్నేహపూర్వముగా అని తేల్చి చెప్పేసింది. ఇక అప్పటి నుండి ఆ అమ్మయికి మురళి తల నొప్పిగా మారాడు. ఆమెను నీడలా వెంటాడడం మొదలుపెట్టాడు. అయితే ఆమెకు ఇటీవల పెళ్లైంది. ఈ విషయం తెలిసి మురళి కోపం రెట్టింపు అయింది. బాధతో రగిలిపోయాడు. ఇక అక్కడితో ఆగక నేరుగా ఆ అమ్మాయి భర్త ఫోన్ నెంబర్ కనుక్కుని ఆమె భర్తకే ఫోన్ చేసి బెదిరింపులకు దిగాడు.
అంతటితో శాంతించని మురళి ఎలాగైనా ఆ అమ్మాయిని దక్కిచుకోవాలనుకున్నాడు. అందుకు అతను వేసిన పథకమే మంత్రశక్తి. ఆ మంత్రశక్తితో ఆమెను వశం చేసుకోవాలనుకున్నాడు ఆ ప్రబుద్దుడు. అందుకు అన్ని రంగం సిద్ధం చేశాడు. ఒక రోజు యువతి మెట్టినింటి ముందు క్షుద్రపూజలకు పూనుకున్నాడు. ఇంటి ముందు ఎముకలు, నిమ్మకాయలు, కుంకుమ, గుడ్డముక్కలు సహా క్షుద్రపూజలకు వినియోగించే వస్తువులు ఉంచాడు. ఇక అంతే వాటిని చూసిన యువతి అత్తగారింటి వాళ్ళు భయంతో వణికిపోయారు. మురళి పిచ్చి చేష్టలతో విసిగిపోయిన బాధితురాలు చూసి చూసి చివరికి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడు మురళిని అరెస్టు చేశారు. యూట్యూబ్, ఫేస్‌బుక్‌లో చూసి క్షుద్రపూజలు చేర్చుకున్నట్టు మురళి చెప్పడంతో అంతా షాక్ అయ్యారు. వీడెవడండి బాబూ, ఇదేం ప్రేమరా నాయనో అని తల పట్టుకుంటున్నారు.