నాలెడ్జ్ బేస్డ్ సొసైటీ నిర్మాణంలో యూనివర్సిటీలదే కీలక పాత్ర : లోకేష్
నాలెడ్జ్ బేస్డ్ సొసైటీని నిర్మించడంలో విశ్వవిద్యాలయాలదే కీలక పాత్ర అని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని పబ్లిక్ యూనివర్సిటీల వైస్ చాన్సలర్లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సమావేశానికి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… వైస్ చాన్సలర్లు కేవలం పరిపాలనాధిపతులు కాకుండా విద్యారంగ సంస్కరణలకు అంబాసిడర్లుగా వ్యవహరించాలని సూచించారు. పుట్టినరోజు రోజున కూడా సమావేశానికి హాజరైన గవర్నర్ అబ్దుల్ నజీర్ అంకితభావం అందరికీ స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు.
పాదయాత్రలో యువత ఆశలు చూశాను
తన సుదీర్ఘ పాదయాత్రలో ఆంధ్రప్రదేశ్ యువతను ప్రత్యక్షంగా కలిశానని, ఉన్నత విద్య పూర్తిచేసినా ఉద్యోగ భవిష్యత్‌పై గందరగోళంలో ఉన్నారని లోకేష్ తెలిపారు. యువత ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలనే సంకల్పంతోనే సవాళ్లతో కూడిన విద్యాశాఖను స్వీకరించానన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా రాజకీయ నాయకుడు హెచ్ఆర్‌డీ శాఖ చేపట్టడం ఇదే తొలిసారి అని వ్యాఖ్యానించారని గుర్తు చేశారు.
ఐదు కీలక సవాళ్లు
పబ్లిక్ యూనివర్సిటీల బలోపేతానికి ఐదు ప్రధాన అంశాలపై దృష్టి పెట్టాలని వీసీలను లోకేష్ కోరారు. బోధన–అవసరాల మధ్య వ్యత్యాసం, కాలానుగుణంగా సిలబస్ మార్పులు, ఉద్యోగావకాశాలు లేని డిగ్రీలు, పరిశ్రమలతో బలహీన అనుసంధానం, ప్రయోజనం లేని పరిశోధనలు, ఆవిష్కరణల లోపం, పరిపాలనపై అధిక సమయం, అకడమిక్ ప్రమాణాలపై తక్కువ దృష్టి, విద్యార్థుల అనుభవంలో సమానత్వం, మానసిక మద్దతు లోపం
స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ ఉదాహరణగా తీసుకుని, ప్రపంచ స్థాయిలో పోటీ పడాలంటే పాఠ్యాంశాలను తరచుగా పూర్తిస్థాయిలో నవీకరించాల్సిన అవసరం ఉందని లోకేష్ తెలిపారు.
విద్య–ఉపాధి మధ్య వారధిగా యూనివర్సిటీలు
డిగ్రీలు ఉపాధిని, ఆత్మగౌరవాన్ని తీసుకురావాలని స్పష్టం చేసిన లోకేష్… పట్టభద్రులు అమీర్‌పేటలో నాలుగు నెలల శిక్షణ తీసుకుని ఉద్యోగాలు పొందుతున్న పరిస్థితి మన సంస్థల వైఫల్యమేనన్నారు. ఇంటర్న్‌షిప్‌లు, అప్రెంటిస్‌షిప్‌లు, పరిశ్రమ ఆధారిత కోర్సులు కీలకమని తెలిపారు.
పరిశోధన సమస్యల పరిష్కారానికి ఉపయోగపడాలి
పరిశోధన అనేది కేవలం జర్నల్స్‌కే పరిమితం కాకుండా నీటి కొరత, వాతావరణ మార్పులు, వ్యవసాయం, ప్రజారోగ్యం వంటి సమస్యలకు పరిష్కారాలు అందించే దిశగా సాగాలన్నారు. స్టార్ట్‌అప్స్, పేటెంట్లు, టెక్నాలజీ బదిలీలు యూనివర్సిటీల బలాన్ని పెంచుతాయని పేర్కొన్నారు.
విద్యార్థులతో నేరుగా మాట్లాడండి
వైస్ చాన్సలర్లు ప్రతి వారం కొద్ది గంటలైనా విద్యార్థులతో నేరుగా మాట్లాడే “ఓపెన్ హౌస్” కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. విద్యార్థుల అనుభవాలను పట్టించుకోని విశ్వవిద్యాలయాలు ఎంత ప్రతిష్టాత్మకమైనవైనా సమయానుకూలత కోల్పోతాయని హెచ్చరించారు.
ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయాలే లక్ష్యం
ప్రపంచ స్థాయి పబ్లిక్ విశ్వవిద్యాలయాలే రాష్ట్ర లక్ష్యమని, ఈ దిశగా పూర్తి స్వతంత్రత, ప్రతిభకు గౌరవం ఇస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. ఈ సమావేశం నుంచి విద్యారంగంలో సరికొత్త ప్రయాణం ప్రారంభం కావాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ సమావేశంలో రాష్ట్ర మానవ వనరుల శాఖ కార్యదర్శి కోన శశిధర్, ఉన్నత విద్యామండలి చైర్మన్ కె. మధుమూర్తి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్ పాల్గొన్నారు.