టీఆర్ఎస్ ఎమ్మెల్యే మృతి.. సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్ర్భాంతి
posted on Aug 6, 2020 9:25AM
టీఆర్ఎస్ నేత, సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కొద్ది రోజులుగా చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం విషమించడంతో ఈ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.
దుబ్బాక మండలం చిట్టాపూర్ గ్రామానికి చెందిన రామలింగారెడ్డి.. టీఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కు సన్నిహితుడిగా ఉన్న ఆయన.. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పని చేశారు.
రామలింగారెడ్డి తొలుత దాదాపు పాతికేళ్ళ పాటు జర్నలిస్టుగా పని చేశారు. అప్పటి పీపుల్స్‌వార్ సంస్థతో సంబంధాలున్నాయనే నెపంతో ఆయనపై టాడా కేసు నమోదు చేశారు. దేశంలోనే మొట్టమొదటి టాడా కేసు రామలింగారెడ్డిపై నమోదు కావడం గమనార్హం.
2004లో రామలింగారెడ్డి రాజకీయరంగ ప్రవేశం చేశారు. 2004లో మొదటి సారిగా టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం 2008 (ఉప ఎన్నికలు), 2014, 2019 ఎన్నికల్లో విజయం సాధించారు.
ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణం పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఉద్యమ సహచరుడిగా, ఒకే ప్రాంత వాసిగా తనతో ఎంతో అనుబంధం ఉందని సీఎం గుర్తుచేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థించారు.