1198 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు
posted on Jan 2, 2026 @ 11:35AM
ప్రపంచ వ్యాప్తంగా బుధవారం (డిసెంబర్ 31) రాత్రి నుంచి గురువారం (జవవరి 1) తెల్లవారు జాము వరకూ నూతన సంవత్సర వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. విశ్వనగరం హైదరాబాద్ లో కూడా నూతన సంవత్సరానికి గ్రాండ్ వెల్కమ్ చెబుతూ పలు ఈవెంట్లు జరిగాయి. న్యూ ఇయర్ వేడుకలలో నగర యువత యువత ఆటపాటలతో సందడి చేశారు. సంబరాలు జరుపుకున్నారు. అదే సమయంలో మందుబాబులు కూడా పండుగ చేసుకున్నారు. పబ్ లు బార్ లలో అర్ధరాత్రి వరకూ తాగి చిందులేశారు. అక్కడితో ఆగకుండా నిబంధనలను ఉల్లంఘించి డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి పోలీసులకు పట్టుబడిన వారి సంఖ్య కూడా హైదరాబాద్ లో అధికంగానే ఉంది.
మద్యం సేవించి రోడ్లపైకి వాహనాలతో వచ్చిన వారికి పోలీసులు గట్టి షాక్ ఇచ్చారు. నగర వ్యాప్తంగా అన్ని కీలక ప్రాంతాలలోనూ డంక్ అండ్ డ్రైవ్ నిర్వహించి మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిని అడ్డుకున్నారు. భారీగా జరిమానాలు విధించారు. గురువారం డిసెంబర్ 31) అర్ధరాత్రి ఒక్క హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే 1,198 మందిపై డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. మద్యం మత్తులో డ్రైవింగ్ చేసిన వారి వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. బుధవారం రాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకు ఈ స్పెషల్ డ్రైవ్ కొనసాగింది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.