పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక.. ప్రచారంపై డ్రోన్లతో నిఘా
posted on Aug 6, 2025 @ 9:36AM
పులివెందుల అంటే జగన్ అడ్డా. అలాంటి అడ్డాలో జగన్ పార్టీ ఎదురీదుతోంది. ఔను పులివెందుల జడ్పీటీసీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికలో విజయం కోసం వైసీపీ చమటోడుస్తోంది. అయినా కూడా విజయంపై ఆ పార్టీ శ్రేణులకు విశ్వాసం కలగడం లేదు. వాస్తవానికి పులివెందులలో ఇజ్పుడు జరగనున్నది ఒక మండలానికి సంబంధించిన జడ్పిటిసి ఉప ఎన్నిక. అయినా కూడా రాజకీయ వేడి అమాంతంగా పెరిగిపోయింది. సార్వత్రిక ఎన్నికలకు మించిన టెన్షన్ వాతావరణం నెలకొంది.
శాంతి భద్రతల సమస్య తలెత్తే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. దీంతో పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల విషయంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రచారంపై డ్రోన్ కెమేరాలతో నిఘా పెట్టారు. జిల్లా ఎస్పీ స్వయంగా ఎన్నికల ప్రచారాన్ని, పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. వివాదాలకు తావు లేకుండా, ఆరోపణలకు అవకాశం లేకుండా ప్రశాంతంగా ఎన్నికలు జరిగేందుకు పోలీస్ శాఖ గట్టి ప్రయత్నమే చేస్తుంది. ఇందుంలో భాగంగా జిల్లా ఎస్.పి ఇ.జి అశోక్ కుమార్ ఆదేశాల మేరకు అత్యాధునిక డ్రోన్ కెమెరా ద్వారా నిఘా పెట్టారు.
మంగళవారం (ఆగస్టు 5) పులివెందుల మండలంలోని ఆర్.తుమ్మలపల్లి, నల్లపురెడ్డి పల్లి, రాగిమాని పల్లి, రాయలాపురం ప్రాంతాల్లో జరుగుతున్న ఎన్నికల ప్రచారాన్ని డ్రోన్ కెమెరా ద్వారా పర్యవేక్షించారు. వివిధ పార్టీల అభ్యర్థులు చేస్తున్న ప్రచారం ప్రశాంత వాతావరణంలో జరిగేలా, ఓటర్లు ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు చేపట్టారు.
పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక సమస్యాత్మకంగా మారే అవకాశం ఉందన్న అంచనాతో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ నేరుగా పోలింగ్ కేంద్రాల పర్యవేక్షణ చేపడుతున్నారు. నేరుగా ఆయనే పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. అధికారులకు అవసరమైన ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఎన్నిక ప్రశాంతంగా సాగేందుకు చర్యలు చేపట్టారు.