అతి వాగుడు బంద్@జీవీఎల్, వీర్రాజు!
posted on Jun 5, 2024 @ 6:03PM
2014లో చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పరిపాలన చేసినప్పుడు ఆయన్ని దారుణంగా విసిగించి, ఊపిరి ఆడకుండా చేసి, అడుగు ముందుకు వేయనీయకుండా చేసింది ఎవరో తెలుసా? ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి కాదు... స్వపక్షంలో వున్న బీజేపీ నాయకులు జీవీఎల్ నరసింహారావు, సోము వీర్రాజు. ఆయన కాకపోతే ఈయన, ఈయన కాకపోతే ఆయన రెండ్రోజులకోసారి వంతుల వారీగా ప్రెస్‌మీట్లు పెట్టి ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తూ వుండేవారు. ఆ విమర్శించడం కూడా చాలా ఘాటు పదజాలంతో, ముఖాల్లో వీళ్ళ తాతల ఆస్తి చంద్రబాబు దోచేసుకున్నారన్నంత ద్వేషం నింపేసుకుని మాట్లాడేవాళ్ళు. జగన్ గానీ, జగన్ బ్యాచ్ గానీ ప్రభుత్వాన్ని విమర్శిస్తే చంద్రబాబు వాళ్ళని ఒక ఆట ఆడుకునేవారు. కానీ, సుందోపసుందుల మాదిరిగా వీళ్ళిద్దరూ ఒకరి తర్వాత మరొకరు రెచ్చిపోతుంటే ఏమీ అనలేకపోయేవారు. వీళ్ళని విమర్శిస్తే, ఆ విషయాన్ని వీళ్ళు బీజేపీ కేంద్ర నాయకత్వానికి వేరే రకంగా ట్రాన్స్.ఫర్ చేసి చెబితే, చివరికి రాష్ట్ర ప్రయోజనాలకు దెబ్బ తగులుతుందేమోనని చంద్రబాబు ఓర్పు వహించేవారు. చంద్రబాబు ఓర్పు వీళ్ళిద్దర్నీ మరింత రెచ్చగొట్టేది.. దాంతో వాళ్ళ కడుపులో వున్న విషాన్ని ప్రభుత్వం మీద కక్కుతూ వుండేవారు. వీళ్ళిద్దరి విషయంలో ఓర్పు వహించినా బీజేపీ రాష్ట్రానికి మొండిచెయ్యి చూపించింది. పోలవరాన్ని, అమరావతిని, ఇతర విభజన హామీలని విస్మరించింది. మొత్తమ్మీద 2014లో ఏర్పడిన బంధం తెగిపోయింది. 2019లో ఒంటరిగా పోటీ చేయాల్సిన పరిస్థితిలో ఓట్లు చీలిపోయి అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చింది. అది తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు కంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే ఎక్కువ నష్టం చేసింది.
ఇప్పుడు మళ్ళీ బీజేపీ, జనసేనతో స్నేహం కుదిరింది. ఈ కూటమికి మంచి విజయం లభించింది. కాకపోతే 2014 పరిస్థితి ఇప్పుడు లేదు.. అది ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టమని చెప్పాలి. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వుండాలంటే చంద్రబాబు మద్దతు ఇచ్చి తీరాల్సిన స్థితి ఏర్పడింది. చంద్రబాబుతో మోడీ స్నేహంగా వుండాల్సిందే. చంద్రబాబును పల్లెత్తు మాట అనకుండా, ఆయన రాష్ట్రం కోసం చేసే డిమాండ్లను అర్థం చేసుకోవాల్సిందే. అన్నిటికంటే ముఖ్యంగా జీవీఎల్ నరసింహారావు, సోము వీర్రాజు లాంటి వాగుడుకాయలు అడ్డదిడ్డంగా వాగకుండా నోరు మూసుకోవాల్సిందే. ఇప్పుడు ఇక్కడ వున్నది పాత చంద్రబాబు నాయుడు కాదు.. కేంద్ర ప్రభుత్వం ఆరిపోకుండా చేతులు అడ్డు పెట్టే చంద్రబాబు. ఇప్పుడు రాష్ట్ర బీజేపీ నాయకులు అడ్డమైన విమర్శలు చేసి చంద్రబాబు సహనానికి పరీక్ష పెడితే అది వాళ్ళకే నష్టం. అసలింకా క్లియర్‌గా చెప్పాలంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ వాగుడుకాయలిద్దరినీ మాట్లాడే అధికారం నుంచి తప్పిస్తే అందరికీ మంచింది. రాష్ట్రం బాగుపడుతుంది.. దేశం బాగుంటుంది.