ఓటు వేసే విధానం మీకు తెలుసా? పోలింగ్ స్టేషన్ వెళ్లేముందు సిద్ధమవ్వండిలా!

పోలింగ్ స్టేషన్‌కు వెళ్లే ముందు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి.  పోలింగ్ బూత్ లోకి మొబైల్స్, ఇతర వస్తువులను అనుమతించరు. కాబట్టి వీటిని ఇంటివద్దే వదిలివెళ్ళండి.  ఓటర్ ఐడీ లేదా ఇతర ఫోటో గుర్తింపు కార్డులు, ఓటర్ స్లిప్ మీ వద్ద ఉంచుకోవాలి.  మీ ఇంటి వద్దకే వచ్చి ఓటర్ స్లిప్ ఇచ్చి వెళతారు. ఒక వేళ మీకు ఓటర్ స్లిప్ ఇవ్వకున్నా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.  మీ ఓటు ఎక్కడ ఉంది? ఏ పోలింగ్ కేంద్రంలో ఉందో తెలుసుకోవడం పెద్ద క‌ష్ట‌మేమీ కాదు. 

ఓటరు గుర్తింపు కార్డు మీద ఉన్న ఎపిక్ నెంబర్, మొబైల్ నంబర్ ద్వారా పోలింగ్ కేంద్రాన్ని ఈజీగా కనుగొనచ్చు. అది కాదనుకుంటే ఓటర్ హెల్ప్ లైన్ నంబర్ 1950కి ఫోన్ చేయాలి. వారు అడిగిన సమాచారం అందజేస్తే చాలు మీ పోలింగ్ కేంద్రం వివరాలను తెలియజేస్తారు.  మీ ఫోన్ లోనే ప్లే స్టోర్ నుంచి ఓటర్ హెల్ప్ లైన్ యాప్ డౌన్ లోడ్ చేసుకోండి. యాప్‌లో నో యువర్ పోలింగ్ స్టేషన్ విభాగంలో ఓటరు వివరాలను నమోదు చేయాలి. ఓటరు ఐడీ, పోలింగ్ కేంద్రం వివరాలు నమోదు చేస్తే ప్రస్తుత పోలింగ్ స్టేషన్ వివరాలు మీ మొబైల్ స్ర్కీన్ మీద కనబడతాయి. దానిని సేవ్ చేసుకొని, లేదంటే స్ర్కీన్ షాట్ తీసుకోండి. దాని ఆధారంగా పోలింగ్ కేంద్రంలోకి వెళ్ళి ఓటు వేయండి.

మీరు పోలింగ్ స్టేషన్ కనుకున్నారంటే చాలు పోలింగ్ బూత్ ఈజీగా తెలిసిపోతుంది. మీ ఓటు ఏ బూత్‌‌లో ఉందో అక్కడ ఉన్న సిబ్బంది తెలియజేస్తారు. అక్కడ ఉన్న క్రమ సంఖ్య ఆధారంగా పోలింగ్ బూత్ చూపిస్తారు. బూత్ నిర్ధారించుకొని అక్కడ జనం ఉంటే క్యూ లైన్‌లో నిల్చొని ఓటు వేయాలి. ఓటు వేసేందుకు ఎన్నికల సంఘం సూచించిన 12 గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి విధిగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. బూత్ లోపల విధుల్లో ఉన్న సిబ్బందికి గుర్తింపు కార్డు చూపించాలి. అక్కడున్న అధికారులు రాజకీయ పార్టీలకు చెందిన ఏజెంట్లను అడిగి ఓటరు గురించి నిర్ధారిస్తారు. తర్వాత ఈసీ అందజేసిన పత్రంలో సదరు ఓటరు పేరు నిర్ధారించుకొని, ఈవీఎంలో ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తారు.  

ఓ పోలింగ్ అధికారి.. ఓటరు జాబితాలో, గుర్తింపు కార్డులో మీ పేరును పరిశీలిస్తారు.  మరో అధికారి మీ వేలికి ఇంక్ అంటిస్తారు. ఆ తర్వాత ఓ చీటీ ఇస్తారు. మూడో అధికారి ఆ చీటిని చెక్ చేస్తారు.  అప్పుడు మీరు ఓటు వేయడానికి సిద్ధంగా ఉండాలి. ఈవీఎంలో మీరు ఎన్నుకోవాల్సిన అభ్యర్థికి చెందిన బటన్‌పై మీరు నొక్కాలి. మీరు ఓటు వేసిన తర్వాత ఓ స్లిప్ వస్తుంది. ఈ వీఎం పక్కనే ఉన్న ఓటర్ వెరిఫియేబుల్ ఆడిట్ ట్రయల్ (వీవీప్యాట్) వద్ద దాన్నిచూడవచ్చు. - సీల్డ్ బాక్స్‌లోని గ్లాస్ కేసులో ఇది మనకు కొద్ది సెకన్లపాటు కనిపిస్తుంది. ఒకవేళ  వీవీప్యాట్ లో బ్యాలెట్ స్లిప్ కనిపించకపోయినా, బీప్ సౌండ్ రాకపోయినా,  మీరు వెంటనే ప్రిసైడింగ్ అధికారిని సంప్రదించాలి.

- ఎం.కె. ఫ‌జ‌ల్‌

Teluguone gnews banner