ముఖ్యమంత్రి పై డీఎల్ విమర్శలు
posted on Jun 4, 2013 @ 2:36PM
ఈ రోజు డా. డీ.యల్. రవీంద్రా రెడ్డి ప్రెస్ మీట్ పెట్టుకొనేందుకు ప్రభుత్వం అనుమతి నిరాకరించడమే కాకుండా, సీయల్పీ.కార్యాలయానికి తాళం కూడా వేయించడంతో, ఆయన మీడియా పాయింటు వద్ద తన ప్రెస్ మీట్ నిర్వహించుకొన్నారు.
ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ “ముఖ్యమంత్రి తనను ఎందుకు బర్త్ రఫ్ చేయవలసి వచ్చిందో చెప్పాలని ఆయన డిమాండ్ చేసారు. పార్టీకి ముప్పై ఏళ్లుగా సేవలు చేసినందుకు చివరికి ఇదా బహుమానం? అని ఆవేదన వ్యక్తం చేసారు. తానూ గతంలోనే రాజీనామా చేసినప్పుడు ఆమోదించ కుండా ఇప్పుడు ఇంత హడావుడిగా తనను బర్త్ రఫ్ చేయవలసిన అవసరం ఏమి వచ్చిందని ప్రశ్నించారు. తానూ కళంకితుల జాబితాలో లేనని, తనపై ఎటువంటి అవినీతి ఆరోపణలు కూడా లేవని, పార్టీ వ్యతిరేఖ కార్యక్రమాలలో కూడా ఎన్నడూ పాల్గొనలేదని మరి అటువంటుప్పుడు ఎందుకు తనను పదవిలోంచి తొలగించవలసి వచ్చిందని ఆయన ప్రశ్నించారు.
తనను ఈవిధంగా బర్త్ రఫ్ చేసి అవమానించడం కంటే, పిలిచి రాజీనామా తీసుకొని ఉండి ఉంటే ఇద్దరికీ గౌరవంప్రదంగా ఉండేదని ఆయన అన్నారు. కేవలం ప్రభుత్వ పధకాలలో లోపాలను ఎత్తి చూపుతున్నందుకు పదవి నుండి తొలగించడం చాలా తప్పని, అది కిరణ్ కుమార్ రెడ్డి నియంతృత్వ ధోరణికి నిదర్శనమని అన్నారు.
యస్సీఎస్టీసబ్ ప్లాన్ బిల్లుపై లోతుగా అధ్యయనం చేసి, దాని అమలుకు తీవ్ర కృషి చేసిన ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహను కూడా ముఖ్యమంత్రి పక్కకు తప్పించి అదంతా తన గొప్పధనమేనని చాటింపు వేసుకొంటున్నారని విమర్శించారు. తనను పదవిలోంచి తప్పించి బొత్స, రాజనరసింహ తదితరులను బయపెట్టాలని అనుకొంటే పొరపాటని ముఖ్యమంత్రికి హితవు చెప్పారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వివిధ సంక్షేమ పధకాల పేరిట చేసుకొంటున్న ప్రచార ఆర్భాటాన్ని తప్పు పట్టారు. అమ్మహస్తం పధకం ప్రకటించి మూడు నెలలు గడిచినా ఇంతవరకు సరుకులు మాత్రం ప్రజలకు అందట్లేదని, కనీసం ప్రచారం కోసం చేస్తున్నఖర్చుని ఆ పధకం అమలుకి ఉపయోగించినా కొంత మేర ప్రయోజనం కలిగి ఉండేదని ఆయన విమర్శించారు. పధకం అమలు కాకముందే ఆర్భాటంగా ప్రచారం చేసుకొని అమలు చేయడంలో వైఫల్యం చెందితే అటు పార్టీకి, ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుందని మాత్రమే తానూ హెచ్చరించానని, కానీ తన సలహాను ముఖ్యమంత్రి వ్యతిరేఖంగా స్వీకరించారని అన్నారు.
ఆయన ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఇటీవల ప్రవేశ పెట్టిన ‘బంగారు తల్లి’ వంటి వివిధ పధకాలను ప్రస్తావిస్తూ వాటిలో చాల వరకు గతంలో రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన పధకాలేనని, వాటికి ఇప్పుడు సరికొత్త పేర్లు తగిలించి మళ్ళీ కొత్తగా ప్రవేశపెడుతున్నారని విమర్శించారు. ఆ విధంగా ప్రవేశ పెట్టినప్పటికీ, వాట్ని కూడా సరిగ్గా అమలు చేయలేక ప్రభుత్వం చతికిల పడుతోందని ఆయన విమర్శించారు. మంత్రి పదవి నుండి తప్పించబడినప్పటికీ, తానూ బ్రతికినంత కాలం కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని అన్నారు.