జగన్ నా కొడుకు వంటి వాడు: దిగ్విజయ్
posted on Oct 9, 2013 @ 7:36PM
మూడు నెలల క్రితం దిగ్విజయ్ సింగ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ గా బాధ్యతలు స్వీకరించిన తరువాత మొట్ట మొదటిసారిగా హైదరాబాద్ వచ్చినప్పుడు స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి తనకు ఆప్తమిత్రుడని, జగన్మోహన్ రెడ్డి డీయన్ఏ కాంగ్రెస్ పార్టీ డీయన్ఏ ఒకటేనని అని చెప్పడంతో, నేడు కాకపోతే రేపయినా వైకాపా కాంగ్రెస్ పార్టీలో కలిసిపోవడం ఖాయమని ఆయన పరోక్షంగా ప్రకటించినట్లే అయ్యింది.
మళ్ళీ ఇప్పుడు తాజాగా జగన్ చేస్తున్నఆమరణ నిరాహార దీక్ష గురించి మాట్లాడుతూ అతను, చంద్రబాబు ఇద్దరు కూడా తమ రాజకీయ ప్రయోజనాల కోసమే నిరాహార దీక్షలు చేస్తున్నారని భావిస్తున్నాను. నా ఆప్త మిత్రుడి కొడుకయిన జగన్మోహన్ రెడ్డి నాకు కూడా కొడుకు వంటివాడేనని నేను భావిస్తాను,” అని అన్నారు.
కాంగ్రెస్ పార్టీతో వైకాపా రహస్య అవగాహనకు వచ్చినందునే జగన్మోహన్ రెడ్డికి బెయిలు దొరికిందని, ఎన్నికల తరువాత వైకాపా కాంగ్రెస్ పార్టీలో విలీనం అయిపోవడం ఖాయమని తెదేపా గుప్పిస్తున్న ఆరోపణలకు జవాబు చెప్పుకోలేక సతమతమవుతున్న వైకాపాకు, ఇప్పుడు దిగ్విజయ్ సింగ్ ‘జగన్ నా కొడుకు వంటివాడని’ జాతీయ మీడియా ముందు, అది కూడా డిల్లీలో చంద్రబాబు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సమయంలో చెప్పడంతో వైకాపాకు మరింత ఇబ్బందికర పరిస్థితి ఎదురయింది.
అందుకే ఆ పార్టీ సీనియర్ నేత అంబటి రాంబాబు దిగ్విజయ్ వ్యాఖ్యలపై వెంటనే స్పందిస్తూ “జగన్ తన కొడుకు వంటి వాడయితే, మరి ఆయన గత 16 నెలలుగా జైలులో మగ్గుతున్నపుడు దిగ్విజయ్ సింగ్ ఎందుకు ఊరుకొన్నారు? ఆయన చంద్రబాబుని, జగన్మోహన్ రెడ్డిని ఒకే గాటకట్టి మాట్లాడటం మేము ఖండిస్తున్నాము,” అని అన్నారు.
రానున్న ఎన్నికల తరువాత జేడీ(యూ) వంటి సెక్యులర్ పార్టీలు కేంద్రంలో ఏర్పడే సెక్యులర్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినట్లే తాము కూడా మద్దతు ఇస్తామని ఇటీవలే జగన్ ప్రకటించారు. ఈ సందర్భంగా అతను బీజేపీ ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీని పొగిడినప్పటికీ, ఆయన బీజేపీని సెక్యులర్ పార్టీగా తీర్చిదిద్దితేనే మద్దతు ఇచ్చే అవకాశం ఉంటుందన్నట్లు మాట్లాడారు.
బీజేపీ పూర్తి స్థాయి సెక్యులర్ పార్టీగా మారే అవకాశం లేదు గనుక, ఒకవేళ కాంగ్రెస్ నేతృత్వంలోనడిచే యుపీయే కూటమి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పరచగలిగే స్థితిలో ఉంటే వైకాపా మద్దతు ఇస్తుందని జగన్మోహన్ రెడ్డి చెప్పకనే చెప్పారు. ఎంతయినా రెండు పార్టీల డీయన్ఏ ఒకటేనని మరో మారు దిగ్విజయ్ సింగ్, జగన్ ఇద్దరూ తమ మాటలతో ఖరారు చేసారు గనుక దిగ్విజయ్ సింగ్ మాటలకి అంబటి రాంబాబు మరీ అంతగా నొచ్చుకోవలసినదేమీ లేదు.