సీబీఐ చేతిలో ధర్మాన ప్రసాదం
posted on Jun 8, 2013 @ 11:55AM
కర్ణుడికి కవచ కుండలాలు రక్షగా నిలిచినట్లు ఇంతవరకు ధర్మానకు మంత్రి హోదా రక్షగా నిలిచింది. కానీ, అది కాస్తా ఇప్పుడు తొలగిపోవడంతో ఆయన ఇప్పుడు ఒంటరిగా నిస్సహాయంగా సీబీఐకి దొరికిపోయారు. నిన్న సీబీఐ ఆయన జ్యుడిషియల్ రిమాండ్ కోరుతూ కోర్టులో ఒక మెమో దాఖలు చేసింది. దానిని విచారించేందుకు కోర్టు ఈ నెల 21వ తేదీకి వాయిదా వేసింది. వాన్ పిక్ భూముల వ్యవహారంలో ఆయన అక్రమాలకూ పాల్పడ్డారని సీబీఐ ఆయనపై అభియోగం నమోదుచేసింది.
భూముల బదిలీలు(అక్రమాలు) జరిగిన మాట వాస్తవమని ఆయన ఒప్పుకొంటున్నపటికీ, అది కేవలం తన ఒక్కడి నిర్ణయమే కాదని, క్యాబినెట్ సమిష్టి నిర్ణయమని, అందువల్ల తానూ ఈ విషయంలో నిర్దోషినని ఆయన వాదన. అందుకు ఆయనకు కొందరు మంత్రులు కూడా వత్తాసు పలికినప్పటికీ, తరువాత ఆయన వాదన వెనుకున్న లా పాయింటు అర్ధం అవడంతో క్రమంగా అందరూ ఆయనకి దూరం జరిగారు. ఒకవేళ కోర్టు ఆయన వాదన సరయినదేనని అంగీకరిస్తే, అప్పుడు వైయస్సార్ మంత్రి వర్గంలో ఉన్న మంత్రులందరూ కూడా కటకటాల వెనక్కి వెళ్ళకతప్పదు.
అదిగాక, అవినీతి ఆరోపణలతో మంత్రి వర్గంలోంచి తప్పుకొన్న అటువంటి వారికోసం మాట్లాడే తీరిక, శ్రద్ధ, అవసరం గానీ ఎవరికీ లేవు గనుక ధర్మాన ఒంటరిగా మిగిలిపోక తప్పదు. అందువల్ల ఈ రోజు కాకపోయినా రేపయినా ఆయన కూడా చంచల్ గూడాలోకి ప్రవేశం తప్పకపోవచ్చును.