రాజమండ్రిలో ఎమ్మెల్యే గోరంట్ల, గొల్లపూడిలో ఉమా దీక్ష!
posted on May 1, 2020 @ 4:58PM
పేద కుటుంబాలని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి శుక్రవారం నిరసన దీక్ష చేపట్టారు. కరోనా నేపథ్యంలో ఉపాధి కరువై తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పేద కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోందని టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శించారు. కరోనాను అరికట్టే విషయంలో కొన్ని అంశాల్లో ప్రభుత్వం విపలమవుతోందన్నారు. లక్షలాది మంది అసంఘటిత కార్మికులు ఆకలితో అలమటిస్తున్నారని.. వారిని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఐసోలేషన్ వార్డుల్లోను, క్వారంటైన్ సెంటర్లలో ఉన్నవారికి కనీసం ఆహారం అందించలేని స్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. అవినీతి అక్రమాలకు పాల్పడుతూ ఇసుక, ల్యాండ్ మాఫియాలతో కాలక్షేపం చేస్తున్నారని బుచ్చయ్య చౌదరి విమర్శించారు. పేదలకు తిండి పెట్టే అన్నా క్యాంటీన్‌లను మూసివేశారన్నారు. రైతులకు మార్కెట్ సదుపాయాలు కల్పించటంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందన్నారు. పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు అప్పులుపాలై.. ఆత్మహత్య చేసుకునే పరిస్థితి దాపురించిందన్నారు. పారిశుద్య కార్మికులకు సకాలంలో జీతాలు విడుదల చేయటం లేదని విమర్శించారు. ప్రభుత్వం కళ్లు తెరిపించేందుకే టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన దీక్షలు చేస్తోందని బుచ్చయ్య చౌదరి వెల్లడించారు.
కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యానికి నిరసనగా గొల్లపూడి లో దేవినేని ఉమా 12 గంటలు నిరాహార దీక్ష చేశారు. లాక్‌డౌన్ నేపథ్యంలో ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న పేదలకు రూ.5వేల పరిహారం ఇవ్వాలని ఉమా డిమాండ్ చేశారు.
మే ఒకటో తేదీ కార్మిక పోరాట స్ఫూర్తి, చైతన్యానికి ప్రతీకని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కార్మిక సోదరులందరికి శుభాకాంక్షలు తెలియజేసిన అనంతరం కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యానికి నిరసనగా గొల్లపూడి తన నివాసంలో మాజీ మంత్రి దేవినేని ఉమా 12 గంటల నిరాహార దీక్షకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కరోనా నేపథ్యంలో జీవనభృతి కోల్పోయి ఉపాధి లేక వలస కూలీలు, కార్మికులు చాలా పెద్ద ఎత్తున రాష్ట్రాల మధ్య నడుస్తున్నారని, రాష్ట్రంలో సుమారుగా 50 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వాలు వద్ద భవన నిర్మాణ కార్మికుల నిధి క్రింద సెస్ రూపంలో నిధులును వాటిని వెంటనే వారికి అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యానికి నిరసనగా ఆయన దీక్షకు దిగారు. శుక్రవారం ఉదయం గొల్లపూడి తన నివాసంలో దేవినేని ఉమ ఒకరోజు దీక్ష చేపట్టారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ★ ప్రతి పేద కుటుంబానికి రూ. 5 వేలు ఆర్థిక సహాయం అందించాలని ★ మూసేసిన 'అన్నా క్యాంటీన్ల' ను వెంటనే తెరవాలని ★ చంద్రన్న బీమా పథకాన్ని పునరుద్ధరించాలని ★ దాన్యం మామిడి పత్తి మిర్చి మల్లె టమాటా పండ్ల తోటల ఉత్పత్తులను ప్రభుత్వమే కొనాలి - వ్యవసాయ ఉద్యానవన సెరికల్చర్ ఆక్వా పౌల్ట్రీ రైతాంగాన్ని ఆదుకోవాలని ★ కరోనా పై ముందుండి పోరాడుతున్న వైద్య సిబ్బంది పోలీసులు ఇతర అధికారులకు రక్షణ కిట్లను అందించాలని ★ ప్రజా రాజధానిగా అమరావతి కొనసాగించాలని.... పేదలను, రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలనే ఆరు ప్రధాన డిమాండ్లతో దీక్ష చేస్తున్నట్లు పేర్కొన్నారు.