పార్టీ పదవులకు దేవినేని, వంశీ రాజీనామాలు
posted on Apr 1, 2011 @ 12:18PM
విజయవాడ : కృష్ణాజిల్లాలో తెలుగు తమ్ముళ్ల విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఇవి రాజీనామాలకు దారి తీశాయి. కృష్ణాజిల్లా టీడీపీ అధ్యక్ష పదవికి దేవినేని ఉమ శుక్రవారం రాజీనామా చేశారు. ఈ సందర్భంగా దేవినేని ఉమ మీడియాతో మాట్లాడుతూ తనపై వల్లభనేని ఉమ, నాని చేస్తున్న ఆరోపణలకు మనస్తాపం చెందే రాజీనామా చేసినట్లు తెలిపారు. నందమూరి హరికృష్ణ అంటే తనకు గౌరవం అని దేవినేని చెప్పారు. కార్యకర్తలతో చర్చించిన తర్వాత భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు, ఎన్టీఆర్ స్ఫూర్తితో పనిచేస్తున్న తనపై ఆరోపణలు చేయటం సరికాదన్నారు. ఉమా మహేశ్వరరావుకు మద్దతుగా తెలుగు రైతు జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు రాజీనామా చేశారు.
ఇటు విజయవాడ నగర టీడీపీ అధ్యక్ష పదవికి వల్లభనేని వంశీ కూడా రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామాను ఫ్యాక్స్ ద్వారా పార్టీ కార్యాలయానికి పంపించారు. ఈరోజు మధ్యాహ్నాం రెండు గంటలకు ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. హరికృష్ణ పర్యటన సందర్భంగా దేవినేని ఉమ వైఖరికి నిరసనగా తాను రాజీనామా చేస్తున్నట్లు వంశీ చెప్పుకొచ్చారు. ఈ పరిణామాల పట్ల తెలుగుదేశం పార్టీ నాయకుడు హరికృష్ణ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీ నేతల మధ్య నెలకొన్న విభేదాలు రచ్చకెక్కడంపై ఆయన మండిపడ్డారు. పార్టీలో సమన్వయంతో పని చేసి, అందరినీ కలుపుకుని పోవాలి తప్ప విభేదాలకు తావిచ్చేలా వ్యవహరించడం సరి కాదని ఆయన కృష్ణా జిల్లా నాయకులకు చెప్పినట్లు సమాచారం.