ఏపీలో అభివృద్ధి, సంక్షేమం జోడు గుర్రాల సవారీ!
posted on Oct 4, 2025 @ 1:46PM
ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు సంక్షేమం, అభివృద్ధి జోడుగుర్రాల స్వారీ చేస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఏ మూల చూసినా అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయి. అదే సమయంలో సంక్షేమ పథకాలూ సజావుగా అమలు ఔతున్నాయి. 2019 నుంచి 2024 వరకూ ఐదేళ్ల జగన్ పాలనలో పేరుకే సంక్షేమం, అభివృద్ధి శూన్యం అన్నట్లుగా సాగిన తీరును గుర్తు చేసుకుంటూ.. తెలుగుదేశం కూటమి సర్కార్ పాలనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇస్తూ తెలుగుదేశం కూటమి సర్కార్ ముందుకు సాగుతోందనిపరిశీలకులు సైతం చెబుతున్నారు.
రాజధాని అమరావతి, ఆంధ్రప్రదేశ్ కు జీవనాడి వంటి పోలవరం పనులు చకచకా సాగుతున్నాయి. అదే సమయంలో సంక్షేమ పథకాలూ ఎలాంటి అవరోధాలూ లేకుండా సాగుతున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే.. జగన్ హయాంలో కంటే ఇప్పుడే సంక్షేమం ఎక్కువగా ఉందని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. జగన్ హయాంలో అందించిన సంక్షేమం గోరంత, చేసుకున్న ప్రచారం కొండంత అన్నట్లుగా ఉండేదని అంటున్నారు. అందుకు భిన్నంగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రచారం కంటే లబ్ధిదారులకు సంక్షేమం అందడం ముఖ్యం అన్నట్లుగా సాగుతోందని అంటున్నారు. అభివృద్ధి పనులు నిరాటంకంగా నిరంతరం సాగుతుండటంతో ఉపాధి సైతం పుష్కలంగా లభిస్తోంది. గత జగన్ పాలనతో పోలుస్తూ ప్రస్తుత తెలుగుదేశం కూటమి పాలనపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.
జగన్ హయాంలో అమ్మఒడి కుటుంబంలో ఒక్కరికి మాత్రం ఇచ్చారు. అదే ఇప్పడు బాబు పాలనలో తల్లికి వందనం పథకాన్ని కుటుంబంలో ఎంత మంది పిల్లలు ఉంటే అందరికీ వర్తింప చేస్తున్నారు. అలాగే గతంలో అంటే జగన్ హయాంలో పింఛన్ల కంటే ఇప్పుడు చంద్రబాబు హయాంలో ఎక్కకువ ఇస్తున్నారు. ఆటో డ్రైవర్లకు జగన్ హయాంలో పది వేల రూపాయలు ఇస్తే.. ఇప్పుడు చంద్రబాబు 15 వేల రూపాయలు ఇస్తున్నారు. ఇలా ఏ పథకం చూసుకున్నా.. జగన్ హయాంలో కంటే ఇప్పుడు చంద్రబాబు పాలనలో మెరుగ్గా ఉంది. అమలు పారదర్శకంగా ఉంది. గతంలో బటన్ నొక్కి సంక్షేమం ఇచ్చానని జగన్ చెప్పినా.. ఆ బటన్ నొక్కిన సొమ్ములు ఎప్పడు లబ్ధిదారుల ఖాతాలలో జమ అవుతాయో ఎవరికీ తెలిసేది కాదు. ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు.
ఇక జగన్ హయాంలో అభివృద్ధి ఆనవాలే లేకుండా పోయిన పరిస్థితి. ఇప్పుడు రాష్ట్రం అంతటా అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయి. పారిశ్రామిక రంగం కళకళలాడుతోంది. పెట్టుబడులు ఏపీయే గమ్యం అన్నట్లుగా తరలి వస్తున్నాయి. దీంతో జగన్ ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేస్తూ, ఆందోళనలకు పిలుపునిస్తున్నా పార్టీ శ్రేణులే సీరియస్ గా తీసుకోని పరిస్థితి రాష్ట్రంలో నెలకొని ఉంది.