డెలివరీ బాయ్స్ దోపిడీలు.. ఆరుగురు ఫ్రెండ్స్ అరెస్ట్..
posted on May 15, 2021 @ 1:34PM
వాళ్లంతా ఆవారా గాళ్లు. మొత్తం ఆరుగురు ఫ్రెండ్స్. ముఠాగా ఏర్పడ్డారు. ఒంటరి మనుషులను టార్గెట్ చేశారు. సెల్‌ఫోన్లు, నగదు, బంగారం దోచుకున్నారు. కొన్ని నెలలకు మస్త్ ఎంజాయ్ చేశారు. కట్ చేస్తే.. ఇప్పుడు ఖాకీల చేతికి చిక్కి ఊచలు లెక్కబెడుతున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఓ దోపిడీ దోస్తుల ముఠా వ్యవహారం ఇప్పుడు కలకలంగా మారింది. తమకు తెలిసిన వాళ్లు.. ఇంత కిలాడీ దొంగలా అని స్థానికులు ఆశ్చర్యపోతున్నారు.
వాళ్ల చదువు ఎప్పుడో అటకెక్కింది. ఫ్రెండ్స్‌తో మస్తీ చేయడం అలవాటైంది. ఆలస్యంగా ఇంటికి రావడం మొదలైంది. జల్సాలు, పార్టీలంటూ ఫుల్‌గా ఖర్చు చేస్తున్నారు. ఎప్పుడూ వాళ్ల దగ్గర ఫుల్ క్యాష్ ఉంటోంది. ఇదేంటి.. ఇంత సడెన్‌గా ఆ పోరగాళ్లకు అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తోంది? అనే అనుమానం ఇంట్లో వాళ్లకి గానీ, చుట్టుపక్కల వాళ్లకి గానీ రాలేదు. ఎందుకంటే.. వాళ్లు స్విగ్గీ, జొమాటోలో డెలివరీ బాయ్స్‌గా పని చేస్తున్నారు. ఏదో పని చేస్తున్నారు.. మస్త్ పైసలు వస్తున్నాయ్ అనుకున్నారు వారంతా. కానీ, ఆ లెక్కలేనన్ని డబ్బులు వస్తున్నది స్విగ్గీ, ,జొమాటో జాబ్ నుంచి కాదనే విషయం వారికి అప్పుడు తెలీలేదు. ఇప్పుడు పోలీసులు చెబుతుంటే విని ఆశ్చర్యపోతున్నారు.
దారి దోపిడీలకు పాల్పడుతున్న ముఠాను బాచుపల్లి పోలీసులు అరెస్టు చేశారు. ముఠాలోని ఆరుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా రాత్రి పూట ఒంటరిగా ఉన్న వారిపై దాడి చేసి దోపిడీలకు పాల్పడుతుందని పోలీసులు తెలిపారు. దొంగిలించిన ఫోన్లు, ఇతర సామగ్రిని ఓఎల్ఎక్స్‌లో నిందితులు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. నిందితులు స్విగ్గీ, జొమాటోలలో పని చేస్తున్నట్లు వివరించారు. ఇదీ ఆ ఆరుగురు దోస్తుల క్రైమ్ కథా చిత్రమ్.
పగలంతా ఫుడ్ డెలివరీ బాయ్స్‌గా పని చేసేవాళ్లు. అది వాళ్ల పార్ట్‌టైమ్ వర్క్ మాత్రమే. మెయిన్ జాబ్.. మిడ్‌నైట్ తర్వాతే. బైక్‌లు వేసుకొని.. నిర్మానుషంగా ఉండే ప్రాంతాల్లో తిరుగుతుండేవాళ్లు. పొరబాటున ఎవరైనా అటువైపు వస్తే.. ఆరుగురు కలిసి అడ్డగించే వారు. బెదిరించి, భయపెట్టి.. సెల్‌ఫోన్, గోల్డ్ ఛైయిన్, పర్స్, క్యాష్.. ఏది ఉంటే అది లాక్కునే వారు. వస్తువులైతే వాటిని OLXలో పెట్టి అమ్మేసేవారు. అయితే, OLXలో ఇలా వస్తువులు కొన్నవాళ్లు అనుమానంతో ఫిర్యాదు చేయడంతో విషయం పోలీసుల దృష్టికి వచ్చింది. నిఘా వేసి, ఆరా తీసి.. ఇప్పుడు ఆ ముఠాను పట్టుకున్నారు. అర్థరాత్రి దోపిడీలకు పాల్పడుతున్న స్విగ్గీ, జొమాటో డెలివరీ బాయ్స్‌గా పని చేస్తున్న ఆరుగురు ఫ్రెండ్స్‌ను అరెస్ట్ చేశారు.