హైదరాబాదీలకు డేంజర్ బెల్స్ .. హుస్సేన్ సాగర్ లో కరోనా జన్యు పదార్థాలు
posted on May 15, 2021 @ 2:19PM
కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ దేశమంతా పంజా విసురుతోంది. తెలంగాణలోనూ కరోనా వేగంగా విస్తరిస్తోంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం రోజూ 4 వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. అనధికారిక లెక్కల ప్రకారం ఇంతకు రెండింతల కరోనా కేసులు వస్తున్నాయని చెబుతున్నారు. కరోనా థర్డ్ వేవ్ కూడా వస్తుందని వైద్య నిపుణులు, అంతర్జాతీయ సంస్థలు చెబుతున్నారు. కరోనాపై భయాందోళన కొనసాగుతుండగానే హైదరాబాద్ నగరవాసులకు శాస్త్రవేత్తలు ఆందోళన కలిగించే వార్తను చెప్పారు సైంటిస్టులు.
హైదరాబాద్ మహానగరం మధ్యన ఉన్న హుస్సేన్ సాగర్ లో కరోనా వైరస్ జన్యు పదార్థాలు కనపడ్డాయని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ,సీసీఎంబీ సంయుక్తంగా నిర్వహించిన పరిశోధనలో తేలింది. సాగర్ తో పాటు ఇతర చెరువుల్లో కూడా ఈ పదార్థాలు కనిపించాయని వెల్లడించింది. హుస్సేన్ సాగర్ తో పాటు నాచారం పెద్ద చెరువు, నిజాం చెరువులో కూడా కరోనా జన్యు పదార్థాలు కనిపించాయని చెప్పారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి చెరువుల్లో ఈ జన్యు పదార్థాలు పెరగడం ప్రారంభమైందని తెలిపారు. అయితే కరోనా వైరస్ నీటి ద్వారా వ్యాపించదనే విషయం ఒక అధ్యయనంలో వెల్లడైందని తెలిపారు.
కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ సమయాల్లో ఈ అధ్యయనం చేసినట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే చెరువుల్లోని వైరస్ జన్యు పదార్థం మరింతగా విస్తరించలేదని చెప్పారు. భవిష్యత్తులో వస్తుందని భావిస్తున్న మూడో వేవ్ ను అధ్యయనం చేయడానికి ఇది ఉపయోగపడుతుందని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ,సీసీఎంబీ సైంటిస్టులు ప్రకటించారు.