ఢిల్లీ గ్యాంగ్ రేప్: అంత్యక్రియల ‘రహస్యం’ఫై బిజెపి అభ్యంతరం
posted on Dec 31, 2012 @ 5:52PM
ఢిల్లీ అత్యాచారపు బాధితురాలి అంత్య క్రియలు నిన్న ఢిల్లీ లో పూర్తి అయ్యాయి, అయితే, వీటిని అత్యంత రహస్యంగా నిర్వహించడంఫై మాత్రం పలు అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.
13 రోజుల పాటు మృత్యువుతో పోరాడి చివరకు మరణించిన ఆ యువతి అంత్యక్రియలను రహస్యంగా పూర్తి చేయడంఫై బిజెపి నాయకుడు రవి శంకర్ ప్రసాద్ తన అభ్యంతరం వ్యక్తం చేశారు.
‘బాధితురాలి కుటుంబ సభ్యుల మనోభావాలను మేము అర్ధం చేసుకోగలం. అయితే, ఆమె దహన సంస్కారాలను ఇలా నిర్వహించడం వల్ల ప్రజల్లో అనేక సందేహాలు తలెత్తుతాయి’, అని ఆయన అన్నారు.
అయితే, ఇందులో తమ పాత్ర ఏమీ లేదని అంతా బాధితురాలి కుటుంబ సభ్యుల కోరిక మేరకే జరిగిందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి ఆర్.పి.ఎన్.సింగ్ అన్నారు. ‘వారి గోప్యతను గౌరవించాలనే ఉద్దేశంతోనే ఇలా చేసాం. మీడియా కూడా ఇందుకు పూర్తిగా సహకరించింది. రహస్యంగా చేయాలనే ఉద్దేశం మాకేమీ ప్రత్యేకంగా లేదు’, అని మంత్రి అన్నారు.
అలాగే, ఆమెకు నివాళులు అర్పించడానికి జంతర్ మంతర్ వద్దకు వచ్చిన అనేక మంది ప్రజలు కూడా అంత్య క్రియలను రహస్యంగా నిర్వహించడంఫై మిశ్రమ స్పందనను వ్యక్తం చేశారు.
అయితే, ఈ విషయం ఎలా ఉన్నా, ఆమె ఆత్మ శాంతికి మాత్రం ప్రార్ధనలు కొనసాగిస్తామని వారన్నారు.