జగన్ కు ఓటమి భయం.. ఎమ్మెల్యేలకు పార్టీ టికెట్ల భయం!
posted on Sep 17, 2022 @ 11:40AM
ఏపీ సీఎం జగన్ కు ఓటమి భయం పట్టుకుంది. ఆయన ప్రతి మాటలోనూ ఆ భయం ప్రస్ఫుటమౌతోంది. మూడు రాజధానుల విషయంలో తన మొండితనం మొదటికే మోసం తెచ్చిందా అన్న అనుమానం కూడా ఆయనలో మొదలయ్యిందన్న భావన కనిపిస్తోంది. రేపల్లెలో రైతుల పాదయాత్రకు వ్యతిరేకంగా వైసీపీ ఫ్లెక్సీలు, గతంలో ఎన్నడూ లేని విధంగా తరచూ ఎమ్మెల్యేలతో సమావేశాలు, చీటికీ మాటికీ వారిపై ఆగ్రహం వ్యక్తం చేయడం ఇవన్నీ ఆయనలో ఓటమి భయాన్ని ప్రస్ఫుటం చేస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కొంచం కష్టపడితో రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాలలోనూ గెలుపు మనదే అన్న ధీమా వ్యక్తం చేసిన నెలల వ్యవధిలోనే జగన్ తన ఎమ్మెల్యేల గ్రాఫ్ పడిపోతోందంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేయడం.. బుగ్గ కారుల్లో తిరగడం తప్ప మీరేం పని చేయడం లేదంటూ కేబినెట్ సహచరుల మీద ఫైర్ అవ్వడం, మంత్రి పదవులు పీకేస్తాను జాగ్రత్త అంటూ ఆగ్రహం వ్యక్తం చేయడం ఆ భయానికి నిదర్శనాలని వారు అంటున్నారు. కుప్పంలో చంద్రబాబును ఓడంచబోతున్నాం అని ఉత్సాహంగా చెప్పిన జగన్.. ప్రతి నియోజకవర్గానికీ మంత్రి పదవి హామీ ఇవ్వడం.. తన క్విడ్ ప్రొకో వ్యవహారాన్ని నియోజకవర్గ ప్రజల దగ్గరకు కూడా తీసుకువెళ్లారని అంటున్నారు.
జగన్ ధీమా ప్రకటనలతో క్యాడర్ భరోసాతో ఉండటంతో.. తమతో సమావేశాలలో జగన్ వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలతో వైసీపీ ఎమ్మెల్యేలలో వచ్చే ఎన్నికలలో పార్టీ టికెట్ వస్తుందా అన్న భయం మొదలైందని పరిశీలకులు అంటున్నారు. ఆ కారణంగానే జగన్ ఆదేశాలు అమలు చేసే విషయంలో కూడా వారు గతంలోలా ఉత్సాహం చూపడం లేదంటున్నారు. విపక్షాల విమర్శలను తిప్పికొట్టడంలో కానీ, ఎంతగా ఒత్తిడి వస్తున్నా గడపగడపకూ కు మొహం చాటేయడం ఇందులో భాగమేనని చెబుతున్నారు. జగన్ తనలో ఓటమి భయాన్ని దాచుకుని బయటకు చూపుతున్న గాంభీర్యం ‘రాజుగారి దేవతా వస్త్రం’లాగే ఉందని పార్టీ శ్రేణులే అంటున్నాయి. ఓటమి భయంతో.. తన వల్ల కాదు.. ఎమ్మెల్యేల నిష్క్రియాపరత్వం వల్లే రాష్ట్రంలో పరిస్థితులు పార్టీకీ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారాయని జగన్ చెప్పుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారనీ, అందుకే ఇటీవల ఎమ్మెల్యేలతో భేటీ అయిన రెండు సందర్భాలలోనూ ఆయన ఎమ్మెల్యేల పనితీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
బటన్ నొక్కి తాను ప్రజాభిమానాన్ని చూరగొని పార్టీ గ్రాఫ్ పెంచడానికి శాయశక్తులా ప్రయత్నిస్తుంటే.. ఎమ్మెల్యేలు మాత్రం తన వ్యవహార శైలితో ప్రజలలో చులకన కావడమే కాకుండా పార్టీ ప్రతిష్టను, ప్రభుత్వ పరువును మంటగలుపుతున్నారని జగన్ నిర్మొహమాటంగా ఎమ్మెల్యేల ముఖం మీదే చెప్పేస్తున్నారు. జగన్ కు అవకాశం ఉంది కనుక బటన్ నొక్కు తున్నారనీ, తమకు ఆ అవకాశం ఇచ్చి నియోజకవర్గంలోని లబ్ధి దారులకు సంక్షేమం పంపిణీ చేసేందుకు ఆ బటన్ ను తమకు ఇస్తే తమ గ్రాఫ్ కూడా పెరుగుతుంది కదా అని వారంటున్నారు. ఒక వైపు ఇన్ చార్జిలు, మరో వైపు వాలంటీర్లు తమపై పెత్తనం చెలాయిస్తుంటే.. నియోజకవర్గంలో డమ్మీలుగా మిగిలిపోయామనీ, అందుకే ప్రజా వ్యతిరేకత అనేది ప్రభుత్వ విధానాల వల్ల, వాలంటీర్ల నిర్వాకం వల్లా వచ్చిందే తప్ప తమ వల్ల కాదనీ ఎమ్మెల్యేలు అంతర్గత చర్చల్లో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జగన్ తీరు చూస్తుంటే వచ్చే ఎన్నికలలో సిట్టింగులకు సీటు గల్లంతేననిపిస్తోందని వారు అంటున్నారు. ఎమ్మెల్యేలలో చాలా మంది ఇప్పటికే తమకు వచ్చే ఎన్నికలలో పార్టీ టికెట్ రాదన్న స్థిర నిశ్చయానికి వచ్చేసినట్లు అవగతమౌతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సోమవారం (సెప్టెంబర్19)న ఎమ్మెల్యేలతో జగన్ మరోసారి సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో జగన్ మళ్లీ పాత పాటే పాడితే ఎమ్మెల్యేలు ధిక్కార స్వరం వినిపించే అవకాశాలే మెండుగా ఉన్నాయని అంటున్నారు. ఇప్పటికే మంత్రులకు పదవులు ఊడబీకేస్తానని హెచ్చరించినా వారిలో మార్పు రాకపోవడమే కాకుండా ఆయన హెచ్చరికలను లైట్ గా తీసుకున్న విషయాన్ని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. పార్టీపై, ప్రభుత్వంపై మరీ ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ స్కాంలో తన సతీమణిపై ఆరోపణలు వచ్చినా ఖండించనందుకు జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినా మంత్రులు లైట్ తీసుకోవడమే వారు జగన్ నాయకత్వంపై గతంలోలా విశ్వాసం చూపడం లేదనడానికి నిదర్శనంగా చెబుతున్నారు. ఇక ఈ నెల 19న జరిగే సమావేశం విషయంలో ఎమ్మెల్యేలు మల్లగుల్లాలు పడుతున్నారు.
గత రెండు సమావేశాలలో ఎదురైన అనుభవమే మరో సారి ఎదురౌతుందా అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పని తీరు మెరుగుపరుచుకోవాలని జగన్ క్లాస్ తీసుకుంటారనీ, అసలు నియోజకవర్గంలో పని చేసే అవకాశమే లేని తాము పని తీరు ఎలా మెరుగుపరుచుకోవాలని మధన పడుతున్నారు. ఈనెల19న జగన్ అన్ని నయోజకవర్గాలకు సంబంధించిన ఎమ్యెల్యేలు, పార్టీ నియోజకవర్గ బాధ్యలు, సమన్వయ కర్తలతో సమావేశం కానున్నారు.
ఎప్పటికప్పుడు గ్రౌండ్ రిపోర్టును తెప్పించుకుంటున్న జగన్ ఆ నివేదికల ఆధారంగా ఎమ్మెల్యేలకు గ్రేడింగ్ లు ఇచ్చి క్లాస్ పీకే అవకాశాలున్నాయని ఎమ్మెల్యేలే అంటున్నారు. ఏది ఏమైనా ఈ సారి కూడా సమావేశం తమకు క్లాస్ పీకడానికే పరిమితమైతే మాత్రం తమ సమస్యలను కూడా అధినేతకు ఎలుగెత్తి చెబుతామని కొందరు ఎమ్మెల్యేలు చెబుతున్నారు. అదే జరిగితే ఈ నెల 19న జరిగే నియోజకవర్గాల సమీక్ష వైసీపీలో ప్రకంపనలు సృష్టించే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు. జగన్ సమక్షంలోనే అసమ్మతి కట్టలు తెంచుకున్నా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదంటున్నారు.