దీపికాపై ట్రోలింగ్... బాలీవుడ్ లోనూ విమర్శలు...
posted on Jan 10, 2020 @ 1:47PM
దీపికా పదుకొనె. టైమ్ పత్రిక ఆమెను ప్రపంచాన్ని ప్రభావితం చేసే 100 మంది లో ఒకరిగా గుర్తించింది. కాకపోతే ఇప్పుడు ఆమె టైమ్ బాలేనట్లుగా ఉంది. ఒక్కసారిగా వివాదంలో చిక్కుకుపోయింది. వివాదాలకూ ఆమె కొత్త కాదు. కాకపోతే తాజా వివాదం మాత్రం మీడియాలో, సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టించింది. దీపికా పదుకొనె ఢిల్లీ JNUకి వెళ్ళి అక్కడ విద్యార్థి సంఘం నాయకురాలు ఐషె ఘోష్ ను కలుసుకోవడం పెను వివాదంగా మారింది. అయితే, ఇన్నేళ్ళుగా వచ్చిన వివాదాలు ఒక ఎత్తయితే....తాజా వివాదం మరో ఎత్తు. ఒక విధంగా చెప్పాలంటే ఆమె సినిమా భవిష్యత్ పై ప్రభావం చూపే అంశం. వివాదాలను ఆధారం చేసుకొని సినిమాను ప్రమోట్ చేసుకోవడం పాత పద్ధతే. దీపికా పదుకొనె కూడా అదే బాట పట్టారన్న విమర్శలూ వచ్చాయి. సినిమా ప్రచారం సంగతి ఎలా ఉన్నా ఆ సినిమాను బాయ్ కాట్ చేయాలన్న ప్రచారం ఇప్పుడు సోషల్ మీడియాలో అధికమైపోయింది.
ఓ పదేళ్ళ క్రితం దాకా వివిధ అంశాలపై సినిమా తారల స్పందన పెద్దగా బయటకు తెలిసేది కాదు. సోషల్ మీడియా రావడంతో ప్రతీ అంశంపై సినీ తారల స్పందన ఏంటో ప్రజలకు తెలుస్తోంది. ట్విట్టర్, ఇన్ స్టా గ్రామ్ వంటి వాటిని సినిమా తారలు బాగా ఉపయోగించుకుంటున్నారు. తాజాగా దీపికా పదుకొనె విషయానికి వస్తే....ఆమె కొత్త సినిమాను బాయ్ కాట్ చేయాలన్న ప్రచారం ఇప్పడు సోషల్ మీడియాలో ఉధృతమైంది. మరోవైపున దీపికా పై ప్రశంసలు, విమర్శలు అధికమైపోతున్నాయి.
దేశంలో ఎవరికైనా భావప్రకటనా స్వేచ్ఛ ఉంది. అందులో సందేహం లేదు. అదే సమయంలో కొన్ని పరిమితులూ ఉంటాయి. మరో వైపున సమాజం నిట్టనిలువునా చీలిపోతున్న సందర్భంలో ప్రముఖుల అభిప్రాయాలకు, చేసే పనులకూ బాగా ప్రాచుర్యం వస్తుంటుంది. దాన్ని తమ స్వలాభం కోసం ఉపయోగించుకునే వారి విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిందే. నిజమైన అభిమానం వేరు....సినిమా హిట్ కోసం చేసే జిమ్మిక్కులు వేరు. దీపికా ఏ ఉద్దేశంతో చేసినా....అందులో పెద్దగా తప్పు పట్టాల్సింది కూడా ఏమీ లేదు. భిన్న భావజాలాలు సంఘర్షించి అసలైన సత్యం బయటకు రావడాన్నే అంతా కోరుకుంటారు.
మొత్తానికి, దీపికా పరిస్థితి కూడా ఇప్పుడు సినిమాలో యాసిడ్ బాధితురాలి పరిస్థితిగా మారిపోయింది. పౌర చట్టంపై అట్టుడుకుతున్న ఢిల్లీ జేఎన్ యూని సందర్శించి, గూండాల దాడికి గురైన యువతిని పరామర్శించడం ఓ పెద్ద వివాదంగా మారిపోయింది. ఇప్పుడు ఆమెకు అనుకూలంగా, వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే జరుగుతోంది.