అమరావతి రైతుల గోడు జనసేనానికి పట్టదా? ఎందుకు పట్టించుకోవడం లేదు?
posted on Jan 10, 2020 @ 1:27PM
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏం చేసినా, ఏం చెయ్యకున్నా చర్చనీయాంశమే. అయితే, రాజధానిపై రైతులు రగిలిపోతుంటే, పవన్ కల్యాణ్ మాత్రం మౌనంగా ఉండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏదో ఒక్కరోజు వచ్చి సంఘీభావం ప్రకటించి వెళ్లిపోయారు. అయితే, పవన్ పర్యటన రోజు, రణరంగాన్ని తలపించాయి రాజధాని వీధులు. ఇప్పుడు కూడా, రాజధాని హోరెత్తుతోంది. కానీ డిసెంబర్ 31 తర్వాత, అసలు పవన్ కల్యాణ్ ఊసేలేదు. అదే ఇప్పడు మరోసారి చర్చనీయాంశమైంది.
రాజధాని ప్రాంతంలో తెలుగుదేశం పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తోంది. దీక్షలు చేస్తున్న రైతులకు మద్దతుగా నిరసనల్లో పాల్గొంటోంది. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌లు రాజధానిలో పర్యటిస్తూ, ఎప్పటికప్పుడు ఉద్యమాన్ని ఉరకలెత్తిస్తున్నారు. అయితే, పవన్ కల్యాణ్ మాత్రం, ఆందోళనలకు విరామం ఇచ్చి, మళ్లీ ఇంటికెళ్లిపోయారని, రైతులు లోలోపల రగిలిపోతున్నారు. నిరసనల్లో ఆయన కూడా పాల్గొంటే, ఉద్యమానికి మరింత ఊపొచ్చేదని అన్నదాతలు మాట్లాడుకుంటున్నారు. కానీ పవన్ మాత్రం, ఒకే ఒక్క నిరసనతో బ్యాక్ టు హోం అంటూ వెళ్లిపోయారని మండిపడుతున్నారు రైతులు.
ఫుల్ టైమ్ పొలిటీషియన్‌గా పవన్ మారలేదని, 2014 నుంచి కూడా విమర్శలున్నాయి. అప్పుడప్పుడు హడావుడి చేసి వెళ్లిపోవడం, నెలల తరబడి గ్యాపివ్వడం, అప్పుడప్పడు ట్వీట్లు చేయడం, మినహా పవన్ పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా మారలేదని ప్రత్యర్థి పార్టీలు సైతం విమర్శించాయి. ఇప్పుడు మళ్లీ అలాంటి కామెంట్లే వినపడుతున్నాయి. రాజధాని పరిసర ప్రాంతాలు రణక్షేత్రాన్ని తలపిస్తుంటే పవన్ ఏం చేస్తున్నారని ఆందోళనకారులు ప్రశ్నిస్తున్నారు.
అయితే, పవన్ కల్యాణ్ ఎందుకు గ్యాపిచ్చారన్నదానిపై ఎవరి మాటలు వారివే. హైపవర్ కమిటీ అధ్యయనం చేస్తోందని, దాని తర్వాత రాజధానిపై క్లారిటీ వచ్చి, కేబినెట్ తీర్మానం చేసిన తర్వాత, గట్టిగా పోరాడాలని పవన్ నిర్ణయించుకున్నారని, ఆ పార్టీవర్గాలంటున్నాయి. అందుకే ఉద్యమంలో పవన్ పెద్దగా పాల్గొనడంలేదని, అధికారిక నిర్ణయం తర్వాత కార్యాచరణ ప్రకటిస్తారని అంటున్నారు. అదేవిధంగా కవాతు కూడా నిర్వహించబోతున్నారని చెబుతున్నారు. అయితే, ఒకవైపు రైతులు, మరోవైపు టీడీపీ శ్రేణుల ఆందోళనలతో రాజధాని యుద్ధరంగాన్ని తలపిస్తున్నవేళ, పవన్ కల్యాణ్ క్రియాశీలకంగా లేకపోవడాన్ని సహించలేకపోతున్నారు నిరసనకారులు. ప్రభుత్వం నిర్ణయం తీసుకునేలోపే ప్రతిరోజూ నిరసనల్లో పాల్గొనాలని, సర్కారు తీర్మానాన్ని సైతం ప్రభావితం చేసేలా, ఉద్యమం హోరెత్తించాలని కోరుకుంటున్నారు.