ఎంత మంచి కూతురో.. తండ్రినే లేపేసింది!
posted on Jun 18, 2024 @ 11:36AM
మదనపల్లిలో హరిత అనే అందమైన, తెలివైన అచ్చ తెలుగు అమ్మాయి వుంది. బీఎస్సీ, బీఈడీ చదివింది. హరితని చూడగానే ముసలోళ్ళకి ‘ఇలాంటి కూతురు నాక్కూడా వుంటే ఎంత బాగుండేదో’ అనిపిస్తుంది. కుర్రోళ్ళకి ‘ఇలాంటి భార్య నాకు వుంటే ఎంత బాగుంటుందో’ అనిపిస్తుంది. అలాంటి ముచ్చటైన హరితని అలా తీర్చిదిద్దింది ఎవరో కాదు.. ఆమె తల్లిదండ్రులు. వాళ్ళకి హరిత ఒక్కటే కూతురు. తల్లి ఈమధ్యే మరణించారు. తండ్రి దొరస్వామి గవర్నమెంట్ స్కూల్లో టీచర్‌గా పనిచేస్తున్నారు. వీళ్ళకి చక్కటి సొంత ఇల్లు కూడా వుంది. ఈ మేటరంతా చదివినవాళ్ళకి ఏం అనిపిస్తుంది? ఈ బంగారు బొమ్మ హరితకి ఆమె తండ్రి దొరస్వామి మంచి సంబంధం చూసి పెళ్ళి చేయాలని, ఆమె పిల్లాపాపలతో కలకాలం హాయిగా జీవించాలని అనిపిస్తుంది కదూ. ఈ ఆకాంక్షకి అనుగుణంగానే హరితకి మంచి సంబంధం చూడాలని దొరస్వామి ప్రయత్నాలు ప్రారంభించారు. కూతురు పెళ్ళికోసం దాచిన డబ్బుని, ఆమె అకౌంట్లోనే వేశారు. తల్లి బంగారాన్ని కూడా హరితకే అప్పగించారు. హరితకు సరిపోయే సంబంధం కోసం ఆయన ఉద్యోగానికి లీవులు పెట్టుకుని, కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్నారు.
ఆ తండ్రి సంగతి అలా వుంటే, మన బంగారు తల్లి హరిత వ్యవహారం మరోలా వుంది. పాపం హరిత మనసు చాలా పెద్దది కావడంతో, ఆ మనసులో చాలా చోటు వుండటంతో రమేష్, సాయికృష్ణ, హరీష్‌రెడ్డి అనే ముగ్గురు కుర్రాళ్ళకి తన మనసులో చోటు ఇచ్చింది. ఒకరికి తెలియకుండా ఒకరితో ఆ ముగ్గురు కుర్రాళ్ళతో సన్నిహితంగా వుంటోంది. వాళ్ళకి తన మనసులో చోటు ఇవ్వడంతోపాటు, తన తండ్రి ఇచ్చిన డబ్బులో ఎనిమిది లక్షల రూపాయలని తన ఒక ప్రియుడు సాయికృష్ణకి ఇచ్చింది. తల్లి నగలని రమేష్‌కి ఇచ్చింది. రమేష్ ఆ నగలని ఎంచక్కా తాకట్టు పెట్టుకుని పదకొండున్న లక్షలు అప్పుగా తీసుకుని ఎంజాయ్ చేస్తున్నాడు.
తన ముద్దుల కూతురు హరిత ముసుగులో వ్యవహారాలన్నీ తెలుసుకున్న తండ్రి దొరస్వామి ఆమెకి ఇక పెళ్ళి చేసేస్తే మంచిదని నిర్ణయించుకున్నాడు. దానికి హరిత నో చెప్పింది. ఇప్పటికే తన మనసులో ముగ్గురు వున్నారని, తన మనసులో పెళ్ళి పేరుతో మరొకరికి చోటు ఇవ్వలేనని కరాఖండీగా చెప్పేసింది. ఈ అంశం మీద తండ్రీ కూతుళ్ళ మధ్య నెల రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఇక తండ్రితో ఇలా గొడవలు పడుతూ ఆయన్ని బాధపెట్టడం ఇష్టంలేని హరిత ఈనెల 13న ఒక నిర్ణయం తీసుకుంది. ఇంట్లో తన చేతికి దొరికిన పచ్చడి బండ, చపాతీ కర్ర, తాళం కప్ప... ఇలాంటి హోమ్లీ వస్తువులతో తండ్రి నెత్తిమీద కొట్టి చంపేసింది. తన తండ్రి కాలుజారి పడిపోయి చనిపోయాడని చుట్టుపక్కలవాళ్ళకి చెప్పింది. పోలీసులకూ అదే చెప్పింది. అన్నీ కరెక్టుగా వుంటేనే పోలీసులు అనుమానంగా చూస్తారు. ఇలాంటి తేడా కేసుని అనుమానించరా? పోలీసులు అనుమానంతో చేసిన దర్యాప్తులో అసలు విషయాలన్నీ బయటపడ్డాయి. ప్రస్తుతం అందాల హరిత రిమాండ్ ఖైదీగా జైల్లో వుంది.