ఒళ్లు దగ్గరపెట్టుకోండి.. దానం వార్నింగ్
posted on Sep 7, 2015 @ 3:01PM
కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి దానం నాగేందర్ టీఆర్ఎస్ నేతల తీరుపై మండిపడ్డారు. మహబూబ్ నగర్ జిల్లాలో సర్వసభ్య సమావేశంలో టీఆర్ఎస్ నేతలకు.. కాంగ్రెస్ నేతలకు మధ్య జరిగిన వివాదంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు.. కాంగ్రెస్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డిని చెంప దెబ్బకొట్టిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ నేతల వైఖరిని దుమ్మెత్తిపోస్తున్నారు. దీనిలో భాగంగానే ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు దిగింది. ఈ సందర్భంగా దానం నాగేందర్ మాట్లాడుతూ ‘‘టీఆర్ఎస్ నేతలు ఒళ్లు దగ్గరపెట్టుకుని ప్రవర్తించాలి. లేకపోతే అధికారం పోయాక వారికీ ఇబ్బందులు తప్పవు అని హెచ్చరించారు. అధికారం చేతిలో ఉంది కదా అని ఎలా పడితే అలా ప్రవర్తిస్తే ఊరుకునేది లేదని.. వారి ఆగడాలను ఇకపై సహించేది లేదని దానం ధ్వజమెత్తారు. కాగా బాలరాజు చర్యలపై ఇప్పటికే కాంగ్రెస్ నేతలు గవర్నర్ కు ఫిర్యాదు చేశారు.