Read more!

విజయమ్మని వైజాగ్ నుండి ఎందుకు నిలబెట్టానంటే..

 

వైకాపా నేత దాడి వీరభద్రరావు మొన్న పార్టీని వీడుతూ “జగన్ తన తల్లిని, చెల్లిని కూడా నమ్మరని, చెల్లికి టికెట్ ఇచ్చి ప్రోత్సహిస్తే ఆమె పార్టీలో రెండో అధికార కేంద్రంగా మారుతుందనే భయంతోనే ఆమెకు టికెట్ ఇవ్వకుండా జగన్ తన తల్లిని వైజాగ్ నుండి నిలబెట్టారని, కానీ ఆయన తన తల్లిని కూడా నమ్మరు గనుకనే ఆమె విజయానికి గట్టిగా కృషి చేయలేదని, అందుకే ఆమె ఓడిపోయారని” జగన్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. దాడి జగన్ పై చేసిన మాటల దాడికి ఆ పార్టీ నేతలు కూడా దీటుగానే జవాబిచ్చారు. కానీ జగన్ కూడా ఆయనకు సంజాయిషీ ఇచ్చుకోవడమే చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.

 

దాడి విమర్శలపై జగన్ స్పందిస్తూ “నేను నా తల్లి విజయమ్మను వైజాగ్ నుండి నిలబెట్టడాన్ని కొందరు విమర్శిస్తున్నారు. ఆమె విశాఖకు ప్రాతినిధ్యం వహిస్తే ఉత్తరాంద్రాలో మూడు జిల్లాలకు ఆమె అండగా ఉంటారనే ఉద్దేశ్యంతోనే ఆమెను అక్కడి నుండి పోటీ చేయించాను. పైగా ఆమె అక్కడ ఉంటే నాకూ చాలా భరోసాగా ఉంటుందని భావించాను. విశాఖ జిల్లాలో పార్టీ నేతలు, కార్యకర్తల మీద పూర్తి నమ్మకంతోనే ఆమెను అక్కడ నుండి పోటీకి దింపి నేను మిగిలిన ప్రాంతాలలో ప్రచారంపై దృష్టి పెట్టాను తప్ప వేరే కారణం చేత కాదు” అని చెప్పుకొచ్చారు.

 

జగన్ తన తల్లి విజయమ్మను వైజాగ్ నుండి ఎందుకు పోటీలో నిలబెట్టారో వివరించారు, కానీ వైజాగ్ నుండి పోటీ చేద్దామనుకొన్న షర్మిలకు వైజాగ్ లోనే కాక మరెక్కడి నుండీ కూడా పోటీ చేసేందుకు ఎందుకు టికెట్ ఇవ్వలేదో మాత్రం వివరించలేదు. జిల్లాలో పార్టీ నేతలు, కార్యకర్తల మీద పూర్తి నమ్మకంతోనే తను స్వయంగా తల్లి కోసం ప్రచారం చేయలేదని చెపుతున్న జగన్మోహన్ రెడ్డి, మిగిలిన జిల్లాలలో ప్రచారం చేసారంటే అక్కడ పార్టీ నేతలు, కార్యకర్తల మీద ఆయనకు నమ్మకం లేదనుకోవాలా?

 

దాడి విమర్శలకు జగన్ స్వయంగా స్పందించనవసరం లేదు. కానీ స్పందించారు. అటువంటప్పుడు ఆయన లేవనెత్తిన ప్రతీ అంశం, చేసిన అన్ని ఆరోపణల పైనా స్పందించి ఉంటే బాగుండేది. కానీ ఎందువలనో స్పందించలేదు. పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచార సమయంలో కేసీఆర్ తో జగన్ కున్న రహస్య అవగాహన గురించ ప్రశ్నించినపుడు, దానికీ జగన్ నేరుగా జవాబు చెప్పలేకపోయారు. అతని సోదరి షర్మిల పవన్ కళ్యాణ్ పై ప్రతి విమర్శలు చేశారే తప్ప, పవన్ అడిగిన ఒక్క ప్రశ్నకు జవాబీయలేదు. పవన్ చేసిన ఏ ఒక్క ఆరోపణను ఖండించలేదు.

 

ఇటువంటి వ్యవహారాల వలననే వైకాపా ఓటమి పాలయింది. వైకాపా ఓటమికి వేరెవరో కారణం కాదు స్వయంగా జగన్మోహన్ రెడ్డే కారణమని దాడి వీరభద్రరావు చేసిన ఆరోపణలు నమ్మవలసివస్తుంది.