మునుగోడును ముంచెత్తనున్న నోట్లు!
posted on Aug 24, 2022 @ 3:17PM
చిన్న ఊరు దాన్ని పట్టించుకోలేదు ఓ కోటీశ్వరుడు.. ఫలితంగా ఆయన రాజ్యాన్ని ఆ ఊరువాళ్లే దెబ్బ తీశారు. . ఇదో సినిమా లో భాగం. కానీ మునుగోడు వ్యవహారం వేరు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం, బీజేపీ నీడలోకి వెళ్లడంతో మునుగోడు పై రాజకీయపార్టీల దృష్టి పడింది. ఇక్కడ కావడానికి ఉప ఎన్నికలే కానీ రాబోయే సాధారణ ఎన్నికలకు దీన్ని సెమీస్‌గా భావించి మరీ కాం గ్రెస్, టీఆర్ ఎస్, బీజేపీలు పోటీకి సిద్ధపడుతున్నాయి. ఉప ఎన్నికేగా అనుకోలేదు. ఇది సాధిస్తేనే పార్టీ ప్రతిష్ట రెండింతలవుతుందని టీఆర్ ఎస్, కేసీఆర్ మీద ఆగ్రహంతో ఎలాగయినా మునుగోడు సాధించా లన్న పట్టుదలతో బీజేపీ, ఏది ఏమయినా మునుగోడు మనం సాధించి తీరాల్సిందేనని కాంగ్రెస్ కంకణం కట్టుకుంది. అయితే ఈ మూడు పార్టీలూ ప్రజల్ని పోనీ ఓటర్లను ఆకట్టుకోవడానికి చేయాల్సిన అన్ని ప్రయత్నాల మీద ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి. ఇందులో కీలకమైనది ఓటర్లకు నోటు రుచి మరింత చూపడం.
ఎన్నికలంటేనే ఖర్చుతో కూడిన పని. ఇటీవలి కాలంలో మరింత పెరిగింది. పార్టీ తరఫు నిలబెట్టే అభ్యర్ధి మంచివాడా, సమర్దుడా అన్నది అవతల పెడితే ఆయన పార్టీ తరఫున ఎన్నికల్లో ఎంత పెట్టగలడు, ఓట్లను ఏమేరకు తూకానికి కొనేయగలడన్నదే ధర్మసూత్రంగా అమలుజరుగుతోంది. అదే పంథాను అన్ని పార్టీల వారూ అనుసరిస్తున్నారు. ఇది చాలాకాలం నుంచే ఉన్న ఎన్నికల సాంప్రదా యం అంటున్నారు విశ్లేషకులు. దీనికి అడ్డుకట్ట వేయడం ఎవరివల్లా కావడం లేదు. పైగా ఖర్చులతో కూడిన ఎన్నికలకు ఆ మాత్రం పెట్టాల్సి వస్తుందనే సమాధానాలే వినవలసి వస్తుంది.
చిత్రమేమంటే, అభ్యర్ధులు ఖర్చు పెట్టగలిగినవారయితేనే వారికి పార్టీ ప్రాధాన్యతనీయడం. అసలా అవ కాశమే లేని బీసీ నేతలకు పార్టీలు కేవలం ప్రచారానికి ఉపయోగపడే సేనగానే చూస్తున్నాయి. మంచి అభ్యర్ధి, జనంలో పలుకుబడి ఉన్నప్పటికీ, కాస్తంత గెలుస్తాడన్న నమ్మకం పార్టీకి ఉన్నప్పటికీ, ఎదుటి పార్టీ అభ్యర్ధి, ఆయన తరఫున ఆర్ధిక మద్దతునిచ్చేవారి సత్తా అన్నీలెక్కలోకి వస్తుంటాయి కనుక బీసీ నేత లకు పార్టీలు ధైర్యం చేసి టికెట్ ఇవ్వడమే లేదు.
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీ నుంచి బరిలో దిగేందుకు సిద్ధమయ్యారు. దీంతో సిట్టింగ్ స్థానం దక్కించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ సర్వ శక్తులు ఒడ్డాల్సిన పరిస్థితి వచ్చింది. విజయం సాధించేందుకు మునుగోడులో కోట్లు కుమ్మరిం చేందుకు పార్టీ వెనుకాడటం లేదు. పరిస్థితులు ఎలా ఉన్నా, కేసీఆర్‌ను భంగపరిచేందుకే బీజేపీ నిర్ణయించుకుంది. అందుకు మునుగోడు విజయం సదవకాశంగా కమలనాథులు భావిస్తున్నారు. కనుక ఖర్చుతో నిమిత్తం లేకుండా ప్రచారాన్ని భారీగానే సాగించేందుకు సిద్ధపడింది బీజేపీ. ఎంత వ్యయం అవుతుందనే లెక్కల కంటే ఎంత మెజారిటీ వస్తుందన్న ఆలోచనకే ప్రాధాన్యతనీయడం గమనార్హం.
కాగా, ఎలాగైనా మునుగోడు స్థానాన్ని దక్కించుకొని వచ్చే ఎన్నికల్లో ఆధిపత్యం తమదేనని రుజువు చేసు కునేందుకు అధికార టీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఓడితే ముప్పు తప్పదని ఆ పార్టీ భావిస్తోంది. మునుగోడులో బీసీల ఓటింగ్ శాతం అధికంగా ఉన్నప్పటికీ ఉప ఎన్నికలో గెలవడం అవసరం గనుక ఎన్నికల ఖర్చు భరాయించేవారికే టిక్కెట్ ఇవ్వడానికి నిర్ణయించుకుంది. పార్టీ అభ్యర్ధి కంటే ఈ ఉప ఎన్నికలో ఖర్చుకు వెనుకాడకూడదన్న నిబంధన పెట్టుకున్నట్టే తోస్తుంది.
ప్రతిష్ఠాత్మకంగా ముందుకొచ్చిన మునుగోడు ఎన్నికల్లో భారీ ఖర్చుకు మూడు పార్టీలు తెరలేపాయి. బీజేపీకి లేని ఓటింగ్ శాతాన్ని తెచ్చుకునేందుకు రాజగోపాల్ రెడ్డి తన శక్తియుక్తులన్నింటినీ ధారపోయా ల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ఒక ఎంపీపీతో పాటు పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు కాంగ్రెస్, టీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరారు. వారికి భారీగానే ముడుపులు ముట్టజెప్పారని వైరివర్గాలు ఆరోపిస్తు న్నాయి. ఇంకా నేతల కొనుగోళ్లకు భారీ ఆఫర్ ఇస్తామని ఆశ చూపుతున్నారని ఆరోపణ లున్నాయి.
అధికార టీఆర్ఎస్ పార్టీలో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి పలువురు నేతలు, కొందరు ప్రజాప్రతినిధులు చేరారు. సొంత పార్టీ ప్రజాప్రతినిధులను కాపాడుకునేందుకు అడ్వాన్సులు ఇచ్చి అడ్డుకట్ట వేసే ప్రయ త్నం చేసిందని ప్రచారం. అంటే అధికార పార్టీ కూడా ముడుపుల మూట విప్పిందని గుసగుసలు.
అంతర్గత కుమ్ములాటల కారణంగా, రేవంత్ రెడ్డికి కరోనా కారణంగా కాంగ్రెస్ పార్టీ ఇంకా సర్దుకోకున్నా ఓ అంచనాకు అయితే వచ్చిందని తెలిసింది. ముందు నుంచి ప్రచారం జరుగుతున్నట్టుగానే భారీ ఖర్చు కు వెనుకాడని నేతకే సీటు ఖరారు చేసే అవకాశముందని తెలిసింది. తమకే సీటు కేటాయించా లంటూ అటు కాంగ్రెస్, ఇటు టీఆర్ఎస్ లో మొదట బీసీ నేతలు రాగం అందుకున్నారు. ప్రస్తుతం ఆ రాగం నెమ్మదించింది. ఎందుకంటే భారీ ఖర్చు భరించలేరనే విషయం చర్చకు వచ్చింది. టీఆర్ఎస్ పార్టీ అధి ష్ఠానమే ఖర్చు పెట్టుకుంటుందన్న ప్రచారం ఉన్నా అభ్యర్థి కూడా భారీగానే పెట్టుకోవాల్సి ఉందనే ఆలో చన ఉంది. అధిష్ఠానాల వద్దకు వెళ్లిన బీసీ నేతల ముందు ఎన్నికల ఖర్చు విషయం లేవనెత్తినట్లు తెలి సింది. ఎం తంటే సుమారు రూ.100 కోట్లు పెట్టగలరా అంటూ బీసీ నేతలను ఆయా పార్టీల అధి నేతలు ప్రశ్నించారని సమాచారం.
నేతలు, ప్రజాప్రతినిధుల కొనుగోలు, ఓటర్లకు తాయిలాలు, మద్యం, సొంత పార్టీ ప్రచారం తదితర ఖర్చు లు కలుపుకొని అటూ ఇటుగా సుమారు రూ.100 కోట్లవుతుందని ఓ అంచనాకు వచ్చినట్లు భావిస్తున్నారు. అంత ఖర్చు తాము భరించలేమంటూ బీసీ నేతలు మెల్లిగా వెనక్కి తగ్గినట్లు విశ్లేషకులు అంటున్నారు. దీంతోనే టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో బీసీ నేతలకు అవకాశం సన్నగిల్లిందని అంటు న్నారు.
దీన్నిబట్టి మూడు పార్టీలు కలిపి మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నికలో సుమారు రూ.300 కోట్లకు పైగా ఖర్చు చేస్తాయన్న మాట. అధికార పార్టీకి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడానికి అదనంగా ప్రభుత్వ ఖర్చు ఉండటం వేరే విషయం. మునుగోడు ఉప ఎన్నిక తెలంగాణ, ఉమ్మడి రాష్ట్రంలోనే కాదు దేశం లోనే కాస్ట్లీ ఎన్నిక కానుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తాయిలాల విషయానికి వస్తే పండుగే పండుగని ఎక్కువ మంది ఓటర్లు మురిసిపోతున్నారు.