ఎన్టీఆర్ తో అమిత్ షా భేటీ... గులాబి అధికారానికి చెక్ పెట్టే స్కెచ్చేనా?
posted on Aug 24, 2022 @ 3:23PM
వచ్చే ఎన్నికల్లో గులాబీ బాస్, సీఎం కేసీఆర్‌ను గద్దె దింపి... అటు నుంచి అటే ఫామ్ హౌస్‌కు పంపి.. తెలంగాణలో అధికార పీఠాన్ని హస్తగతం చేసుకొనేందుకు మోదీ, అమిత్ షా ద్వయం చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. గతంలో ప్రత్యేక తెలంగాణ కోసం బొంత పురుగునైనా ముద్దు పెట్టుకుంటానని కేసీఆర్ అన్నారు. ఇప్పుడు తెలంగాణలో అధికారం కోసం ఏం చేయడానికైనా సిద్ధం అన్న తీరులో కమలనాథులు వ్యవహరిస్తున్నారు. ఇందుకోసం కొత్త కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. అనూహ్య వ్యూహాలు పన్నుతున్నారు. అదిగో అందులో భాగమే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా మునుగోడులో బహిరంగ సభకు హజరై ఆ తరువాత రామోజీ ఫిల్మ్ సిటీలో రామోజీరావుతోనూ, నోవాటెల్ హోటల్ లో జూనియర్ ఎన్టీఆర్ తోనూ భేటీలు అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణతో తెలుగేదేశం పార్టీలో నేతలు ఖాళీ అయిపోయారు కానీ, క్యాడర్ మాత్రం చెక్కు చెదరకుండా అలాగే ఉంది. ఇంత కాలం ఆ క్యాడర్ ఏ పార్టీకి మద్దతుగా కదిలిన పరిస్థితి లేదు. అదిగా ఆ క్యాడర్ అవును తెలుగు దేశం క్యాడర్ తమకు మద్దతు పలికేలా చేసుకోవడం అనే వ్యూహంతోనే అమిత్ షా మునుగోడు సభ అనంతరం రామోజీరావు, ఎన్టీఆర్ లతో వేరువేరుగా భేటీ కావడమని అంటున్నారు.
తెలంగాణలో కేసీఆర్ ఫ్యామిలీతో కలబడి నిలబడి గెలవాలంటే... తెలంగాణ తెలుగుదేశం క్యాడర్ అండ అవసరమని కమలనాథులు భావిస్తున్నారు. నేరుగా చంద్రబాబుతో ఆ విషయం మాట్లాడే కంటే.. ఎన్టీఆర్ ద్వరా అయితే ఆ పని సులువు అవుతుందని భావిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కు ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఉన్న ఫ్యన్ బేస్ కూడా తోడయ్యేలా కమలనాథులు వ్యూహం పన్నారని అంటున్నారు.
కోరినా జూనియర్ ఎన్టీఆర్ కమలం గూటికి చేరే అవకాశం లేదని బీజేపీ అగ్రనేతలకు బాగానే తెలుసు. అందుకే ఏపీలో తెలుగుదేశంకు కమలం అండ, తెలంగాణలో కమలానికి తెలుగుదేశం అండ అనే ఫార్ములాను తెరమీదకు తీసుకు వచ్చారంటున్నారు. అందులో భాగంగానే జూనియర్ ఎన్టీఆర్ తెలంగాణ తెలుగుదేశం సరథ్య బాధ్యతలు చేపట్టి బీజేపీతో మైత్రి కొనసాగించేలా. అందుకు ప్రతిగా ఏపీలో తెలుగుదేశంతో బీజేపీ మైత్రీ బంధం బలపడేలా ఒక ఒప్పందం ఖరారు చేసుకునే వ్యూహంలో భాగంగానే జూనియర్ ఎన్టీఆర్ తో అమిత్ షా బేటీ జరిగిందని విశ్లేషకులు అంటున్నారు. అంతే కాకుండా తెలంగాణలో స్థిరపడ్డ ఆంధ్రుల ఓట్లు కూడా గణనీయంగానే ఉన్నాయి. వారంతా సాధారణంగా తెలుగుదేశం వైపే మొగ్గు చూపుతారన్న అంచనాతో అమిత్ షా ఎన్టీఆర్ తో భేటీ నిర్వహించారని చెబుతున్నారు.