పాకిస్థాన్ మీద ఇండియా ఘన విజయం
posted on Feb 15, 2015 @ 4:06PM
ప్రపంచ కప్ క్రికెట్‌లో ఇండియా చేతిలో పాకిస్థాన్ మరోసారి ఓడిపోయింది. ఇప్పటికి వరుసగా ఐదుసార్లు భారత్ చేతిలో మట్టి కరిచిన పాకిస్థాన్ జట్టు ఈసారైనా గెలవాలని ఆశపడింది. అయితే ఆ ఆశ నిరాశగానే మిగిలిపోయింది. ప్రపంచ కప్ లీగ్ మ్యాచ్‌ల్లో భాగంగా ఇండియా - పాకిస్థాన్ జట్ల మధ్య ఆస్ట్రేలియాలోని అడిలైడ్‌లో జరిగిన మ్యాచ్‌లో ఇండియా పాకిస్థాన్ మీద 76 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత క్రికెట్ జట్టు యాభై ఓవర్లకు 7 వికెట్లు కోల్పోయి 300 పరుగులు చేసింది. నిలకడగా ఆడుతూ వచ్చిన భారత క్రీడాకారులు ఒక దశలో 350 పరుగులు చేస్తారనే దూకుడులో కనిపించినప్పటికీ, కీలకమైన చివరి 5 ఓవర్లలో 28 పరుగులు మాత్రమే చేసి 5 వికెట్లను కోల్పోవడంతో ఇండియా 300 పరుగులు మాత్రమే చేసి పాకిస్థాన్‌కి 301 పరుగుల విజయలక్ష్యాన్ని ఇచ్చింది. ఆ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన పాకిస్థాన్ జట్టు 47 ఓవర్లలో 224 పరుగులు చేసి ఆలౌట్ అయింది. దాంతో భారత్‌ను విజయం వరించింది. ప్రపంచ కప్‌లో ఇండియా చేతిలో ఓడిపోయే సంప్రదాయాన్ని పాకిస్థాన్ కొనసాగించింది.