క్రికెట్ తో దౌత్యానికి ముడిపెట్టొద్దు సుష్మ
posted on Apr 1, 2011 @ 10:08AM
చెన్నై: కేంద్ర ప్రభుత్వం క్రీడలకీ, దౌత్యానికి ముడి పెట్టడానికి చేస్తున్న ప్రయత్నాలను బిజెపి సీనియర్ నేత సుష్మా స్వరాజ్ విమర్శించారు. ‘ఆటను ఆటగానే చూడాలి. చర్చలు, దౌత్య వ్యవహారాలు ప్రత్యేకంగానే ఉండాలి’ అని లోక్‌సభలో ప్రతిపక్ష నాయకురాలు సుష్మాస్వరాజ్ మీడియాతో అన్నారు. మొహిలీలో బుధవారం జరిగిన క్రికెట్ పోటీలకు పాక్ ప్రధాని, భారత్ ప్రధానులు హాజరవడం గురించి ఆమె ప్రస్తావించారు. క్రీడలకూ. దౌత్యానికి ముడి పెడితే క్రీడాకారులపై ఒత్తిడి పడి వారి ఆటతీరును ప్రభావితం చేస్తుందని ఆమె అన్నారు. ఎన్నికల కమిషన్ పనితీరును ఆమె ప్రశంసిస్తూ, అది నిష్పక్షపాతంగానే పనిచేస్తోందని కానీ తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి మాత్రం ఏదో నిరాశతో ఇసిని విమర్శిస్తున్నారని అన్నారు. దేశంలో తమిళనాడులో చక్కటి పరిపాలన ఉండేదని, కానీ డిఎంకె అధికారంలోకి వచ్చాక గత ఐదేళ్లలో అక్కడ పరిస్థితులు క్షీణించాయని ఆమె చెప్పారు. డిఎంకెకి చెందిన కేంద్ర మాజీ మంత్రి ఎ.రాజాపై 2జి స్పెక్ట్రమ్ కుంభకోణం కేసులో సిబిఐ 80 వేల పేజీలతో చార్జిషీట్‌ను సుప్రీంకోర్టుకు దాఖలు చేయనుందని అన్నారు. ఎన్నికల పేరుతో జనాలను మభ్యపెట్టి ఈ అవినీతి మచ్చను తుడిపేసుకోవచ్చునని డిఎంకె భావిస్తే అది తప్పే అవుతుందని ఆమె చెప్పారు. తమిళనాడు బిజెపి వ్యవహారాల ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న సుష్మాస్వరాజ్ అసెంబ్లీ ఎన్నికల గురించి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీస్తున్న అవినీతి పవనాలు, కేంద్రంలో కాంగ్రెస్ పాలనపై ఉన్న వ్యతిరేకత, తమ పార్టీపై ప్రజల్లో నెలకొన్న సానుకూల భావనల వల్ల తమ పార్టీ ఎక్కువ స్థానాలనే సాధిస్తుందన్న విశ్వాసాన్ని ఆమె వ్యక్తం చేశారు