జగన్ సర్కారుపై క్రేజీ మీమ్స్.. సోషల్ మీడియాలో ఫుల్ ట్రోలింగ్..
posted on Sep 13, 2021 @ 3:34PM
సీఎం జగన్ నిర్ణయాలు ఏ ఒక్క వర్గాన్నీ సంతోష పెట్టలేక పోతున్నాయి. పాలనంతా కామెడీ కామెడీగా సాగుతోంది. గతంలో ఎన్నడూ చూడని, వినని చర్యలతో పబ్లిక్‌ని పరేషాన్ చేస్తున్నారు. ఇసుక పాలసీ అంటూ కూలీల నోట్లో మన్ను కొట్టారు. ఏపీలో ఉపాధి లేకుండా చేశారు. ఒక్క కంపెనీ, పరిశ్రమనైనా ఏర్పాటు చేయకుండా.. పెట్టుబడులను ఆకర్షించకుండా.. రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారనే విమర్శ. ఉన్న పరిశ్రమలపైనే కత్తిగట్టి.. వాటంతట అవే వెళ్లిపోయేలా చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కేవలం మద్యం ఆదాయంపైనే ఆధారపడి.. అప్పులతో పాలనను నెట్టుకొస్తున్నారని అంటున్నారు. ఖజానా మొత్తం ఖాళీ కావడం.. కొత్త అప్పులు ముట్టకపోవడం.. ఉద్యోగులకు సమయానికి జీతాలు వేయలేక పోవడం.. ఇలా దివాళా అంచునకు చేరిన ఏపీకి.. సరికొత్త మార్గంలో ఆదాయాన్ని సమకూర్చే ఆలోచనలు చేస్తోంది జగన్‌రెడ్డి ప్రభుత్వం. అయితే, ఆ ఐడియాలే బహు విచిత్రంగా ఉండటం.. విమర్శల పాలవుతోంది.
అసలే కరోనా కాలం. సినిమాలు, థియేటర్లు అంతంత మాత్రం. ఈ సమయంలో వైసీపీ సర్కారుకు ఆదాయం రాబట్టుకోడానికి బ్రహ్మాండమైన ఆలోచన చేసింది. ఇకపై ఏపీలో సినిమా టికెట్లను ప్రభుత్వమే అమ్మితే ఎలా ఉంటుందనే విధంగా కసరత్తు చేస్తోంది. ప్రభుత్వం నిర్ణయించిన అతి తక్కువ ధరలకు షోలు నడిపితే.. తాము దివాళా తీయడం ఖాయమని ఇప్పటికే థియేటర్ల సమాఖ్య ఆవేదన, ఆందోళన వ్యక్తం చేస్తేంటే.. తాజాగా, ఆ సినిమా టికెట్లను సైతం తామే ఆన్‌లైన్లో అమ్ముతామంటూ ప్రభుత్వం ముందుకు రావడం తీవ్ర వివాదాస్పదమవుతోంది.
సినిమా టికెట్ల ఐడియా బాగా నచ్చినట్టుంది.. అదే దారిలో.. ప్రభుత్వ ఆధ్వర్యంలో మటన్, చేపలు, రొయ్యలు అమ్మాలని భావిస్తోంది. రాష్ట్రంలో లక్షలాది మంది చిరు వ్యాపారులు నాన్‌వెజ్ అమ్ముతూ ఉపాధి పొందుతున్నారు. అలాంటిది ఏకంగా ప్రభుత్వమే మటన్, ఫిష్ అమ్మితే.. ఇక వారంతా రోడ్డున పడాల్సిందేననే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సర్కారుకు ఇలాంటి తలాతోకాలేని ఆలోచనలు ఎలా వస్తున్నాయో అర్థం కావట్లేదని అంతా మండిపడుతున్నారు. బయటకు రాకుండా తాడేపల్లి ప్యాలెస్‌లోనే తిష్టవేసి.. సీఎం జగన్ ఇలాంటి క్రియేటివ్ ఐడియాస్‌నే తయారు చేస్తున్నారా? అని ప్రశ్నిస్తున్నారు.
ఇక సోషల్ మీడియాలోనైతే వైసీపీ ప్రభుత్వంపై మీమ్స్ మామూలుగా లేవు. సినిమా టికెట్ల అమ్మకం నుంచి.. మటన్, ఫిష్, వంకాయలు, బెండకాయలు అమ్ముతూ రాష్ట్రానికి కోట్లకు కోట్లు రాబడి సృష్టిస్తున్నారంటూ సెటైర్లు వేస్తున్నారు. పనిలో పనిగా భవిష్యత్తులో.. సైకిళ్లకు పంచర్లు, బండ్లకు గాలి కొట్టడాలూ చేయాలని.. వాటితోనూ కోట్ల రాబడి సాధించాలని సలహాలు, సూచనలు ఇస్తున్నారు. అబ్బో పర్లేదు.. ఏపీని ఎక్కడికో తీసుకుపోవచ్చు.. అంటూ ఇంట్రెస్టింగ్ మీమ్స్‌తో జగన్ సర్కారును సోషల్ మీడియాలో కుమ్మేస్తున్నారు నెటిజన్స్.