ప్రగతిభవన్‌లోకి సీఎల్పీ లీడర్.. రేవంత్‌రెడ్డిని సీనియర్లు టార్గెట్ చేశారా?
posted on Sep 13, 2021 @ 3:05PM
రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్ అయినప్పటి నుంచీ కాంగ్రెస్‌లో జోష్ మామూలుగా లేదు. హస్తం కేడర్‌లో మునుపటి ఉత్సాహం ఉరకలెత్తుతోంది. రేవంత్ దూకుడు.. కాంగ్రెస్‌లో పాత రోజులను గుర్తుకు తెస్తున్నాయి. దళిత బంధుతో సీఎం కేసీఆర్ తెలంగాణలో పూర్తిగా పాగా వేయాలని చూస్తున్నారు. అందుకు విరుగుడు మంత్రంగా దళిత-గిరిజన దండోరా సభలతో రేవంత్‌రెడ్డి గులాబీ బాస్‌కు చెక్ పెడుతున్నారు. రేవంత్‌రెడ్డి నిర్వహిస్తున్న దండోరాకు ప్రజలు లక్షల్లో తరలివస్తుండటం.. సభలు ఫుల్‌గా సక్సెస్ అవుతుండటంతో.. కాంగ్రెస్ మాంచి ఊపు మీదుంది. ఇలాంటి సమయంలో.. కాంగ్రెస్ ఉత్సాహాన్ని నీరుగార్చేలా.. పార్టీ సీనియర్లు పస లేని నిర్ణయాలు తీసుకుంటున్నారని రేవంత్ వర్గం మండిపడుతోంది. దళిత బంధుపై ఓ వైపు రేవంత్‌రెడ్డి అలుపెరగని పోరాటం చేస్తుంటే.. అదే సమయంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క దళిత బంధుపై సీఎం కేసీఆర్ నిర్వహించే సమీక్ష సమావేశానికి హాజరవడం పార్టీలో కలకలం రేపుతోంది. ఒకే పార్టీలో ఇలా రెండు వేరు వేరు వైఖరిలు సరికాదని హస్తం నేతలే తప్పుబడుతున్నారు. సో కాల్డ్ సీనియర్లంతా దగ్గరుండి సమాలోచనలు జరిపి.. కేసీఆర్‌తో మీటింగ్‌కు భట్టిని పంపించడం ఏంటని.. ఇదంతా రేవంత్‌రెడ్డి దూకుడుకు బంధనాలు వేయడమేనని విమర్శిస్తున్నారు.
తెలంగాణలో 4 మండలాల్లో దళిత బంధు పైలట్ ప్రాజెక్టు అమలుపై సీఎం కేసీఆర్ సన్నాహక సమావేశం నిర్వహించారు. అందులో, మధిర శాసనసభ నియోజకవర్గంలోని చింతకాని మండలం కూడా ఉంది. అందుకే, స్థానిక ఎమ్మెల్యే అయిన భట్టి విక్రమార్కకు ఆహ్వానం అందింది. దీంతో భట్టి నివాసంలో ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, పొదెం వీరయ్య, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాస్కీగౌడ్, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తదితరులు భేటీ జరిపారు. ముఖ్యమంత్రి నిర్వహించే దళితబంధు సమావేశంలో పాల్గొని.. కాంగ్రెస్ తరఫున డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచాలని నిర్ణయించారు.
భట్టి నివాసంలో జరిగిన మీటింగ్‌కు హాజరైన వారిలో మధుయాష్కీ మినహా మిగతా సీనియర్లందరిపై రేవంత్‌రెడ్డి వ్యతిరేకులనే ముద్ర ఉండటం ఆసక్తికరం. పీసీసీ చీఫ్ రేవంత్‌ను ముందు నుంచీ లైట్ తీసుకుంటున్న కోమటిరెడ్డి బ్రదర్స్ ఈ భేటీలో యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేయడం అందుకు మరింత బలం చేకూరుస్తోంది. రేవంత్‌రెడ్డి ఛాలెంజింగ్‌గా తీసుకొని చేపడుతున్న దళిత-గిరిజన దండోరా సభల స్పూర్తిని చెడగొట్టడానికే సీనియర్లు ఇలా సమావేశమై సీఎంతో మీటింగ్‌కు కాంగ్రెస్ తరఫున భట్టిని పంపించారనే ఆరోపణ వినిపిస్తోంది. దండోరా సభకు ఏకంగా రాహుల్‌గాంధీనే రప్పించాలని రేవంత్‌రెడ్డి ప్రయత్నిస్తుంటే.. సీఎల్పీ లీడర్ మాత్రం ఇలా దళిత బంధు సమీక్షకు వెళ్లడం ప్రజల్లో ఎలాంటి మెసేజ్ ఇస్తుందో తెలీదా? అని ప్రశ్నిస్తున్నారు. ఏ ప్రగతి భవన్ నుంచైతే కేసీఆర్‌ను బయటకు గుంజుతానని రేవంత్‌రెడ్డి సవాల్ చేశారో.. అదే ప్రగతి భవన్‌లోకి వెళ్లి కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత భట్టి.. సీఎం కేసీఆర్‌తో సమావేశమవడాన్ని రేవంత్ వర్గీయులు తీవ్రంగా తప్పుబడుతున్నారు. రేవంత్‌పై కళ్ల మంటతోనే సీనియర్లు ఇలా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. ఆ మేరకు అధిష్టానానికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు.