జగన్ బెయిల్ రద్దైతే ఏమవుతుందో తెలుసా..!
posted on Jul 17, 2021 @ 10:59AM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు కాబోతుందా? జగన్ బెయిల్ రద్దై జైలుకు పోతే ఏం జరగనుంది? వైసీపీని నడిపిదేవరు.. సీఎం పీఠం దక్కేదెవరికి? ఈ చర్చలే కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ తో పాటు దేశ వ్యాప్తంగా జరుగుతున్నాయి. అక్రమాస్తుల కేసులో గతంలో జైలుకు వెళ్లారు జగన్. 16 నెలలకు పైగా ఆయన జైలు జీవితం గడిపారు. అక్రమాస్తులకు సంబంధించి జగన్ పై మొత్తం 16 చార్జీష్టీట్లు కోర్టుల్లో దాఖలయ్యాయి. అన్ని కేసుల్లోనూ ఏ1గా ఉన్నారు జగన్. ప్రస్తుతం బెయిల్ పై బయట ఉన్నారు జగన్మోహన్ రెడ్డి.
ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ నర్సాపురం ఎంపీ రఘురామ రాజు వేసిన పిటిషన్ తో ఈ అంశం కీలకంగా మారింది. రఘురామ పిటిషన్ పై ఇప్పటికే సీబీఐ కోర్టులో పలు సార్లు విచారణ జరిగింది. జగన్ తరపు కౌంటర్ కూడా దాఖలైంది. రఘురామ తరపున లాయర్ వాదనలు కూడా వినిపించారు. సాక్షులను ప్రభావితం చేస్తున్నందున జగన్ బెయిల్ రద్దు చేయాలని పిటిషనర్ గట్టిగా కోరుతున్నారు. ఈ కేసులో గతంలో కౌంటర్ దాఖలు చేయకుండా చట్ట ప్రకారం వెళ్లాలని కోరింది సీబీఐ. బెయిల్ రద్దు చేయాలని కాని వద్దని కాని చెప్పలేదు. అయితే జూలై 14న జరిగిన విచారణలో మాత్రం తన స్టాండ్ మార్చుకుంది సీబీఐ. కౌంటర్ వేయడానికి తమకు 10 రోజుల గడువు కావాలని కోరింది. దీంతో విచారణకు జూలై 26కు వాయిదా వేసింది సీబీఐ కోర్టు.
జగన్ బెయిల్ రద్దు కేసులో సీబీఐ కౌంటర్ లో ఏం ఉండబోతుందన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. గతంలో చట్ట ప్రకారం వెళ్లాలని కోర్టును కోరిన సీబీఐ.. తాజాగా మాత్రం కౌంటర్ వేయనుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. బెయిల్ రద్దు చేయాలని కోరితే మాత్రం జగన్ జైలుకు వెళ్లడం ఖాయమేనని అంటున్నారు. ఎంపీ రఘురామ రాజు కూడా ఇదే విషయం చెబుతున్నారు. జగన్ బెయిల్ రద్దు కావడం ఖాయమని ఆయన పక్కా ధీమాగా ఉన్నారని అంటున్నారు. కోర్టులో ఏం జరుగుతుందన్న దానిపై వైసీపీ నేతల్లోనూ టెన్షన్ కనిపిస్తోందని తెలుస్తోంది. జగన్ బెయిల్ రద్దైతే ఏం జరుగుతుంది, రాష్ట్ర రాజకీయాలు ఎటువైపు దారి తీస్తాయి.. ముఖ్యమంత్రి బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారు.. వైసీపీని నడిపిదెవరు అన్న చర్చలు కూడా జోరుగా సాగుతున్నాయి.
అయితే ఏపీ ముఖ్యమంత్రి జగన్ బెయిల్ రద్దైతే ఏం జరుగుతుందన్న దానిపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ బెయిలు రద్దు అవుతుందో, లేదో తెలియదు కానీ రఘురామరాజు పార్లమెంటు సభ్యత్వం మాత్రం రద్దవుతుందని జోస్యం చెప్పారు. రఘురామ కోసం ఏపీలో బలమైన వైసీపీని బీజేపీ వదులుకోదని నారాయణ అన్నారు. రఘురామరాజు కోరుకున్నట్టు బెయిలు రద్దయి జైలుకు వెళ్లినా జగన్‌కు వచ్చే నష్టం ఏమీ ఉండదన్నారు. గతంలో 16 నెలలు జైలులో ఉన్న జగన్ ఆ సానుభూతితో ఎన్నికల్లో గెలిచారని, మరోసారి జైలుకు వెళ్తే ఆయన అర్ధాయుష్షు కాస్తా పూర్ణాయుష్షుగా మారుతుందని నారాయణ కామెంట్ చేశారు.