సెకండ్ డోసుకు ఆలస్యమూ మంచిదే ...
posted on May 24, 2021 8:44AM
వాక్సిన్ ఫస్ట్ డోస్ వేయించుకుని సెకండ్ డోస్’ డిలే అవుతోందని ఆందోళన చెందుతున్న వారికి, శుభ వార్త. ఒక తీపి కబురు ... వాక్సిన్, వన్ ..టూ ల మధ్య ఎంత గ్యాప్ ఉండాలనే విషయంపై పరిశోధనలు జరిపిన, అమెరికాలోని మయో క్లినిక్ వ్యాక్సిన్ రీసెర్చ్ గ్రూప్ డైరెక్టర్, వైరాలజిస్ట్ గ్రెగొరీ పోలండ్, ఆలస్యం అమృతం విషం ... కాదు, ఆలస్యమే అమృతం అంటున్నారు. ఫస్ట్ ,సెకండ్ డోసుల మధ్య ఎంత ఎక్కువ గ్యాప్ ఉంటే అంత మంచిదని, గ్యాప్ పెరగడం వలన యాంటీబాడీలు 20 నుంచి 300 శాతం ఎక్కువగా పెరుగుతాయని తేలిందని గ్రెగొరీ చెప్పారు. దాదాపు అన్ని రకాల వ్యాక్సిన్లలో ఈ తరహా ఫలితాలే చూసినట్టు ఆయన వెల్లడించారు.
మొదటి డోసు వ్యాక్సిన్ వేసిన వారికి స్వల్ప కాలంలోనే రెండో డోసు కూడా వేస్తుండడంతో అందరికీ వ్యాక్సిన్ అందడం ఆలస్యమవుతోంది. అలా కాకుండా మొదటి డోసు వ్యాక్సిన్ తీసుకున్న వారికి రెండో డోసును ఆలస్యం చేసి ఇతరులకు ఇవ్వడం ద్వారా ఎక్కువ మందికి వ్యాక్సినేషన్ పూర్తవుతుంది. రెండు డోసుల మధ్య గ్యాప్ ఎంత పెరిగితే అంత మంచిదని చాలా పరిశోధనలు రుజువు చేస్తున్నాయ`ని గ్రెగొరీ అన్నారు.
అదలా ఉంటే ఈ గ్రెగొరీ ఎవరో కానీ, మన ప్రభుత్వాలకు చల్ల చల్లని స్వీట్ స్వీట్ కబురు చెప్పారు. గ్రెగొరీ పరిశోధన ఫలాలు, ‘రోగి కోరుకున్నది, వైద్యుడు ఇచ్చింది ఒకటే’ అన్న సామెతను గుర్తుకు తెస్తోంది. దేశంలో,అవసరానికి సరిపడా వాక్సిన్ తయారు కావడం లేదు. దీంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విమర్శలు ఎదుర్కుటున్నాయి. అలాగే, వాక్సిన్ పంపిణీలో వివక్ష చూపుతోందని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రాన్ని తప్పుపడుతున్నాయి. ఈ పరిస్థితిలో గ్రెగొరీ’ ప్రభుత్వాలకే కాదు, సెకండ్ డోసు లేటయితే, ఫస్ట్ డోసు వేస్ట్ అవుతుందని ఆందోళన చెందుతున్న జనాలకు కూడా తీపి కబురు చెప్పింది.