ఏపీలో ఘోరం.. ఆక్సిజన్ అందక 12 మంది మృతి..
posted on May 1, 2021 @ 5:23PM
కరోనా ఆ పేరు వింటే పసిపిల్లతో పాటు. పండు ముసలి కూడా పరేషాన్ పడుతున్నారు. ఎవరి ప్రాణాలు వాళ్ళు అరచేతిలో పెట్టుకుని ఇంట్లో ఓ మూలాన నక్కి కూర్చుంటున్నారు. కరోనా కేసులతో పాటు, మృతుల సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతున్నాయి. ఒక వైపు వ్యాక్సిన్ అందడం లేదు. మరో వైపు ఆక్సిజన్ అందడం లేదు. తాజాగా ఆక్సిజన్ అందక ఒకే రోజు నలుగురు మృతి చెందారు. ఆసుపత్రి యాజమాన్యం అది తప్ప్పుడు ప్రచారం అని వాదిస్తుంది. భాదితులు మాత్రం ఆక్సిజన్ అందుకనే మృతి చెందారని అంటున్నారు.
కర్నూలు జిల్లాలో కొత్త బస్టాండ్ సమీపంలో ఉన్న కేఎస్ కేర్ ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరతతో నలుగురు కొవిడ్ బాధితులు మృతిచెందారు. దీంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇతర రోగులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఇతర ఆస్పత్రులకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న నాలుగో పట్ణణ పోలీసులు ఆస్పత్రికి వచ్చి తనిఖీలు చేయగా.. ఐసీయూలో నాలుగు మృతదేహాలు ఉన్నట్లు గుర్తించారు. అయితే ఆక్సిజన్ అందక ఏ ఒక్కరూ మృతి చెందలేదని ఆస్పత్రి యాజమాన్యం తేల్చి చెప్పింది.
విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ వీరపాండియన్ ఆస్పత్రికి చేరుకుని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..‘‘ఆస్పత్రిలో ఆక్సిజన్ సరఫరా లేక రోగులు మృతి చెందారనే విషయం మా దృష్టికి వచ్చింది. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం. ఆస్పత్రి ఎండీపై క్రిమినల్ కేసు నమోదు చేస్తాం. అనుమతి లేకుండానే ఇక్కడ కొవిడ్ చికిత్సలు చేస్తున్నారు. ఘటనపై విచారణకు ఆదేశించాం’’ అని కలెక్టర్ తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు డీఎంహెచ్‌వో గిడ్డయ్య ఆస్పత్రికి చేరుకుని విచారణ చేపట్టారు.
దేశ రాజధానిలోని 8 మంది మృతి..
దేశ రాజధానిలోని ఓ ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరతతో ఓ వైద్యుడు సహా 8 మంది ప్రాణాలు కోల్పోయారు. దిల్లీలోని బత్రా ఆసుపత్రిలో శనివారం ఉదయం మెడికల్ ఆక్సిజన్ నిల్వలు పూర్తిగా నిండుకున్నాయి. ప్రాణవాయువు ట్యాంకర్లు ఆసుపత్రికి చేరేలోపే.. ఐసీయూలో ఉన్న ఆరుగురు కరోనా రోగులు.. వార్డులో ఉన్న ఇద్దరు మృతిచెందారు. ఇదే ఆసుపత్రికి చెందిన గ్యాస్ట్రోఎంటరాలజీ యూనిట్ హెడ్ డాక్టర్ ఆర్కే హింథనీ కూడా ఆక్సిజన్ లేక ప్రాణాలు కోల్పోవడం గమనార్హం.