కరోనా కాలంలో చర్చిల నిర్మాణం! జగన్ రెడ్డి సర్కార్ నిర్వాకం
posted on May 1, 2021 @ 4:26PM
ఏపీలో కొవిడ్ కల్లోలం. ప్రతీరోజూ సుమారు 17 వేల కేసులు. పదుల సంఖ్యలో మరణాలు. మందుల కోసం ఇక్కట్లు. హాస్పిటల్ బెడ్స్ కోసం కష్టాలు. ఆక్సిజన్ కోసం ఆరాటం. ప్రాణాలతో రోగుల పోరాటం. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత కల్లోల పరిస్థితులకు జగన్ సర్కారే కారణమనే విమర్శ. ఓవైపు కొవిడ్ కుమ్మేస్తుంటే.. మరోవైపు పది, ఇంటర్ పరీక్షలంటూ ప్రభుత్వం పంతానికి పోతోంది. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతోంది. ఇవి చాలవన్నట్టు.. పాలకుల వైఫల్యం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు.. ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్, సంగం డెయిరీ స్వాధీనంతో కక్ష సాధింపు చర్యలు చేపడుతోంది. ఇదంతా ఓవైపు. ఇవన్నీ పైకి కనిపిస్తున్న విషయాలు. మరి, లోలోన.. మరింత ఘోరం జరుగుతోంది. గుట్టు చప్పుడు కాకుండా యవ్వారం చక్కబెడుతోంది. అదే, ఏపీలో చర్చిల నిర్మాణం.
అవును, నిజమే. ప్రస్తుత కరోనా కల్లోల సమయంలో సైలెంట్‌గా, అండర్ కరెంట్‌గా.. చర్చిల నిర్మాణం, మరమ్మత్తులకు టెండర్లు పిలుస్తోంది. ఏప్రిల్ 26 నుంచి ఇప్పటి వరకూ 4 కోట్ల విలువైన పనులకు టెండర్లు ఆహ్వానించింది. ఈ విషయం ఎవరికైనా తెలుసా? ఎక్కడైనా ఈ న్యూస్ వచ్చిందా? ఎవరికీ తెలీదు. ఎక్కడా ఈ వార్త కనిపించదు. అంత గుట్టుచప్పుడు కాకుండా ఏపీలో చర్చిల కోసం సర్కారు తనవంతు ప్రయత్నం చేస్తోంది. టెండర్ కాపీలతో సహా.. లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం.. తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేయగా ఈ విషయం వెలుగు చూసింది.
నవ్వి పోదురు గాక నాకేంటి సిగ్గు అన్నట్టు ఉంది జగన్‌రెడ్డి సర్కారు తీరు. కరోనా చికిత్స కోసం ఏపీ ప్రజలు అల్లాడిపోతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులు నిండిపోయాయి. డబ్బులు లేక, ప్రైవేట్‌లో చికిత్స పొందలేక ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. ఆక్సిజన్ కొరత, మందుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఈ సమయంలో ఒక్క రూపాయి ఉన్నా.. దాన్ని కొవిడ్ కట్టడికి, చికిత్సకు ఉపయోగించాలి కానీ.. ఏదో అత్యవసరం అన్నట్టు చర్చిల నిర్మాణానికి టెండర్లు పిలవడం ఏంటనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చర్చిల కాంపౌండ్ వాల్స్ కట్టడానికి సైతం టెండర్లు పిలవాల్సినంత అవసరం ఏమొచ్చిందో సర్కారుకే తెలియాలి.
ఇప్పటికే సంక్షేమ పథకాలతో ఖాళీ ఖజానా వెక్కిరిస్తోంది. ప్రస్తుతం అప్పులు, భూముల అమ్మకంతోనే ప్రభుత్వం నడుస్తోంది. ఇలాంది దుర్భర ఆర్థిక దుస్థితిలో కరోనా కాటు మరింత కూరుకుపోయేలా చేసింది. ఈ సమయంలో ప్రతీ రూపాయీ ప్రజాప్రయోజనం కేసం జాగ్రత్తగా వాడాల్సి ఉంటుంది. కరోనా టెస్టులు, కిట్‌లు, ఆక్సిజన్ సిలిండర్లు, రెమ్‌డెసివిర్ మందులు, వ్యాక్సిన్ల కొనుగోళ్లకు ఎంత డబ్బు ఖర్చు చేసినా సరిపోదు. ఇంకా ఎంతో బడ్జెట్ అవసరం ఉంటుంది. మరోవైపు, ఇప్పటికే గుదిబండలా మారిన సంక్షేమ పథకాలను కొనసాగించాల్సి ఉంటుంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో 4 కోట్లు పెట్టి.. చర్చిలు, చర్చి కాంపౌండ్ వాల్స్ నిర్మాణానికి టెండర్లు పిలవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? జగన్‌రెడ్డి సర్కారు ఎందుకిలా చేస్తోంది?
ఓవైపు జగన్‌రెడ్డి సీఎం అయినప్పటి నుంచీ ఏపీ... మత పరంగా సెన్సిటివ్ స్టేట్‌గా మారింది. ఆంధ్రప్రదేశ్‌లో మత మార్పిడులు భారీగా జరుగుతున్నాయనే ఆరోపణలు. చర్చిల ప్రాధాన్యం పెరుగుతోందని.. ఫాస్టర్‌ల పెత్తనం ఎక్కువ అవుతోందనే విమర్శలు. అందుకు తగ్గట్టుగానే.. వరుసగా జరుగుతున్న ఆలయాలపై దాడుల ఘటన ఆ అనుమానాలను మరింత పెంచుతోంది. అంతర్వేది రథం దగ్థం.. రామతీర్థం విగ్రహాల ధ్వంసం.. తిరుమలలో అన్యమత ప్రచారం.. వేరే మతస్తులకు టీటీడీలో ఉద్యోగాలంటూ ఆరోపణలు.. ఎస్‌వీబీసీ ఘటన.. బెజవాడ దుర్గమ్మ రథ వెండి సింహాల మాయం.. ఇలా అనేక వివాదాలతో ఏపీ ప్రభుత్వం ఓ మతానికి వ్యతిరేకం, మరో మతానికి అనుకూలం అనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. సర్కారు వ్యవహరిస్తున్న తీరు సైతం అందుకు తగ్గట్టే ఉంది. ప్రస్తుత కరోనా కల్లోల సమయంలో చర్చిల నిర్మాణం, మరమ్మత్తుల కోసం 4 కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలవడం.. జగన్‌రెడ్డికే చెల్లింది. టెండర్ కాపీలతో సహా.. లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం.. చేసిన ట్విట్టర్ పోస్ట్ కలకలంగా మారింది. జగన్‌రెడ్డి.. ఇది మీకు తగునా? కరోనా కాలంలో చర్చిలకు కోట్లకు కోట్లు ఖర్చు చేయడం సమంజసమా? అని నెటిజన్లు ట్వీట్లతో విరుచుకుపడుతున్నారు.