కరోనా కలకలం.. హైదరాబాద్ లో మరో మూడు కరోనా కేసులు!!
posted on Mar 4, 2020 @ 1:55PM
చైనా మొదలుకొని పలు దేశాలను వణికిస్తోన్న కరోనా వైరస్.. భారత్ లోనూ అలజడి సృష్టిస్తోంది. ఇటీవల తెలంగాణలో ఒకటి, ఢిల్లీలో ఒకటి కరోనా కేసులు నమోదయ్యాయని ప్రభుత్వం నిర్దారించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు కరోనా కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూ వెన్నులో వణుకు పుట్టిస్తోంది.
ఢిల్లీలో కరోనా పాజిటివ్ అని తేలిన వ్యక్తి కుటుంబానికి వైద్య పరీక్షలు నిర్వహించగా వారందరికీ పాజిటివ్ అని రిపోర్ట్ వచ్చినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ తెలిపారు. అతని కుటుంబంలో మొత్తం ఆరుగురు సభ్యులుండగా.. వారందరికీ కరోనా పాజిటివ్ అని తేలినట్లు వైద్యులు స్పష్టం చేశారు.
కాగా, ఇప్పటివరకూ భారత్ లో మొత్తం 28 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇండియాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మరింత పెరిగేలా ఉంది. తాజాగా తెలంగాణాలో మరో కేసు నమోదైనట్లు తెలుస్తోంది. హైదరాబాద్ మైండ్ స్పేస్ లోని ఓ కంపెనీ ఉద్యోగిని పరిమిలకు కరోనా సోకినట్టు వైద్యులు నిర్దారించారని సమాచారం. ఆమె రెండు వారాల క్రితం ఇటలీకి వెళ్ళొచ్చినట్టు తెలుస్తోంది. ఆమెలో కరోనా లక్షణాలు కనిపించడంతో వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం ఆమెకు చికిత్స అందిస్తున్నారు. మరోవైపు, ఆమె పనిచేసే కంపెనీ యాజమాన్యం ఇతర ఉద్యోగులను కొద్దిరోజుల పాటు ఇంటి వద్ద నుండే పనిచేయాలని ఆదేశించినట్టు సమాచారం.
హైదరాబాద్‌లో మరో ఇద్దరిలో కరోనా వైరస్ లక్షణాలను గుర్తించినట్టు తెలుస్తోంది. గాంధీ మెడికల్ కాలేజీలోని ఐసీఎమ్ఆర్ ల్యాబ్‌లో నిర్వహించిన పరీక్షల్లో ఇద్దరి రిపోర్టులు పాజిటివ్‌గా వచ్చాయి. దీంతో, వారి శాంపిల్స్‌ను తదుపరి పరీక్షల కోసం పూణే లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలాజీ కి పంపించారు. గురువారం పూణే ఎన్‌ఐవీ నుంచి రిపోర్టులు వచ్చే అవకాశం ఉంది. ఎన్ఐవీలో కూడా పాజిటివ్ అని తేలితే ఆ ఇద్దరికీ కరోనా సోకిందని నిర్ధారిస్తారు. వేగంగా విస్తరిస్తోన్న ఈ వైరస్ బారిన పడకుండా ఉండేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.