అమరావతికి మరో అన్యాయం.. ఎక్స్‌ప్రెస్-వే నుంచి ఔట్..!
posted on Mar 4, 2020 @ 11:52AM
విశాఖను పరిపాలనా రాజధానిగా ఎంచుకున్న జగన్ ప్రభుత్వం... అమరావతి అభివృద్ధి మాత్రం ఆగదని చెప్పుకొచ్చింది. శాసన రాజధానిగా అమరావతిని కొనసాగిస్తూ, ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని ప్రకటించింది. అయితే, అందుకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంటూ అమరావతికి తీవ్ర అన్యాయం చేస్తోంది జగన్ ప్రభుత్వం. అమరావతికి ఎలాంటి అన్యాయం చేయబోమంటూనే చేయాల్సిన నష్టం చేస్తున్నారు. ఇప్పటికే, మూడు రాజధానుల పేరిట సచివాలయాన్ని విశాఖకు... హైకోర్టును కర్నూలుకు తరలించాలని నిర్ణయం తీసుకున్న జగన్ ప్రభుత్వం... అమరావతిలో అభివృద్ధి పనులను సైతం నిలిపివేస్తోంది. అమరావతిలో అనేక నిర్మాణాలను నిలిపివేసిన సర్కారు... ఇప్పుడు, అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న అనంతపురం-అమరావతి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ వే నుంచి అమరావతిని తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వివిధ సాకుల పేరుతో జగన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ముఖ్యంగా భూసేకరణ భారంగా మారిందని, రహదారిని అమరావతి వరకు తీసుకెళ్లలేమని, గుంటూరు జిల్లా చిలకలూరిపేట వరకే పరిమితం చేయాలని దాదాపుగా నిర్ణయం తీసుకుందని అంటున్నారు. ఒకవేళ అదే జరిగితే, అప్పడది అనంతపురం-చిలుకలూరిపేట ఎక్స్ ప్రెస్ వేగా మాత్రమే మిగిలిపోతోంది. దాంతో అమరావతికి తీవ్ర అన్యాయం జరుగుతుంది.
అనంతపురం-అమరావతి ఎక్స్ ప్రెస్ వే ప్రాజెక్టు పురోగతిపై ఉన్నతస్థాయి సమీక్ష సందర్భంగా జగన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గుంటూరు జిల్లాలో భూసేకరణ కష్టంగా మారిందని, ప్రభుత్వంపై మరింత భారం పడుతుందని అధికారులు నివేదించంతో, దాన్ని సాకుగా తీసుకున్న ప్రభుత్వం... అలైన్‌మెంట్ మార్చాలని, చిలకలూరిపేట వరకే రహదారి అనుసంధానం చేయాలని, ఆపై వద్దని స్పష్టంగా ఆదేశించినట్లు తెలిసింది. చిలకలూరిపేట మీదుగా ఎన్‌హెచ్-16 వెళ్తోంది. ప్రతిపాదిత ఎక్స్ ప్రెస్ వేను అక్కడ నిర్మిస్తున్న బైపాస్ కు కలపాలని ఆదేశించినట్లు సమాచారం అందుతోంది. అక్కడ్నుంచి గుంటూరు, విజయవాడకు ఎలాగూ... హైవే ఉన్నందున, దానికి సమాంతంగా మరో పెద్ద రహదారి నిర్మించాల్సిన అవసరం ఏముందని ప్రభుత్వ పెద్దలు ప్రశ్నించినట్లు తెలిసింది. అనంతపురం ఎక్స్ ప్రెస్ ను చిలకలూరిపేట బైపాస్ కు కలిపితే, రాయలసీమ నుంచి వచ్చే వాహనాలు అక్కడ్నుంచి నేరుగా ఎన్ హెచ్ -16 ద్వారా విశాఖ వెళ్లడానికి వీలుగా ఉంటుందన్న కోణంలో నిర్ణయం జరిగినట్లు చెబుతున్నారు.
అయితే, కేంద్రం ఆమోదించిన ఆర్వోడబ్ల్యూ ప్రకారం అనంతపురం జిల్లా మర్రూరు నుంచి చిలకలూరిపేట, ప్రత్తిపాడు, ఫిరంగిపురం ప్రాంతాల నుంచి తాడికొండ మండలం పెద్దపరిమి దాకా రహదారిని నిర్మించాల్సి ఉంది. ఇందులో కర్నూలు, కడప నుంచి కలిసే రహదారులను మినహాయిస్తే కొత్తగా నిర్మించేది 394 కిలోమీటర్లు. అయితే, ఈ 394 కిలోమీటర్ల రహదారికి ముందుగానే ఎంత భూమి అవసరమవుతుందో అంచనా వేశారు. 28వేల ఎకరాలు అవసరమవుతుందన్న అంచనాతో ఒక్క భూసేకరణకే 2వేల 500కోట్లు వ్యయమవుతుందని లెక్కవేశారు. ఒకవేళ భూసేకరణ ఖరీదైన ప్రక్రియగా మారితే అదనంగా మరో 500కోట్లు అవసరమవుతాయని అప్పుడే అంచనా వేశారు. అయితే, ఇప్పుడు, భూసేకరణ భారం మారిందన్న సాకుతో అమరావతి వరకు ఎక్స్ ప్రెస్ వే రాకుండా మధ్యలోనే నిలిపివేయడంపై విమర్శలు చెలరేగుతున్నాయి.
అమరావతి కోసం పెద్దఎత్తున పోరాడుతోన్న రైతాంగానికి, అక్కడి ప్రజలకు ఇది మరింత ఆగ్రహం తెప్పించే నిర్ణయంగా కనిపిస్తోంది. పాతిక వేల కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న ఈ రహదారి నుంచి అమరావతిని తొలగిస్తూ జగన్ ప్రభుత్వం దాదాపు నిర్ణయం తీసుకోవడంపై మండిపడుతున్నారు. ఇంకా, రాజధానిని తరలించకముందే, కీలక ప్రాజెక్టు నుంచి అమరావతిని తొలగించడమేంటని అమరావతి వాసులు ప్రశ్నిస్తున్నారు.