వచ్చేస్తోంది.. వచ్చేస్తోంది... థర్డ్ వేవ్.. వచ్చేస్తోంది.. ..
posted on Jul 17, 2021 @ 10:07AM
లాక్ డౌన్ ఎత్తేయగానే అన్ని కార్యక్రమాలు యద్దేచ్ఛగా జరుగుతున్నాయి. పార్టీ సభలు, ప్రచార కార్యక్రమాలు పని ఉన్నాలేకున్న ప్రజలు రోడ్ల మీద విచ్చల విడిగా తిరుగుతున్నారు. ఆరోగ్య నిపుణులు ఎంత చెప్పిన ప్రజలు పార్టీల నాయకులూ వినిపించుకోవడం లేదు.. కానీ మళ్ళీ కరోనాకి భయపడి ప్రాణాలు అరచేతిలోపట్టుకుని ఇంట్లో రగ్గు తన్ని కప్పుకుని టైం రానేవస్తుంది..
వస్తోంది వస్తోంది థర్డ్‌వేవ్ వస్తోంది. ఎంతో దూరం లేదు. మళ్ళీ నిత్యం భయం తో మరణవార్తలు వినాల్సిన సమయం ఆసన్నమైంది. కరోనా మూడో ముప్పు ప్రారంభ దశలో ఉంది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాల్సిందే.. లేదంటే బకెట్ తన్నడం తప్పదు. ఇది ఎవరో ఒకరు చెప్పిన విషయం కాదు ఏకంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన హెచ్చరికలివి. డెల్టా వేరియంట్ విజృంభిస్తున్న తరుణంలో ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ థర్డ్‌వేవ్ వేవ్ మొదలైనట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అథనమ్ గేబ్రియాసిస్ తాజాగా హెచ్చరించిన సంగతి తెలిసిందే. దురదృష్టవశాత్తు మనం కరోనా థర్డ్‌వేవ్ ఆరంభదశలో ఉన్నామన్న చేదు నిజాన్ని చెప్పింది WHO.
కరోనా వైరస్ నిరంతరం ఊసరవెల్లి రంగులు మార్చినట్లు మారుతోందని, మరింత ప్రమాదకరమైన అతి భయంకరమైన వేరియంట్లు ఉద్భవిస్తున్నాయని WHO హెచ్చరించింది. ప్రస్తుతం డెల్టా వేరియంట్ వైరస్.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 111 దేశాల్లో వెలుగులోకి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఆ స్ట్రెయిన్ వ్యాప్తిచెందే అవకాశాలు ఉన్నట్లు టెడ్రోస్ హెచ్చరించారు. కరోనా తగ్గిందన్న అపోహ చాలా దేశాల్లో కన్పిస్తోందని డబ్లుహెచ్‌వో ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజలు మాస్క్‌లు ధరించకపోవడం, భౌతికదూరం పాటించకపోవడంతో కరోనా వేగంగా విజృంభిస్తోందని ప్రపంచ ఆరోగ్యసంస్థ తెలిపింది. చాలామంది గుంపులు గుంపులుగా తిరుగుతున్నారని.. దీంతో వైరస్ మళ్లీ వేగంగా వ్యాపిస్తోందని వెల్లడించింది.
ఒకవైపు వాక్సిన్ ప్రక్రియ యూరప్ దేశాలతో పాటు అమెరికాలో వేగంగా జరుగుతున్నప్పటికీ డెల్టా వేరియంట్ విజృంభించడం ఆందోళన కలిగిస్తోందని ప్రపంచదేశాలను భయం వైపు పరిగెత్తిస్తుందని డబ్లుహెచ్‌వో తెలిపింది. నాలుగు వారాలుగా ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరగడంతో పాటు మరణాలు కూడా పెరుగుతున్నాయి. 10 వారాలు తగ్గినట్టు తగ్గి మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. భారత్‌లో కూడా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఇండియాలో వారం రోజులుగా.. 38 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, కేరళలో కేసులు తగ్గకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతున్న సమయంలో అన్ని రాష్ట్రాలు ఒక్కసారిగా ఆంక్షలను ఎత్తేశాయి. జనంలో నిర్లక్ష్యం కూడా పెరిగింది. దీంతో ఎప్పటి లాగే కనీస జాగ్రత్తలను గాలికి వదిలేశారు. మాస్కులు పెట్టడం మానేశారు. విచ్చల విడిగా తిరిగేస్తున్నారు. పర్యాటక ప్రాంతాల్లో మళ్లీ రద్దు పెరిగింది. తీర్థయాత్రలు, సామూహిక వేడుకలు మొదలయ్యాయి. ఇలాంటి తప్పిదాలు కొవిడ్ మూడో దశకు కారణం కావొచ్చని వైద్యశాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికైనా ప్రజలు మాస్కులు పెట్టుకుని.. సామజిక దూరం పాటించండి..