విదేశీ ప్రయాణీకులకు కరోనా ప్రొటోకాల్ ఎత్తివేత
posted on Feb 13, 2023 @ 3:32PM
కరోనా మహమ్మారి మరో మారు, ప్రపంచవ్యాప్తంగా కలకలం, కలవరం సృష్టిస్తోందన్న వార్తలు డిసెంబర్ నెలలో తీవ్ర కలవరం సృష్టించాయి. జనం బెంబేలెత్తిపోయారు. కరోనా పుట్టిల్లు అయిన చైనాలో వేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా వేరియంట్ బీఎఫ్7 రకానికి చెందిన ఒమిక్రాన్ కేసులు భారత్ దేశంలోనూ నమోదు అవ్వడంతో దేశంలో మరోసారి లాక్ డౌన్ తప్పదా అన్న అనుమానాలు తలెత్తాయి. జనవరిలో దేశంలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉంటుందనీ వార్తలు వచ్చాయి. అయితే ఆ సమయంలోనే నిపుణుల అభిప్రాయాలను ఉటంకిస్తూ తెలుగువన్ ‘కరోనా వచ్చినా లాక్ డౌన్ ఉండదు’ అంటూ విస్పష్టంగా తెలియజేసింది.
కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ అప్పట్లో భారత్‌లో కొవిడ్ కేసుల పెరుగుదలపై కేంద్రం ఓ కన్నేసి ఉంచిందని చెప్పారు. మరోవైపు అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ర్యాండమ్‌గా నమూనాలను సేకరించి, పరీక్షించాలని మాండవీయ ఆదేశించారు.
ఇప్పటికే దేశ జనాభాలో అర్హులైనవారిలో 95 శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తయిన నేపథ్యంలో.. లాక్‌డౌన్‌వంటి పరిస్థితి రాదని తెలుగువన్ నిపుణుల అభిప్రాయాల ఆధారంగా విస్పష్టంగా పేర్కొంది. భారతీయుల రోగనిరోధక శక్తి చైనీయుల కంటే అధికంగా ఉందని కూడా వివరించింది. జనవరి వచ్చింది.. వెళ్లిపోయింది. కరోనా కేసుల సంఖ్య కూడా తగ్గుముఖం పట్టింది. రోజుకువంద కేసుల కంటే తక్కువే నమోదు అవుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే విదేశాల నుంచి వచ్చే ప్రయాణీకులకు ఇప్పటి వరకూ ఉన్న కరోనా ప్రొటోకాల్ ను కేంద్రం ఎత్తివేసింది. చైనా, సింగపూర్, హాంకాంగ్, కొరియా, థాయిలాండ్, జపాన్ దేశాల నుంచి భారత్‌కు వచ్చే ప్రయాణికులకు ప్రీ బోర్డింగ్ ఆర్టీ పీసీఆర్ పరీక్షలు తప్పనిసరి అంటూ అమలులో ఉన్న ఉత్తర్వులను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడం, పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటుండడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.