కరోనా కోరల్లో ఇండియా.. ఏపీ, తెలంగాణలో డేంజర్ బెల్స్
posted on Apr 2, 2021 @ 10:30AM
దేశంలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రోజురోజుకు వేలల్లో కొత్త కేసులు పెరిగిపోతున్నాయి. 10 రోజుల్లోనే యాక్టివ్ కేసులు ఐదు లక్షలు పెరిగాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఊహించవచ్చు. నాలుగు రోజులుగా అత్యధిక స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గతంలో కరోనా తీవ్ర స్థాయిలో ఉన్న సమయంలో నమోదైనన్ని కేసులు తిరిగి తాజాగా నమోదవుతూ వస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 81,466 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గురువారం ఒక్కరోజే కరోనా కారణంగా 469 మంది మృతి చెందారు.
దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 1,23,03,131కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ప్రస్తుతం దేశంలో 6,14,696 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా నుంచి ఇప్పటి వరకూ కోలుకున్న వారి సంఖ్య 1,15,25,039 కు చేరుకుంది. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకూ కరోనా కారణంగా 1,63,396 మంది మృతి చెందారు. గురువారం 50,356 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. దేశవ్యాప్తంగా రికవరీ రేటు 93.68% కాగా.. మరణాల రేటు 1.33%గా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో కొత్త కరోనా పాజిటివ్ కేసులు వెయ్యికి చేరువయ్యాయి. గురువారం 965 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఐదుగురు మృతి చెందారు. తెలంగాణలో యాక్టివ్ కేసుల సంఖ్య 9 వేలు దాటింది. మార్చి తొలివారంలో ఇది 12 వందలుగా ఉంది. జీహెచ్ఎంసీలో 254 కరోనా కేసులు నమోదయ్యాయి. మేడ్చల్‌లో 110, రంగారెడ్డిలో 97, నిజామాబాద్‌లో 64, నిర్మల్‌లో 39, జగిత్యాల్‌లో 35 కేసులు వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో కేసులు నమోదు అవుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ లోనూ కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. గురువారం 12 వందలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లా బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీలోని ఐదుగురు హాస్టల్ విద్యార్థులకు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో యాజమాన్యం 14 రోజుల పాటు సెలవు ప్రకటించి హాస్టల్‌ను మూసివేసింది. ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం మంచికలపాడులో కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న వ్యక్తి ఆకస్మికంగా మృతిచెందాడు. గ్రామ సచివాలయంలో బుధవారం టీకా వేయించుకున్న పొన్నపల్లి గాలయ్య(63) గురువారం మృతిచెందారు. కుటుంబసభ్యులతో మాట్లాడుతూనే నొప్పిగా ఉందంటూ కుప్పకూలిపోయాడు. ఆయన మృతికి వ్యాక్సిన్ కారణం కాదని వైద్యాధికారులు చెబుతున్నారు.