రాహుల్ యువరాజ పట్టాభిషేక మహోత్సవం
posted on Jan 20, 2013 6:50AM
కాంగ్రెస్ పార్టీ తను నిర్దేశించుకొన్న జైపూర్ మేధోమధనాల అంతిమ లక్ష్యం దిగ్విజయంగా సాధించగలిగింది. మూడు రోజుల సదస్సులో మొదటిరోజు “అది చేయవలసి ఉంది...ఇలాగ చేయవలసి ఉంది... త్యాగాలు, సిద్ధాంతాలు, క్రమశిక్షణ, సిద్ధాంతాలు, ఓట్లు” వంటి పడికట్టు పదాలు పట్టుకొని కాంగ్రెస్ నేతలు తమ ఊకదంపుడు ప్రసంగాలతో మైకులు విరగదీస్తే, రెండవ రోజయిన శనివారం నాడు, గల్లీ స్థాయి నాయకుడి నుండి డిల్లీ స్థాయి నేతల వరకు, ఉదయం నుండి సాయత్రంవరకూ కూడా “నేడే బ్రహ్మాండమయిన విడుదల...తప్పక చూడండి..” అంటూ రాహుల్ గాంధీ చెప్పట్టబోయే పదవి గురించి కబుర్లు మొదలుపెట్టారు. చివరికి వాళ్ళ కళ్ళలో ఆనందం చూసేందుకు రాహుల్ గాంధీని పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడిగా ప్రతిపాదిస్తూ రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ తీర్మానం ప్రవేశ పెట్టడం దానిని సీడబ్ల్యూసీ ఏకగ్రీవంగా ఆమోదించడంతో మదించబడిన కాంగ్రెస్ మేధస్సు నుండి ఒక చారిత్రాత్మకమయిన నిర్ణయం వెలువడటం జరిగిపోయింది.
మొత్తం మీద రెండు రోజుల మేధోమధనంతో తమ శ్రమకు ఫలితం దక్కినందుకు సంభరపడుతూ కాంగ్రెస్ పార్టీలో చిన్న పెద్దా నేతలందరూ నేటి నుండి మీడియా కెక్కి రాహుల్ రాకతో మనదేశానికి కలగబోయే ప్రయోజనాలు, అతని గొప్పదనం, నిరాడంబరత, సోనియమ్మ త్యాగాశీలత, ఇందిరా గాంధీ కుటుంబం దేశం కోసం చేసిన త్యాగాల వివరాలు వగైరా మనకి వివరించబోతున్నారు. పార్టీ సాదించిన ఈ ఘనకార్యానికి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ వాదులందరూ పండుగ చేసుకోవడం కూడా మనం చూడబోతున్నాము.