భద్రత ఆహారానికా అధికారానికా ?
posted on Jul 6, 2013 @ 9:51AM
....సాయి లక్ష్మీ మద్దాల
మొత్తం మీద ఆహార భద్రత చట్టాన్ని ఆర్డినెన్సు ద్వారా పట్టాలెక్కించేసింది సోనియా గాంధి ఆధ్వర్యం లోని మన్మోహన్ ప్రభుత్వం. ఎన్నికల ఘంటికలు మ్రోగటానికి సిద్ధంగా ఉన్న తరుణాన ఆఖరి అస్త్రాన్ని ప్రయోగించింది కేంద్రంలోని కాంగ్రెస్ సర్కార్. ఈ ఆహారభద్రత పధకానికి వీరు ఖర్చు పెట్టబోయేది 1,25,000 కోట్లు. దీని ద్వారా లబ్ధి పొందబోయే ప్రజలు దాదాపు 85 కోట్ల మంది. అంటే దేశ జనాభాలో సగానికి పైగా పేదవారే ఉన్నారా?మరి ఈ 60సం॥ ల కాలంలో భారతదేశం ప్రజల అభివృద్ధిని దోచుకున్నది ఎవరు?తగినంత పరిమాణంలో నాణ్యమైన ఆహారాన్ని సరసమైన ధరలకు అందించటం ద్వారా ప్రజలకు పౌష్టికాహారం భద్రత కల్పించటంతో పాటు వారి గౌరవ ప్రదమైన జీవనానికి దోహదపడటం ఈ కీలక చట్టం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఇప్పటికే ఏటా 5కోట్ల 50లక్షల టన్నుల ఆహార ధాన్యాల్ని చౌక ధరలకు పంపిణి చేస్తూ,లక్షల కోట్ల రూపాయల భారాన్ని నెత్తిన మోస్తున్నామన్నది కేంద్రపాలకుల వివరణ. ఈ కొత్త చట్టం అమలులోకి వస్తే ఏటా మరో 70లక్షల టన్నుల ధాన్యం అవసర మన్నది తద్వారా ప్రభుత్వంపై మరో 25,000కోట్ల భారం పడుతున్నదని ఇప్పటి వివరణ.
ఈ చట్టం ద్వారా ఎంతమంది పేదలకు కడుపునిండా ఆహారం దొరుకుతుందో అనుమానమే. ఎందుకంటే ప్రజా పంపిణి వ్యవస్థ నిండా ఉన్నది అవినీతి పందికొక్కులే కనుక. అయితే ఆహారభద్రత కల్పించటమంటే ఒక చట్టాన్ని చేసి,ప్రజలను అందునా పేదవారిని ఊరించటమా!పేదల ఓట్లే రేపటి తమ అధికారానికి ఆశల మెట్లు అని మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తోంది. కాని నానాటికి పెరుగుతున్న జనాభా అవసరాలకు తగినంత ఆహార ఉత్పత్తి ఎలా అనే విషయం మీద ఎందుకు దృష్టి పెట్టటం లేదు?వ్యవసాయానికి నిధులకేటాయింపు తీరు దేశ ఆహారభద్రతకు భరోసా ఇవ్వలేక పోతోంది. ఎరువులు,విత్తనాలు,సాగునీటి సౌకర్యాల కల్పనపై బడ్జెట్ లో ఎలాంటి ప్రతిపాదనలు,కేటాయింపులు ఉండవు. ఆహార భద్రత చట్టం ఉద్దేశాలు,లక్ష్యాలు నెరవేరాలంటే వ్యవసాయం దాని అనుబంధ రంగ మైన పాడి పరిశ్రమకు నిధులు మరింత పెరగాలి. పాడి పశువుల నిర్వహణకు,అవుతున్న ఖర్చుకు,పాలధరకు మధ్య పొంతన లేక పాడి రైతులు పాడికి దూరమవుతున్నారు. ఇది ఎవరి నిర్లక్ష్యం ?ఉపాధి హామీ పధకానికి 33,000కోట్ల బడ్జెట్ కేటాయించామని చెప్పటమే తప్ప దానిని వ్యవసాయానికి ఊతంగా మారుస్తామన్న దిశగా మాటలే లేకపోవటం శోచనీయం. కూలీలు దొరకక,వ్యవసాయ యంత్రాలు అందుబాటులో లేక పంటలు పండిచటం ఎలా సాధ్యం?
అధిక దిగుబడుల సాధనకు నిధుల కేటాయింపులు చాల కీలకం. దేశంలో 58%ప్రజలకు ఉపాధి కల్పిస్తున్నది వ్యవసాయ రంగమేనని తాజా ఆర్ధిక సర్వే వెల్లడి చేసింది. దేశంలో పేదల ఆహార అవసరాలు తీర్చడానికి వచ్చే ఏడాదికి 90,000కోట్ల రూపాయల మేర రాయితీలు ఇస్తున్నట్లు ప్రకటించారు. అందులో కనీసం మూడోవంతైన వ్యవసాయానికి కేటాయించకపోవటం ఎంత దారుణం. ఆరుగాలం కష్టపడిన రైతుకు శ్రమ ఫలితంగా తగిన గిట్టుబాటు ధర ఇవ్వటం న్యాయమా లేక ఓట్ల రాజకీయాల కోసం ఉచితబియ్యం లాంటి పధకాలు ప్రవేశపెట్టి వేల కోట్ల రూపాయలు కుమ్మరించటం న్యాయమా అన్నది పాలకులకే తెలియాలి. రెండు దశాబ్దాలుగా పండించేవాడిని చెండుకుతినేలా ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్వాకాల కారణంగా రోజుకు రెండు వేలమంది రైతులు సేద్యాన్ని వదిలేస్తున్నారు. ఈ కఠోర వాస్తవ గణాంకాలు దేశ ఆహార భద్రతకే ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి.
నిస్సార మవుతున్న నేలలు,అడుగంటుతున్న భూగర్భ జలాలు,సాగునీటి కొరత,వాతావరణ మార్పుల దుష్ప్రభావాలు అన్నిటికి మించి నేడు మార్కెట్లో నడుస్తున్న రైస్ మిల్లర్స్ అసోసిఎషన్ దంద ! బియ్యం ధరలను ఆయా మిల్లుల యాజమాన్యాల అసోసియేషన్ లు నిర్ణయిస్తు మార్కెట్ ను వారి గుప్పెట్లో పెట్టుకుంటే సదరు రాజకీయ నేతలు అందులో భాగస్వాములై ఏమి పట్టనట్లు ఉన్న పాపం ఎవరికి?ఇన్ని రకాలుగా రైతును నలుచుకు తింటూ అన్న దాతను పస్తుపెట్టి ఆహారభద్రత అంటూ తమ అధికారానికి భద్రత పెంచుకుంటున్న చేతకాని పాలకులను ఏమనాలి?ఈదేశానికి పట్టిన చీడ అనా లేక దౌర్భాగ్యమన?