ఏ గూటి చిలుక ఆ గూటి పలుకులే పలికేను
posted on Jul 5, 2013 @ 7:46PM
సుప్రీంకోర్టు సీబీఐని పంజరంలో చిలకలుగా వర్ణించినప్పటి నుండి దానికి అదే పేరు స్థిరపడిపోయింది. దానిని సార్ధకనామధేయంగా చేసుకోవడానికి సీబీఐ కూడా శక్తి వంచనా లేకుండా ప్రయత్నిస్తూనే ఉంది. కొద్ది నెలల క్రితం కేంద్ర ప్రభుత్వానికి డీ.యం.కే. మద్దతు ఉపసంహరించుకొంటున్నట్లు ప్రకటించిన గంటలోగానే, చెన్నైలో కరుణానిధి కొడుకు ఇంటి మీద సీబీఐ చిలుకలు వాలిపోయి ఒకటే హడావుడి చేసేసరికి, వాటి విశ్వసనీయత చూసి కేంద్రమే ముక్కున వేలు వేసుకొంది.
మళ్ళీ మొన్నామధ్య రైల్వేమంత్రిగారు బన్సాల్ గారి మేనల్లుడు విజయ్ సింగ్లా రైల్వే శాఖలో ఒక కీలకమయిన పోస్టుమీద అశోక్ కుమార్ అనే పెద్దాయన మనసు పారేసుకొంటే, దానిని ఆయనకు ఇప్పించేందుకు పది కోట్లు బేరం చేసుకొని, అందులో కేవలం రూ.89.68 లక్షలు మాత్రమే అడ్వాన్సుగా స్వీకరిస్తుంటే, సైంధవుడిలా అడ్డుపడిన సీబీఐ ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్లు మంత్రిగారి మేనల్లుడిని, ఆయనకు లంచం మేపుతున్న పెద్దమనుసులని పట్టేసుకొంటే, పాపం అన్నెం పున్నెం తెలియని మంత్రిగారి పదవి పుటుక్కున ఊడిపోయింది.
ఆయన మంత్రి పదవి ఊడగొట్టిన తరువాత ఇప్పుడు తాపీగా “ఆయన నిజంగానే అన్నెం పున్నెం తెలియని వ్యక్తి. ఆయన ఇంట్లో బేరసారాలు అయినంత మాత్రాన్న ఆయనకేమి ముట్టినట్లు కాదు. అయినా ఆ సమయంలో ఆయన ఇంట్లో లేడు వాకింగ్ కో షాపింగు కో బయటకి వెళ్ళేడు కూడా. అందువల్ల, మేనల్లుడు తన ఇంట్లో సాగించిన వ్యవహారం గురించి అసలతనికి తెలిసే అవకాశమే లేదు. అసలు ఆయన మేనల్లుడితో ఈ వ్యవహారం గురించి ఫోన్లో మాట్లాడిన దాఖలాలు లేనే లేవు. మేనల్లుడికి లంచం మేపిన వ్యక్తితో బన్సాల్ మంత్రిగారు అనేక విషయాలు మాట్లాడి ఉండొచ్చు గాక, ఆ పది కోట్ల డీల్ గురించి ఎప్పుడు మాట్లాడుకోలేదు, ఒట్టు!” అంటూ మాజీని చేసిన మంత్రిగారికి సీబీఐ చిలుకలు క్లీన్ చిట్ ఇస్తూ కిలకిలమన్నాయి.
అయితే, అసూయపరులయిన ప్రతిపక్షనేతలు కొందరు ఏ గూటి చిలుక ఆ గూటి పలుకే పలుకుతుందని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఏమయినప్పటికీ మంత్రిగారు చాలా పెద్దమనిషని మనకి అర్ధమయిపోయింది.